అలర్ట్: భాగ్యనగరంలో మత్తు బానిసలు.. షాకిస్తున్న అమ్మాయిల లెక్కలు!!

ధూల్ పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది మత్తు పదార్థాలకు అలవాటుపడిన సుమారు 2 వేల మందికి అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు!

Update: 2024-11-02 04:34 GMT

ధూల్ పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది మత్తు పదార్థాలకు అలవాటుపడిన సుమారు 2 వేల మందికి అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు! వీరిలో 250 మంది యువతులు ఉండగా.. వారిలో 110 మంది స్టూడెంట్స్, టెకీలుగా ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో.. టీజీబ్యాబ్ జరిపిన దాడుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,190 కేసుల్లో 2,651 మందిని అరెస్ట్ చేయగా.. వారిలో 58 మంది మహిళలు అని తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మత్తుపదార్థాలకు అలవాటుపడి రీహెబిటేషన్ సెంటర్స్ లో చికిత్స పొందుతున్న 1,100 మందిలో 350 మంది అమ్మాయిలు ఉన్నారని చెబుతున్నారు. గతేడాది స్కూల్ పిల్లలకు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేయగా.. వారి వద్ద లభించిన జాబితాలో ఉన్న 70 మంది విద్యార్థుల్లో.. 25 మంది 9, 10 తరగతి చదువుతున్న బాలికలు ఉన్నారని అంటున్నారు.

ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు అని.. అనధికారికంగా ఈ లెక్క ఇంకా ఉండొచ్చనే చర్చ జరుగుతుంది. ఈ స్థాయిలో భాగ్యనగరంలో యువతులు మత్తు పదార్ధాలకు అలవాటు పడుతున్నారు. కొత్త మత్తుపై ఆత్రుత, బ్యాక్ లాగ్స్ పై బెంగ, కెరీర్ పై ఆందోళన, ఉద్యోగాల్లో ఒత్తిడి, పార్టీల్లో స్నేహితులు / ప్రేమికుల బలవంతం.. కారణం ఏదైనా.. యువతులు మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారు!

ఇదే సమయంలో.. డ్రగ్స్ పెడ్లర్స్ వద్ద స్వాధీనం చేసుకున్న ఫోన్లలో సుమారు 10 - 15 శాతం ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేస్తున్న యువత, మహిళల ఫోన్ నెంబర్లే ఉన్నాయని అంటున్నారు. ఈ లెక్కలు ఇప్పుడు భాగ్యనగరంలో పలువురు యువతుల తల్లితండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని చెబుతున్నారు.

ఈ విషయంలో తల్లితండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని.. పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే ఓ కంట కనిపెట్టాలని.. ఇప్పటికే వ్యవహారం చేయి దాటినట్లు అనిపిస్తే రిహెబిటేషన్ సెంటర్స్ లో చేర్పించి చికిత్స అందించాలని పోలీసులు కోరుతున్నారని తెలుస్తోంది. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా దిద్దే ప్రయత్నంలో వారి సహకారం కూడా ఉండాలని కోరుతున్నారని అంటున్నారు!

ప్రధానంగా... లవ్ ఫెయిల్యూర్ అయ్యిందనో, చదువు కష్టంగా ఉందనో, స్నేహితులు బలవంత పెట్టారనో, పబ్ కల్చర్ అనో, పార్టీల సంప్రదాయమనో, పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి జస్ట్ లైట్ గా తీసుకుంటున్నామనో.. ఇలాంటి అలవాట్లు అలవటు చేసుకుంటే.. తర్వాత వాటికి పూర్తిగా బానిసలుగా మారి, జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచిస్తున్నారు.

ఒక్కసారి సరదాకనో, స్నేహితుల ఒత్తిడి అనో ఏమాత్రం అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని.. బంగారం లాంటి భవిష్యత్తును అందకారంలోకి నెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు!

Tags:    

Similar News