పెద్దిరెడ్డితో అలానే ఉంటుంది.. హైకోర్టు చెప్పిన తర్వాత మరో గేటు!
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రెండు గేట్లు అయితే తెరిచారు కానీ.. ఇక్కడో ఫిట్టింగ్ పెట్టారు పెద్దిరెడ్డి. హైకోర్టు మాటతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం.. రెండు గేట్లను తెరిచారు.
నిత్యం ఏదో ఒక వివాదంతో ముడిపడి ఉంటుంది ఏపీలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు. కొద్ది రోజులుగా తిరుపతిలోని ఆయన ఇంటి ముందు మున్సిపాలిటీ నిధులతో నిర్మించిన రోడ్డుకు రెండువైపులా గేట్లు పెట్టేయటం.. జగన్ సర్కారు అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజల రాకపోకల్ని అడ్డుకోవటం తెలిసిందే. ఎవరెన్నిచెప్పినా.. వాటిని పట్టించుకోని ఆయన తన పెద్దతనాన్ని ప్రదర్శించే వారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న రెండు గేట్ల అంశం చర్చకు వచ్చింది.
పలువురు ఆయన తీరును నిరసిస్తూ గేటు వద్ద నిరసన తెలిపారు. మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ఇంటి వైపు ఉన్న రెండు గేట్లను తెరవాలన్న ఆదేశాల్ని ఇచ్చింది. కార్పొరేషన్ నిధులతో తిరుపతిలోని మారుతినగర్ - రాయల్ నగర్ మధ్య రాకపోకలకు బంద్ పెట్టేలా పెద్దిరెడ్డి తాను నిర్మించుకున్న సీసీ రోడ్ కు రెండు గేట్లను ఏర్పాటు చేశారు. ఈ అంశం ఏపీ హైకోర్టు ఎదుటకు రావటంతో.. ఆ రెండు గేట్లను ఓపెన్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రెండు గేట్లు అయితే తెరిచారు కానీ.. ఇక్కడో ఫిట్టింగ్ పెట్టారు పెద్దిరెడ్డి. హైకోర్టు మాటతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం.. రెండు గేట్లను తెరిచారు. అయితే.. ఈ రోడ్డు మధ్యలో మరో గేటును ఏర్పాటు చేయటం ద్వారా.. వాహనదారులు రాకపోకలు సాగించే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో.. ఈ మార్గంలో ప్రయాణించాల్సిన ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.
హైకోర్టు విస్పష్టంగా గేట్లు తెరవాలన్న ఆదేశాలు జారీ చేసిన వేళ.. కొత్తగా మరో గేటు ఏర్పాటు చేయటం చూస్తే..పెద్దిరెడ్డా మజాకానా? అనుకోకుండా ఉండలేం. అధికారంలో ఉన్నా లేకున్నా తన అధిక్యతను ప్రదర్శించటానికి హైకోర్టు ఆదేశాల్ని సైతం లైట్ తీసుకునే ఆయనపై చంద్రబాబు సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలన్న మాట వినిపిస్తోంది.