పెద్దిరెడ్డిపై 'అన‌ర్హ‌త' క‌త్తి.. హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై అన‌ర్హ‌త క‌త్తి వేలాడుతోంది. దీనికి సంబంధించి తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్య‌లు

Update: 2024-08-14 17:31 GMT

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై అన‌ర్హ‌త క‌త్తి వేలాడుతోంది. దీనికి సంబంధించి తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్య‌లు.. మ‌రింత‌గా ఆయ‌న‌కు సెగ పెంచుతున్నాయి. వ‌రుస విజ‌యాల‌తో 40 ఏళ్లుగా ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పెద్దిరెడ్డి విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. అయితే.. ఈసారి ఎన్నిక‌ల్లోఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నా.. ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న బీసీవై నాయ‌కుడు స‌హా.. టీడీపీ నేత చ‌ల్లా రామ‌చంద్రారెడ్డి కూడా కొన్ని విష‌యాల‌ను లేవ‌నెత్తుతూ.. హైకోర్టును ఆశ్ర‌యించారు.

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నా.. వాటిని ఎన్నిక‌ల అఫిడవిట్‌లో చూపించ‌కుండా.. మోస‌పూరితంగా విజ‌యం ద‌క్కించు కున్నార‌న‌నేది పెద్దిరెడ్డిపై బోడే రామ‌చంద్ర‌యాద‌వ్‌, చ‌ల్లాలు చేసిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్దిరెడ్డి స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌ను పేర్కొంటూ.. దానిలో పేర్కొన‌ని 500 గ‌జాల ఇంటి స్థ‌లం, ఒక చెరువు స్థ‌లం స‌హా మ‌రికొన్ని ఆస్థుల‌ను వారు కోర్టు ముందు ఉంచారు. ఇవ‌న్నీ.. పెద్దిరెడ్డి స‌తీమ‌ణి పేరుతో ఉన్నాయ‌ని తెలిపారు. అదేవిధంగా కొన్ని మ‌న‌వ‌ల పేరుతోనూ ఉన్నాయ‌ని వివ‌రించారు. వీటి వివ‌రాలు ఇవ్వ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేసి విజ‌యం ద‌క్కించుకున్నార‌ని తెలిపారు.

ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆయ‌న‌పై అన‌ర్హ‌త ఎందుకు వేయ‌కూడ‌ద‌ని పెద్దిరెడ్డి త‌ర‌ఫున న్యాయ‌వాదిని ప్ర‌శ్నించింది. ఇదేస‌మ‌యంలో తాజా ఎన్నికల్లో పుంగనూరు నుంచి పోటీచేసిన అభ్యర్థులకు కూడా నోటీసులు జారీ చేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ‌ట్టి పోటీనే ఎదుర్కొన్నారు. వైసీపీ హ‌వా లేక‌పోయినా.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తుడిచిపెట్టుకుపోయినా ఆయ‌న మాత్రం6 వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయ‌న కుమారుడు మిథున్‌రెడ్డి కూడా రాజంపేట నుంచి ఎంపీగా విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా హైకోర్టు ఎన్నిక‌ల అఫిడ‌విట్ విష‌యంలో సీరియ‌స్‌గా ఉండ‌డంతో ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలి. కేసు విచార‌ణ వ‌చ్చే నెల‌9వ తేదీకి వాయిదా ప‌డింది.

Tags:    

Similar News