పిన్నెల్లి సోదరులకు మొదలైనట్లేనా?... తెరపైకి రౌడీ షీట్!
అవును... పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను పగలగొట్టిన సంగతి తెలిసిందే
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ పల్నాడు జిల్లా, రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేయడానికి వెళ్లినట్లుగా వెళ్లిన ఆయన ఈవీఎం ను నేలకేసి కొట్టారు. ఈ ఘటనపై వారిపై రౌడీ షీట్ ఓపెన్ అయినట్లు తెలుస్తుంది!
అవును... పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను పగలగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అడ్డుకున్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరి రావు పైనా పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఎలా బయటకు వచ్చాయనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఆ వీడియో మాత్రం వైరల్ గా మారింది.
ఆ వ్యవహారం అక్కడితో ఆగలేదు. పోలింగ్ మరుసటి రోజు కూడా కారంపూడిలో పిన్నెల్లి సోదరులిద్దరూ తమ అనుచరులతో కలిసి దాడులు కూడా చేశారని చెబుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. దీంతో... ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి సోదరులపై కేసులు నమోదయ్యాయి!
ఈ క్రమంలో... ఈ ఘటనల్లో పాల్గొన్న పిన్నెల్లి సోదరులు, వైసీపీ రౌడీమూకలపై హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పై మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో శనివారం రౌడీ షీట్ తెరిచినట్లు తెలిసింది. అయితే వీరిపై రౌడీ షీట్ తెరవడం వివరాలు చెప్పేందుకు పోలీసు అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు!