ఈ ఎన్నికల్లో జగన్ ఓటమి తథ్యం అంటున్న పీకే... చెప్పిన కారణాలివే!
తాజాగా ఒక జాతీయ దినపత్రిక ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు!
వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలవడం దాదాపు అసాధ్యం అని.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న వైఖరులు, ఎంచుకుంటున్న సలహాదారులు, ఆలోచిస్తున్న విధానాలను పరిశీలిస్తే ఆయన గెలుపు అసాధ్యం అని అంచనా వేయడం అంత కష్టమేమీ కాదని చెబుతూ... అందుకు గల ప్రధాన కారణాలను సవివరంగా వివరిస్తున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్! తాజాగా ఒక జాతీయ దినపత్రిక ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు!
అవును... వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు అసాధ్యం అని అంచనా వేయడం ఏమాత్రం కష్టం కాదని.. ఆయనను ఓడించడం కష్టమని ఇంకా ఎవరైనా నమ్ముతుంటే అంతకంటే తప్పుడు అంచనా మరొకటి ఉండదని అన్నారు ప్రశాంత్ కిశోర్! అందుకు ఆయన చెబుతున్న కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం..!
కేంద్రంలో బీజేపీకి ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి బేషరతుగా మద్దతిచ్చారని.. అయితే ఇప్పుడు అదే బీజేపీ.. టీడీపీ వైపు చూస్తోందని.. దీన్ని బట్టి గమనిస్తే... సలహాదారులను నియమించుకోవడంలోనూ, మిత్రపక్షాలను ఎంచుకోవడంలోనూ జగన్ ఎలాంటి తప్పటడుగులు వేస్తారనేది అర్ధమవుతుందని పీకే తెలిపారు. గతంలో కేసీఆర్ ను నమ్మి.. దెబ్బతిన్నారని అన్నారు.
ఇదే క్రమంలో జగన్ ఓడిపోవడానికి అవసరమైన మరో కారణాని విశ్లేషించే క్రమంలో సంక్షేమ పథకాల ప్రస్థావన తీసుకొచ్చారు పీకే. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున అప్పులు చేసి మరీ తాయిలాలు ఇవ్వడమే జగన్ ఈ ఐదేళ్లూ ఏకైక పనిగా పెట్టుకున్నారని తెలిపిన ఆయన... ఏపీ లాంటి మిడిల్ ఇన్ కం రాష్ట్రాల్లో ఇది వ్యూహాత్మక తప్పిదం అని తెలిపారు.
ఇదే సమయంలో మౌలిక వసతుల కల్పనను పూర్తిగా గాలికి వదిలేయడం కూడా ఈ వ్యూహాత్మక తప్పిదంలో భాగమే అని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో బీహార్, ఝార్ఖండ్ వంటి అల్పాదాయ రాష్ట్రాల్లో "క్లాస్ వార్" గురించి మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది కానీ... తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వంటి మధ్యాదాయ రాష్ట్రాల్లో అది ఏమాత్రం ప్రయోజనం కాదని నొక్కి చెప్పారు!
ఇక జగన్ వయసు, గత ఎన్నికల్లో ఆయన సాధించిన భారీ విజయం దృష్ట్యా.. ఆయన దక్షిణాదిలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగి ఉండాలని అభిప్రాయపడిన పీకే... అయితే ఆయన తనకు తానే అడ్డుగోడలు కట్టుకుని, ఒక చట్రానికి పరిమితమయ్యారని అన్నారు. ఒక చోట కూర్చుని.. డీబీటీలు ఇస్తూవచ్చారని.. ప్రజలంతా తనను ఒక దేవుడిలా చూడాలన్న భావనకు వచ్చేశారని పీకే తెలిపారు.
ఇక తాను ఈ ఎన్నికల్లో టీడీపీ కోసం కానీ, మరి ఏ ఇతర పార్టీకోసం కానీ పనిచేయడం లేదని పీకే స్పష్టం చేశారు. మమతా బెనర్జీ, చంద్రబాబూ మంచి మిత్రులని.. తాను తృణమూల్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న సమయంలో.. బాబును కలవాల్సిందిగా మమత సూచించారని.. కాని అప్పుడు తనకు కుదరలేదని అన్నారు. అయితే... చంద్రబాబుని కలిసి తాను వైసీపీ కోసం పనిచేయడం లేదని చెప్పాలనే ఒత్తిడి తనపై కొందరు చేశారని అన్నారు.
ఈ క్రమంలోనే ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, మూడు గంటలు భేటీ అయ్యి, తాను వైసీపీకి పనిచేయడం లేదనే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపారు!! ఐప్యాక్ సంస్థ జగన్ కోసం పనిచేస్తుండటంతోనే... తాను కూడా పనిచేస్తున్నట్లు చాలా మంది భావిస్తున్నారని.. అలాంటిదేమీ లేదని పీకే స్పష్టం చేశారు.