రెండున్నర గంటల విచారణలో పేర్ని జయసుధ ఏం చెప్పారు?

ఈ సందర్బంగా ఆమెను రెండున్నర గంటల పాటు విచారించారు. ఎప్పటిలానే చాలా విషయాలు తనకు తెలీవని.. గుర్తు లేవని చెప్పినట్లుగా తెలుస్తోంది.

Update: 2025-01-02 05:18 GMT

రేషన్ బియ్యం మాయం కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ బందరు తాలుకా పోలీసుస్టేషన్ కు హాజరు కావటం తెలిసిందే. ఈ సందర్బంగా ఆమెను రెండున్నర గంటల పాటు విచారించారు. ఎప్పటిలానే చాలా విషయాలు తనకు తెలీవని.. గుర్తు లేవని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. ప్రధానంగా ఆమె ఒక కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

తనకు ఆరోగ్యం సరిగా లేని కారణంగా.. రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచే గోదాము నిర్వహణకు సంబంధించిన బాధ్యతల్ని గోదాము మేనేజర్ మానస్ తేజ చూస్తుంటాడని.. తనకు తెలీకుండానే బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లుగా ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. తప్పును మేనేజర్ మీదకు తోసేసే ప్రయత్నం జరిగినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.

వారిని విచారించిన వేళలో.. చెప్పిన అంశాలను ప్రశ్నల రూపంలో పేర్ని జయసుధను అడగ్గా.. తనకు తెలీదని.. గుర్తు లేదంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. పోలీసుల విచారణకు ఆమె సహకరించినట్లుగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పోలీసు విచారణ వేళ జయసుధ వచ్చిన వాహనం వివాదాస్పదంగా మారింది. కారణం.. పోలీసు విచారణకు ఆమె నగర మేయర్ వాహనాన్ని వినియోగించారు. ఈ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పోలీసు విచారణకు హాజరు కావాలంటూ డిసెంబరు 31 రాత్రి జయసుధ ఇంటికి పోలీసులు వెళ్లటం.. ఆమె అక్కడ లేకపోవటంతో గురువారం విచారణకు రావాలంటూ ఇంటి గోడకు నోటీసులు అంటించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగర మేయర్ కారులో విచారణకు జయసుధ హాజరయ్యారు. ప్రభుత్వ వాహనాన్ని ఇలా ఎలా వాడతారు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

మాజీ మంత్రి సతీమణి అయిన పేర్ని జయసుధ పోలీసు స్టేషన్ కు వచ్చిన వేళ.. ఆమె వెంట మేయర్.. డిప్యూటీ మేయర్.. కార్పొరేటర్లు.. లాయర్లు.. పార్టీ నాయకులు పోలీసు స్టేషన్ కు వచ్చారు. అయితే.. ఇలాంటి సందర్భాల్లో పార్టీ నేతల్ని.. కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ కు కాస్త దూరంలో నిలిపివేయటం చూస్తుంటాం. కానీ.. అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. పోలీసులు చూసిచూడనట్లుగా వ్యవహరించారన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. పోలీసు విచారణ రెండున్నర గంటల పాటు సాగటాన్ని వారు తప్పు పట్టటం గమనార్హం. ఆరోగ్యం బాగోలేకపోతే. అన్నేసి గంటలు ఎలా ప్రశ్నిస్తారు? అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టటం చూస్తే.. పోలీసు విచారణ వేళలోనూ.. పేర్ని వారి అభిమానులు.. ఫాలోయర్లు తగ్గేదేలే.. అన్నట్లుగా వ్యవహరించారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

Tags:    

Similar News