జేసీ వర్సెస్ దగ్గుబాటి.. ఓ రేంజ్‌లో ..!
మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ టీడీపీ అనంత అర్బన్ ఎమ్మెల్యే దుగ్గబాటి వెంకటేశ్వరప్రసాద్‌కు మధ్య పోటీ నెలకొంది.
నువ్వా-నేనా? అనుకోవడం రాజకీయాల్లో కామనే. ఇది సాధారణంగా ప్రత్యర్థి పార్టీల నాయకుల విషయం లో ఉంటుంది. అయితే.. ఒక్కొక్కసారి మాత్రం ఈ సూత్రం సొంత పార్టీలో ఉన్న నాయకులకు కూడా వర్తి స్తుంది. ఇప్పుడు ఇలాంటి కథే అనంతపురంలోనూ జరుగుతోంది. అనంతపురంలో నిర్వహించిన తాజా మద్యందుకాణాల లాటరీలో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ టీడీపీ అనంత అర్బన్ ఎమ్మెల్యే దుగ్గబాటి వెంకటేశ్వరప్రసాద్‌కు మధ్య పోటీ నెలకొంది.
అనంతపురం మొత్తం నాదే అన్నట్టుగా జేసీ వ్యవహరిస్తున్న విషయం పార్టీలోనే కాదు.. ప్రజలకు కూడా తెలిసిందే. ఎన్నికల సమయంలో అర్బన్‌లో దగ్గుబాటిని ఓడించేందుకు ప్రయత్నించారన్న వాదన కూడా ఉంది. దీంతో ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన నాయకులే అయినప్పటికీ.. ఇద్దరి మధ్య రాజకీయాలు, వ్యాపారాల్లోనూ పోటీ నెలకొంది. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజా మద్యం దుకాణాలను సొంతం చేసుకోవడంలోనూ ఇద్దరూ పోటీ పడ్డారు.
అనంతపురంలో తాము తప్ప. వేరేవారు ఎవరూ దరఖాస్తులు వేయడానికి వీల్లేదంటూ.. జేసీ ప్రభాకర్ ముందుగానే వార్నింగ్ ఇచ్చారు. ఇది ప్రధాన మీడియాలోనూ వచ్చింది. ఇదేసమయంలో దగ్గుబాటి కూడా.. తమ వారికి దన్నుగా నిలిచారు. ఎవరు అడ్డువస్తారో చూద్దాంలే! అంటూ.. ముందుకు సాగారు. మొత్తంగా అటు జేసీ పక్షం నుంచి 100కు పైగా దరఖాస్తులు పడగా, ఇటు.. దగ్గుబాటి నుంచి 86 దరఖాస్తులు పడినట్టు ప్రచారం జరుగుతోంది.
వీరంతా కూడా.. వారి వారి అనుచరులు, బినామీలేనని అంటారు. తాజాగా జరిగిన లాటరీలో ఇద్దరికీ భారీ సంఖ్యలో షాపులు దక్కాయి. దగ్గుబాటి అనుచరులకు 22 షాపులు దక్కగా.. జేసీ వర్గానికి 22 షాపులు దక్కాయి. అంటే.. ఇద్దరికీ సమాన సంఖ్యలో షాపులు దక్కడం విశేషం. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. షాపులు దక్కించుకున్నవారిలో కొందరిని తమవైపు తిప్పుకొనేందుకు అటు జేసీ, ఇటు దగ్గుబాటి వర్గంకూడా ప్రయత్నిస్తుండడం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా సొంత పార్టీ నాయకులు రెచ్చిపోవడంతో ఇతర పార్టీల నాయకులు, వ్యాపారులు వెనుకడుగు వేయాల్సి వస్తోంది.