నారాయణకు హైకోర్టు వార్నింగ్

మాజీమంత్రి పొంగూరు నారాయణపై హైకోర్టు సీరియస్ అయిపోయింది. ఆయన చేసిన చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది

Update: 2023-09-07 05:06 GMT

మాజీమంత్రి పొంగూరు నారాయణపై హైకోర్టు సీరియస్ అయిపోయింది. ఆయన చేసిన చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి చేష్టలు చేస్తే ముందస్తు బెయిల్ వెంటనే రద్దుచేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను నారాయణ తన మద్దతుదారులతో కొనేసినట్లు వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదుచేసింది. ఈ ఆరోపణలపై సీఐడీ 2020లో కేసు పెట్టి దర్యాప్తుచేస్తోంది. కేసులో తనను సీఐడీ అరెస్టుచేయకుండా నారాయణ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

ఒకవైపు ముందస్తు బెయిల్ పై కంటిన్యు అవుతునే మరోవైపు తన అరెస్టుకు సంబంధించిన కేసులను కొట్టేయాలని పిటీషన్ వేశారు. దీన్ని విచారించిన కోర్టు ఆశ్చర్యపోయింది. అసలు ఏడాదిన్నరగా ముందస్తుబెయిల్ కంటిన్యు అవకాశమే లేదన్నది. ఇన్నాళ్ళు ముందస్తు బెయిల్ విచారణ పెండింగులో ఉన్న దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవని మండిపోయింది. ముందస్తుబెయిల్ కంటిన్యు చేయటానికి తాము అంగీకరించమని స్పష్టంగా చెప్పేసింది. ఇదే సమయంలో అరెస్టు కాకుండా వేసిన పిటీషన్ ను కూడా చూసింది.

ఒకవైపు ముందస్తుబెయిల్ పై కంటిన్యు అవుతు మరోవైపు ఇదే కేసులో అరెస్టు కాకుండా కేసును కొట్టేయమంటారా ? అంటు నారాయణపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. అసలు ఏడాదిన్నరగా ముందస్తు బెయిల్ మీద ఎలా కంటిన్యు అవుతున్నారని కోర్టు అడిగిన ప్రశ్నకు నారాయణ తరపు లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. చెప్పుకునేది ఏమున్నా ఉంటే చెప్పుకునేందుకు ఇదే చివరి అవకాశమని కూడా కోర్టు వార్నింగ్ ఇచ్చింది.

ఇక నుండి ఈ కేసులో వాయిదాలు కుదరవని, విచారణలో అటో ఇటో తేల్చేస్తామని స్పష్టంగా చెప్పింది. పదేపదే వాయిదాలు ఎందుకు తీసుకుంటున్నారని నారాయణ లాయర్ ను అడిగితే ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు. వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటుంటే ప్రభుత్వానికి ఏమని సమాధానం చెప్పాలని హైకోర్టు పిటీషనర్ తరపు లాయర్ ను నిలదీసింది. కేసు విచారణలో తాజాగా హైకోర్టు స్పందన చూసిన తర్వాత అసైన్డ్ భూములపై దాఖలైన కేసు తొందరగానే విచారణ పూర్తయిపోతుందనే అనుకుంటున్నారు.

Tags:    

Similar News