గ్యారంటీలకు గ్యారంటీ లేదా..? కర్ణాటకలో ఫెయిల్.. మరి తెలంగాణలో..!
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తలచుకుంటూ అధికారం చేపట్టాక తలలు పట్టుకుంటున్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీలు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇస్తుంటాయి. ప్రజలను ఆకట్టుకునేలా పథకాలకు రూపకల్పన చేసి అమలుసాధ్యం కాని వాటిని కూడా మేనిఫెస్టోలో చేర్చుతుంటాయి. వాటికి ఆకర్షితులైన ప్రజలు ఆ పార్టీని ఆదరించి గద్దెనెక్కించడం ఆనవాయితీ వస్తోంది. కానీ.. ఇక్కడే అసలు సీన్ మొదలవుతోంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఇచ్చిన హామీల అమలులో పార్టీలు చతికిలపడుతున్నాయి. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తలచుకుంటూ అధికారం చేపట్టాక తలలు పట్టుకుంటున్నారు.
ఉచిత హామీలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అటు సుప్రీంకోర్టులోనూ పలు పిల్స్ దాఖలు కాగా.. వాటిపైనా విచారణలు నడుస్తున్నాయి. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉచిత హామీలను మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఉచిత హామీలతో దేశ, రాష్ట్ర అభివృద్ధికి విఘాతం అని ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా ట్వీట్ ద్వారా ఉచిత హామీలపై కీలక వ్యాఖ్యలు చేశారు మోడీ. కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా వాళ్లు ఇచ్చిన గ్యారంటీలు నెరవేరలేదు. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారాయి’ అని పేర్కొ్న్నారు. అంతుకుముందు ఎన్నికల సందర్భంలోనూ తాము ఉచిత హామీలకు వ్యతిరేకమని మోడీ ప్రకటించారు.
తాజాగా.. కర్ణాటకలోని గ్యారంటీలు దేశవ్యాప్త చర్చకు దారితీశారు. అక్కడ ఇచ్చిన ఐదు హామీలను అమలు చేయలేక కర్ణాటక ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ఇచ్చిన హామీల్లో నుంచి ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్‌ను ప్రారంభించింది. అక్కడ కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టాక నెలన్నర రోజులకు ఈ పథకం ప్రారంభమైంది. అయితే.. ఆరు నెలలైనా గడవకముందే ఆ స్కీమును నిలిపేసేందుకు సిద్ధమైంది. గత మేలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికలకు ముందు శక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి పేరిట మహిళలకు కుటుంబ పెద్దలకు నెలకు రూ.2,000, గృహ జ్యోతితో మహిళలకు నెలకు రూ.2,000 ఇచ్చేలా హామీలను ఇచ్చింది. అలాగే.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అన్న భాగ్యతో కుటుంబంలోని ప్రతి సభ్యునికి నెలకు 5 కిలోల బియ్యం, యువ నిధితో గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా హోల్డర్లకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. అయితే.. అధికారం చేపట్టాక అక్కడ నెల రోజుల తరువాత ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ.. అప్పుడే ఆ పథకానికి మంగళం పాడేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధపడింది. ఆర్థిక వనరుల ఇబ్బందులతో ఆ పథకానికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో అక్కడ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం రద్దయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఆ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. బడ్జెట్‌ను అనుసరించి హామీలు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. అందుకే మహారాష్ట్రలో ఉచిత హామీలకు పోవడం లేదని తేల్చిచెప్పారు. కర్ణాటక 2023-24కి బడ్జెట్ రూ.3,12,708 కోట్లు సవరించిన అంచనాల ప్రకారం కాగా, 2024-25 కోసం కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ మొత్తం వ్యయం రూ.3,71,383 కోట్లుగా నిర్ణయించారు 2024-25లో శక్తి, గృహజ్యోతి, గృహ లక్ష్మి, యువ నిధి, అన్న భాగ్య అనే ఐదు హామీ పథకాల అమలు కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ.52,000 కోట్లు కేటాయించారు. కానీ.. బడ్జెట్‌కు అనుగుణంగా రాబడి లేకపోవడంతో ఒక పథకానికి మంగళం పాడేందుకు సిద్ధపడింది.
ఇక.. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారంటీలను ప్రకటించింది. వాటితోపాటే రైతు డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని అదనంగా కొన్నింటిని ప్రకటించింది. వీటికి ఆకర్షితులైన ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారు. దాంతో పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం చేపట్టి పది నెలలు గడిచింది. కానీ.. ఇచ్చిన ఆరు గ్యారంటీలు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ప్రతినెలా రూ.2,000 సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. అలాగే.. రైతుభరోసా కింద రైతులు, కౌలురైతులకు ఏటా రూ.15,000 పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12,000 సాయం, వరి పంటకు ప్రతీ క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ.5 లక్షల సాయం, ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం కేటాయింపు చేస్తామని హామీ ఇచ్చారు. యువ వికాసం ద్వారా విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చేయూత కింద నెలకు రూ.4,000 చొప్పున పింఛను. రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది. కానీ.. వీటిలో ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, 500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగితా ఇంకా అమలుకు నోచుకోలేదు. ఏమైనా అంటే రాష్ట్ర బడ్జెట్ విషయాలను, గత ప్రభుత్వం చేసిన అప్పులను చెబుతూ వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్పించింది. రూ.2.2 లక్షల కోట్ల ఆదాయ వ్యయం, రూ.33,487 కోట్ల మూలధన వ్యయంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే.. కర్ణాటక సీన్ కూడా ఇక్కడ రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు తెలంగాణ ప్రజల్లో మొదలయ్యాయి. ఇప్పటికే రైతులకు ఓ సీజన్ ముగిసినా పంట పెట్టుబడి సాయం ఇవ్వలేదు. మహిళలకు నెలకు 2000 స్కీమ్ అమలు కావడంలేదు. ఇలా చాలా వరకు పథకాలు పెండింగులో ఉన్నాయి. అయితే.. బడ్జెట్ అంచనా వేయకుండా హామీలిచ్చి ఇప్పుడు ప్రభుత్వం పెద్దలు తలలు పట్టుకుంటున్నారన్న టాక్ కూడా ఉంది.
ఇక ఏపీలోనూ పరిస్థితి అలానే ఉంది. ఎన్నికలకు ముందు కూటమి నేతలు సూపర్ సిక్స్ పేరిట హామీలను గుప్పించారు. కానీ.. ఇప్పుడు వాటిని అమలు చేయడంలో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పింఛన్లు నాలుగు వేలకు పెంపు, అలాగే.. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పేరిట ప్రతీ విద్యార్థి తల్లి ఖాతాలో 20 వేల రూపాయలు వేస్తామని హామీ ఇచ్చింది. అది కూడా ఒక కుటుంబంలో ఎందరు పిల్లలు ఉంటే వారందరికీ ఇస్తామని చెప్పారు. అలాగే అన్నదాత సుఖీభవ స్కీంతో 20వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 ఇస్తామన్నది మరో పథకం. అయితే.. వీటిలో ఇప్పటి వరకు పెన్షన్లు పెంచగా.. నిన్న ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. మిగితా ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు దాటినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో పథకాలు అమలు కావడం లేదు.దాంతో అక్కడి ప్రజల్లోనూ పథకాలపై పలు రకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.