ఏఐ కోసం ఖర్చయ్యే విద్యుత్ బిల్ ఎంత షాక్కొడుతుందంటే...!
అవును... ఏఐ సాధనం చాట్ జీపీటీని ఒక రోజు వాడటానికి అవసరమయ్యే విద్యుత్ భారీ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త టెక్నాలజీ చుట్టూనే తిరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏఐ సాధనాల శిక్షణకు అంతా ఆతృత, ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి వెచ్చించాల్సిన విద్యుచ్ఛక్తి పరిమాణం అత్యంత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అదెంతలా అంటే... మెగావాట్, గిగావాట్ దాటి టెరావాట్ లకు చేరేటంతగా!
అవును... ఏఐ సాధనం చాట్ జీపీటీని ఒక రోజు వాడటానికి అవసరమయ్యే విద్యుత్ భారీ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. అదెంతలా అంటే... ఒకరోజు చాట్ జీపీటీని వాడటానికి 564 మెగావాట్ అవర్ల విద్యుత్ ఖర్చవుతుంది. మరింత డిటైల్డ్ గా మాట్లాడుకుంటే... రోజుకు 900 కోట్ల సెర్చ్ లకు సమాధానమిచ్చే గూగుల్.. ఆ పనికి ఏఐని వినియోగిస్తే ఏటా 30 టెరావాట్ అవర్ల విద్యుత్తును వెచ్చించాల్సి ఉంటుంది.
అది ఎంత ఎక్కువ అంటే... ఐర్లాండ్ దేశ వార్షిక విద్యుత్ వినియోగానికి అది సమానం. ఇదే సమయంలో టెక్స్ట్ మెసేజ్ లను పంపే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనానికి శిక్షణ ఇవ్వడానికి తాము 433 మెగావాట్ అవర్ల విద్యుత్తును ఉపయోగించామని.. అది 40 అమెరికన్ కుటుంబాల వార్షిక విద్యుత్ వినియోగానికి సమానమని న్యూయార్క్ కు చెందిన ఓ కంపెనీ తెలిపింది.
ఈ సందర్భంగా నెదర్లాండ్స్ లోని వరైయా విశ్వవిద్యాలయ పరిశోధకుడు అలెక్స్ డెవ్రీస్ ఈ మేరకు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... ఏఐ సాధనాల ట్రైనింగ్ కు, వాటి వినియోగానికి ఖర్చు చేసే విద్యుచ్ఛక్తి పరిమాణం 2027కల్లా నెదర్లాండ్స్, అర్జెంటీనా, స్వీడన్ వంటి చిన్న దేశాల వార్షిక విద్యుత్ వినియోగాన్ని మించిపోనుందట.
ఇదే సమయంలో... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు అపార సమాచారాన్ని ఆపోశన పట్టి, మన ప్రశ్నలకు సమాధానాలిస్తాయి. ఇందులో భాగంగా టెక్స్ట్, వీడియో సమాధానాలు పంపుతాయి. ఈ సమయంలో దీని వినియోగంపై శిక్షణ ఇవ్వడానికి ఎంతో విద్యుత్తును వినియోగించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ప్రతిసారీ ఎక్కువగా కరెంటు ఖర్చవుతుంది.
తాజాగా వెలువడుతున్న అంచనాల ప్రకారం... 2027 కల్లా ప్రపంచమంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏడాదికి 85 నుంచి 134 టెరావాట్ అవర్లకు విద్యుత్ వినియోగం చేరుతుందని అలెక్స్ డెవ్రీస్ అంచనా వేశారు. అందువల్ల ప్రపంచమంతటా ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ.. అవసరమైన పనులకు మాత్రమే దాన్ని వినియోగించడం మంచిదని డెవ్రీస్ సూచించారు.