అమలాపురం టికెట్ : మంత్రి విశ్వరూప్ కి జగన్ ఏం చెప్పారు...?
అయితే విశ్వరూప్ కి జగన్ తో ఉన్న సాన్నిహిత్యంతో మళ్లీ ఆయనకే టికెట్ దక్కుతుందని అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కీలకమైన సీటు అమలాపురం. ఎంతో ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్న అమలాపురం అసెంబ్లీ సీటు కోసం అధికార వైసీపీలో పోటీ చాలా ఎక్కువగా ఉంది. అయితే మంత్రిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్ అంటే జగన్ కి ప్రత్యేక అభిమానం ఉంది. అందువల్లనే ఆయనను అయిదేళ్ల మంత్రిగా చేసారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పినిపె విశ్వరూప్ 2019లో మళ్లీ గెలిచారు.
ఇక ఆయనకు 2024లో టికెట్ దక్కుతుందా లేదా అన్న చర్చ ఒకటి వైసీపీలో ఉంది. దాంతో పాటు వైసీపీలో చాలా మంది ఈ సీటు మీద కన్నేశారు. ముఖ్యంగా అమలాపురం ఎంపీగా ఉన్న అనూరాధ ఈ సీటు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే విశ్వరూప్ కి జగన్ తో ఉన్న సాన్నిహిత్యంతో మళ్లీ ఆయనకే టికెట్ దక్కుతుందని అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది.
అయితే సర్వేలలో మంత్రి పనితీరు పట్ల వ్యతిరేకంగా నివేదికలు వస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే టైంలో మంత్రికి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దాంతో ఈసారి మార్పు తధ్యమని అంతా అనుకుంటున్నారు. అయితే శుక్రవారం అమలాపురం వచ్చిన జగన్ పనిలో పనిగా స్థానిక రాజకీయ పరిస్థితులను కూడా సమీక్షించారు.
అమలాపురం సీటు వైసీపీకి ప్రతిష్టాత్మకమైనది కాబట్టి గెలిచి తీరాలని వైసీపీ పట్టుదలగా ఉంది. దాంతో ఈ సీటును విశ్వరూప్ తనయుడు డాక్టర్ శ్రీకాంత్ కి ఇస్తారని అంటున్నారు. మంత్రి కుమారుడు నియోజకవర్గంలో అపుడే విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన విశ్వరూప్ వారసుడిగా కూడా వైసీపీలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దాంతో జగన్ మంత్రితో మాట్లాడినట్లుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో శ్రీకాంత్ కే టికెట్ ఇస్తారని అంటున్నారు. మీ కొడుకునే జనంలో గట్టిగా తిరిగేలా చూడండి అని విశ్వరూప్ కి జగన్ సూచించారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఈ సీటు కాంగ్రెస్ కి గట్టి పట్టున్నది. టీడీపీ పుట్టాక గెలిచింది మూడు సార్లు మాత్రమే. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ 46 వేల ఓట్లను తెచ్చుకుని తన సత్తా చాటింది. అదే విధంగా 45 వేల ఓట్లను తెచ్చుకుని జనసేన కూడా పోటాపోటీగా నిలిచింది. దీంతో పొత్తులు కనుక ఉంటే ఈ సీట్లో వైసీపీకి ఇబ్బందులు వస్తాయని చర్చ ఉంది. కానీ కోనసీమలో వైసీపీ ఎక్కడా వెనకబడకూడదని ఆ పార్టీ డిసైడ్ అయింది.
అందుకే టికెట్ల కేటాయింపులో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. విశ్వరూప్ కుమారుడికే టికెట్ ఇవ్వడం ద్వారా కొత్త ముఖాన్ని పరిచయం చేసినట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే మంత్రి తాను తిరిగి ఎమ్మెల్యేగా తన కుమారుడికి అమలాపురం ఎంపీగా రెండు టికెట్లు కోరుతున్నట్లుగా చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం ఒకటే టికెట్ అని స్పష్టం చేసారని అంటున్నారు.
ఇక టీడీపీలో అయితాబత్తుల ఆనందరావు మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు. కానీ జనసేన ఈ సీటు కోసం పట్టుబడుతోంది. దాంతో ఆ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేక విడిగా పోటీ చేస్తారా అన్నది తెలియడం లేదు. ఏది ఏమైనా 2014లో బలముండి కూడా వైసీపీ అమలాపురాన్ని కోల్పోయింది. ఈసారి అలా కాకూడదు అని భావిస్తోంది అని అంటున్నారు.