దీపావళికి ఉద్యోగులకు కార్లు గిఫ్టుగా ఇచ్చిన ఫార్మా కంపెనీ
హర్యానాకు చెందిన ఒక ఫార్మా కంపెనీ తన సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో అత్యుత్తమ పని తీరును ప్రదర్శించిన ఉద్యోగులకు కార్లను బంఫర్ గిఫ్టుగా ఇచ్చారు.
దక్షిణాదితో పోలిస్తే.. ఉత్తరాదిన దీపావళి వచ్చిందంటే చాలు బహుమతులు క్యూ కడుతుంటాయి. కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు బోనస్ లు మాత్రమే కాదు.. కొందరు బాగా పని చేసిన వారికి భారీ బహుమతులను ఇవ్వటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా ఆ జాబితాలో చేరిందో ఫార్మా కంపెనీ. హర్యానాకు చెందిన ఒక ఫార్మా కంపెనీ తన సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో అత్యుత్తమ పని తీరును ప్రదర్శించిన ఉద్యోగులకు కార్లను బంఫర్ గిఫ్టుగా ఇచ్చారు.
పంచకులలో ఉన్న ఈ ఫార్మా కంపెనీ గత ఏడాది దీపావళి వేళలో అత్యుత్తమ పని తీరును ప్రదర్శించిన పన్నెండు మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇస్తే. ఈ ఏడాది 15 మంది ఉద్యోగుల్ని ఎంపిక చేసింది. వీరికి అక్టోబరు 14న కార్లను బహుమతిగా ఇచ్చారు. వీరిలో కొందరికి టాటా పంచ్.. మరికొందరికి మారుతి గ్రాండ్ విటారా కార్లను దీపావళి గిఫ్టుగా అందజేశారు.
ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చే కార్యక్రమాన్ని సదరు కంపెనీ ఎండీ స్వయంగా విచ్చేసి మరీ కార్ల తాళాల్ని అందజేశారు. అంతేకాదు.. ఈ సంస్థలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. కార్లను బహుమతిగా పొందిన ఉద్యోగులు.. కంపెనీ పని మీద కారును వినియోగిస్తే దానికి అయ్యే ఇంధనం ఖర్చును కంపెనీనే భరిస్తుంది. దీపావళి బహుమతులు జోరు మొదలైన వేళ.. సూరత్ కు చెందిన డైమైండ్ వ్యాపారులు మరింత భారీగా దీపావళి గిఫ్టులుఇవ్వటం తెలిసిందే. ఈ ఏడాది వారు ఎలాంటి గిఫ్టులు ఇస్తారో చూడాలి.