లోక్ సభ ఎన్నికల వేళ ఎన్ కౌంటర్ 18 మంది చనిపోయారు!

మావోయిస్టుల కాల్పుల్లో బీఎస్ఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.

Update: 2024-04-16 15:03 GMT

లోక్ సభ ఎన్నికల వేళ ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. కంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేతతో పాటు 18 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల కాల్పుల్లో బీఎస్ఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.

ఛోబేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో బీఎస్ఎస్ఎఫ్ బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత శంకర్ రావుతో పాటు 18 మంది నక్సల్స్ చనిపోయారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు కూడా గాయపడినట్లు చెబుతున్నారు.

మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో గాయపడిన పోలీసులు, బీఎస్ఎస్ఎఫ్ సిబ్బందిని హాస్పిటల్ కు పంపించారు. ఘటన స్థలంలో 47 తుపాకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కల్యాణ్ ఎల్లిసెల తెలిపారు. ఛోబేబెథియా ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరుగుతుందని కాంకర్ ఎస్పీ ఐకే ఎలెసెరా పేర్కొన్నారు. మావోయిస్ట్ అగ్రనేత శంకర్ రావుపై రూ.25 లక్షల రివార్డు ఉందని చెబుతున్నారు.

మావోయిస్టులను దాదాపు ఏరిపారేశారు. ఎక్కడైనా ఆనవాళ్లు ఉంటే వారిని కూడా తుదముట్టిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ జిల్లాలోనే మావోయిస్టుల ఉనికి ఉంది. దీంతో వారిని లేకుండా చేయాలని ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే వారిని అంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అడవిలో జల్లెడ పడుతున్నారు. దీంతో మావోయిస్టులు తారస పడటంతో వారి మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. ఇందులో మావోయిస్టు అగ్రనేత శంకర్ రావు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇంకా పోలీసులు అడవిని గాలిస్తున్నారు. నక్సల్స్ ఆచూకీ కోసం తిరుగుతూనే ఉన్నారని సమాచారం.

Tags:    

Similar News