ఆ దేశంలో గుండెలు బాదుకుంటూ రోడ్లపైకి జనం.. ప్రధానిపైనే వారి గురి

బ్రిటన్ నుంచి బంగ్లాదేశ్ దాకా ఈ ఏడాది అంతా ప్రధానమంత్రులు వార్తల్లో నిలిచారు.

Update: 2024-09-02 09:30 GMT

బ్రిటన్ నుంచి బంగ్లాదేశ్ దాకా ఈ ఏడాది అంతా ప్రధానమంత్రులు వార్తల్లో నిలిచారు. భారత్, పాకిస్థాన్, జపాన్, థాయ్ లాండ్ ఇలా అనేక దేశాల్లో ప్రధానమంత్రులు ఎన్నికల్లో గెలుపోటములు.. పదవీచ్యుతులు కావడం ద్వారా మీడియాలో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలోని మరో దేశంలోనూ ప్రధానిపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆయన రాజీనామా చేయాలంటూ వీధుల్లోకి వస్తున్నారు. చూస్తూ ఉంటే.. ఆయన పదవికీ ఎసరు తప్పేలా లేదు.

బందీలను విడిపించండి..

హమాస్ పై సరిగ్గా 11 నెలలుగా యుద్ధంలో ఉంది ఇజ్రాయెల్. నిరుడు హమాస్ ఉగ్రవాదుల ఉన్మాదంతో ఇజర్రాయెల్ తీవ్రంగా గాయపడింది. 700 మందిని బలితీసుకున్న హమాస్ ఉగ్రవాదులు 200 మందిని తమతో బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. వీరిలో కొందరిని విడుదల చేసినా.. ఇంకా వంద మంది వరకు బందీలుగానే ఉన్నట్లు సమాచారం. తాజాగా వీరిలో ఇజ్రాయెలీ-అమెరికన్ సహా ఆరుగురిని హమాస్ హతమార్చింది. వీరి డెడ్ బాడీలను తీసుకొచ్చారు. వాటిని చూసిన ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉగ్ర సంస్థ చెరలో ఉన్నవారిని విడిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోండి

హమాస్ ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నా.. వారితో కాల్పుల విరమణ ఒప్పందానికే ఇజ్రాయెలీలు మొగ్గుచూపుతున్నారు. హింస కారణంగా వారు విసిగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆదివారం వేలాది మంది జెరూసలెంలోని వీధుల్లోకి వచ్చారు. యుద్ధం అంటూ ఊగిపోతున్న ప్రధాని బెంజామిన్ నెతన్యాహూకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెతన్యాహు ఇంటి ఎదుట రాత్రంతా ఆందోళన కొనసాగించారు. దేశంలోని అతిపెద్ద వాణిజ్య సంఘం హిస్టద్రుత్ సోమవారం బంద్ కు పిలుపునిచ్చింది. ఇలాంటిది తొలిసారి కావడం గమనార్హం. కాగా, నెతన్యాహూ రైట్ వింగ్ లికుడ్ పార్టీ అధినేత. మొదటినుంచి ఆయనది దూకుడు స్వభావమే. నెతన్యాహూ అధికారంలో ఉన్న సమయంలోనే ఎక్కువసార్లు ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణలు తలెత్తాయి.

యుద్ధం ఎటుపోతుందో?

అక్టోబరు7న హమాస్ ఉగ్ర దాడితో మొదలైంది ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం. అంటే దాదాపు 11 నెలలు. ఇప్పటికే వేలాదిమంది గాజావాసులు మరణించారు. ఇజ్రాయెల్ ఇంకా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా హమాస్ ఆరుగురు బందీలను హతమార్చడంతో అమెరికా కూడా తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ పై దాడి చేయకపోతే అది దైవ దూషణే అని ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా ఖొమేనీ ప్రకటించారు. తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ అగ్ర నేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ హతమార్చడాన్ని ఇరాన్ తీవ్రంగా తీసుకుంది. లెబనాన్ హెజ్జొల్లా సాయంతో ఇజ్రాయెల్ పై దాడికి ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, వీటి మధ్యలో శాంతి రేఖ అన్నట్లుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య చర్చలకు ఈజిప్ట్ చొరవ చూపుతోంది. కానీ.. ఇంతలోనే బందీలను హతమార్చింది హమాస్. ఇప్పుడు ప్రజల ఆందోళనల నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News