ఈ తప్పు చేయొద్దు.. ఆమె పేరు చెప్పొద్దు.. చిక్కుల్లో పడొద్దు

తాజాగా కోల్ కతాలోని పీజీ వైద్య విద్యార్థిని హత్యాచార ఉదంతం నేపథ్యంలో పలువురు ఆమె పేరును.. ఫోటోను షేర్ చేస్తున్నారు. ఆమె గురించి సోషల్ మీడియాలో రాస్తున్నారు.

Update: 2024-08-24 03:59 GMT

ఇప్పుడు నడుస్తున్నదంతా సోషల్ మీడియా కాలమే. వాట్సాప్ హవానే. పని ఉన్నా లేకున్నా.. అవసరం ఉన్నా లేకున్నా.. చేతిలో ఉండే సెల్ ఫోన్ మీద చేతి వేళ్లు కదిలిపోతూ ఉంటాయి. వీలైనంత ఎక్కువగా స్మార్ట్ ఫోన్ తో ఎంగేజ్ అయ్యేందుకు చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి తీరుతో వచ్చే సమస్యలు ఒక ఎత్తు. అమానుషానికి గురైన వారికి అండగా నిలవాలన్న తపనతో.. మిగిలిన వారికి భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో.. శోధించి మరీ చిక్కుల్లో పడుతున్న వైనం ఇప్పుడు ఎక్కువ అవుతోంది. ఇలాంటి వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అత్యాచారానికి గురైన మహిళకు సంబంధించిన పేరు.. వివరాలు.. వారి ఫోటోల్ని షేర్ చేయకూడదు. తాజాగా కోల్ కతాలోని పీజీ వైద్య విద్యార్థిని హత్యాచార ఉదంతం నేపథ్యంలో పలువురు ఆమె పేరును.. ఫోటోను షేర్ చేస్తున్నారు. ఆమె గురించి సోషల్ మీడియాలో రాస్తున్నారు. తమ ఆగ్రహాన్ని.. ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడుతోంది. చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ.. ఆ పేరుతో బాధితురాలి ఫోటోను.. పేరును ప్రస్తావిస్తూ పెట్టే పోస్టులతో చట్టబద్ధమైన చర్యల చిక్కుల్లోకి పడుతున్న పరిస్థితి.

తాజాగా కోల్ కతా వైద్య విద్యార్థిని ఫోటోను.. పేరును పలువురు ప్రస్తావించటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి ప్రస్తావించటంతో పాటు.. ఈ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. సోషల్ మీడియా.. వాట్సాప్.. యూ ట్యూబర్ల పుణ్యమా అని బాధితుల పేర్లు.. ఫోటోలు.. వివరాలు బయటకు వస్తున్నాయి. చట్టప్రకారంగా చూసినా ఇదెంత పెద్ద నేరమన్న విషయాన్ని రూల్ పొజిషన్ ను చూస్తే అర్థమవుతుంది.

భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 72 (పాత ఐపీసీ 228(ఎ)) ప్రకారం బాధితురాలి గుర్తింపును వెల్లడించకూడదు. అంతేకాదు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం లైంగిక దాడికి (లైంగిక వేధింపులకు) గురైన బాధితురాలి పేరు.. ఫోటో.. అడ్రస్.. తల్లిదండ్రుల పేర్లను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రింట్.. ఎలక్ట్రానిక్.. సోషల్ మీడియా.. ఏ మాధ్యమాల్లోనూ ప్రచురించకూడదు. అత్యాచార బాధితురాలు చనిపోయినా ఇది వర్తిస్తుంది.

ఒకవేళ తప్పనిసరిగా చెప్పాల్సి వస్తే అధికారిక అనుమతి తీసుకోవాలి. అత్యాచార కేసుల ఎఫ్ఐఆర్ కాపీలను బయటపెట్టకూడదు. ఒకవేళ బాధితురాలి బతికి ఉండి.. ధైర్యంగా తన పేరును ప్రపంచానికి తెలియాలనుకుంటే మాత్రం వెల్లడించే వీలుంది. చట్టప్రకారం ఇంతటి తీవ్రత ఉన్న అంశంపై అవగాహన లేని పలువురు.. తమకు తెలిసిన సమాచారాన్ని నలుగురికి తెలియజేయాలన్న అత్రుతతోనూ.. ఆవేదనతోనూ షేర్ చేసి చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా హత్యాచారానికి గురైన కోల్ కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆమె ఫోటోలు.. వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని తక్షణమే తొలగించి.. చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇప్పటికే పలువురు యూట్యూబర్లు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు కోల్ కతా బాధితురాలి పేరును ప్రస్తావించటం.. ఆమె వివరాల్ని వెల్లడించటం ద్వారా చిక్కుల్లో పడ్డారు. ధ్రవ్ రాథీ.. నటి జెనీలియా ఇలా పలువురు ఆమె పేరును ప్రస్తావించటం ద్వారా సమస్యల్లో చిక్కుకున్నారు. ప్రస్తుతం వారిపై చట్టప్రకారం చర్యలకు అవకాశం ఉంది. కొంతకాలం క్రితం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక సామూహిక అత్యాచారం విషయంలోనూ బాధిత బాలిక ఫోటోలు.. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఉదంతంలో నలుగురిని ఐపీ అడ్రస్ ల ద్వారా పట్టుకొని సుమోటోగా కేసు నమోదు చేశారు. అందుకే.. లైంగిక దాడి బారిన పడిన బాధితుల పేర్లు.. వివరాలు.. వారి ఫోటోలను వెల్లడించొద్దు. షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. లేదంటే.. చిక్కుల్లో పడేందుకు బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. బీకేర్ ఫుల్.

Tags:    

Similar News