లీటరు పెట్రోలో.. డీజిల్ మీద రూ.15 తగ్గింపు.. దేశంలో ఎక్కడో తెలుసా?
లక్షద్వీప్ లోని ఆండ్రోట్.. కల్పేని దీవుల్లో లీటరు పెట్రోల్.. డీజిల్ మీద రూ.15.3 చొప్పున తగ్గించగా.. లక్ష ద్వీప్ లోని కవరత్తి.. మినికాయ్ లలో మాత్రం లీటరుకు రూ.5.2 చొప్పున తగ్గింపు ఇవ్వటం గమనార్హం.
మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాతి నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ పెట్రోల్.. డీజిల్ ధరలను మార్చకుండా ఉండే అలవాటు మోడీ సర్కారుకు ఉందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే.. పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. బీజేపీ ఏలుబడిలో ఉండే రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే వేళలో అయితే.. పెట్రోల్.. డీజిల్ ధరలు పైసా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం.. ఎన్నికల ఫలితాలు వెల్లడైనంతనే.. అసలు వడ్డీ అన్న తరహాలో పెరిగిపోవటం కనిపిస్తుంది.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి కాస్త ముందుగా లీటరు పెట్రోల్.. డీజిల్ పై రూ.2 చొప్పున ధర తగ్గిస్తూ కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. కేంద్రం లీటరు మీద రూ.2 తగ్గించిన నేపథ్యంలో.. ఆ మొత్తం తుది వినియోగదారుడి వద్దకు చేరేసరికి రూ.3 వరకు లీటరకు ధర తగ్గే పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దేశంలో మరే రాష్ట్రంలో లేనట్లుగా ఒక ప్రాంతంలో మాత్రం కేంద్రం లీటరు పెట్రోల్.. డీజిల్ మీద ఏకంగా రూ.15.30 చొప్పున ధర తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం గురించి తెలిసినంతనే జెలసీకి గురి కావటం ఖాయం.
ఇంతకూ ఆ ప్రాంతం ఏమిటన్న విషయంలోకి వెళితే..లక్షద్వీప్ లోని ఆండ్రోట్.. కల్పేని దీవుల్లో లీటరు పెట్రోల్.. డీజిల్ మీద రూ.15.3 చొప్పున తగ్గించగా.. లక్ష ద్వీప్ లోని కవరత్తి.. మినికాయ్ లలో మాత్రం లీటరుకు రూ.5.2 చొప్పున తగ్గింపు ఇవ్వటం గమనార్హం. ఇంతకూ ఇంత భారీ ఆఫర్ ఎందుకంటే దానికి కారణం లేకపోలేదు. ఇంతకు ముందు వరకు రాజకీయ నేతలు తమ ఫ్యామిలీలతో లక్షద్వీప్ లో సెలవుల్ని గడిపేందుకు వచ్చే వారని.. అయితే లక్ష ద్వీప్ లో ప్రజలు తమ కుటుంబాలతో గడిపేందుకు రావాలని కోరుకున్న తొలి నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీగా పేర్కొనటం గమనార్హం.
ఇదంతా చూస్తే.. లక్ష ద్వీప్ ఎపిసోడ్ ను ఎన్నికల్లో భావోద్వేగ అంశంగా మార్చేందుకు తాజా తగ్గింపు ఒక కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత భారీగా పెట్రోల్.. డీజిల్ ధర తగ్గించిన కారణంగా టూరిజం మరింత పెరిగే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లక్ష ద్వీప్ ను టూరిజం కోసం ప్రమోట్ చేసే పనిని చేపట్టిన ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు విరుచుకుపడటం.. ఆ తర్వాత వారిని మంత్రి పదవుల నుంచి తొలగించారు. లక్ష ద్వీప్ లను ప్రమోట్ చేస్తున్న ప్రధాని మోడీపై మాల్దీవ్ దేశ ప్రభుత్వం గుర్రుగా ఉండటం.. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల పరంపర తెలిసిందే.