ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు వైద్య పరీక్షలు... ఏమిటీ "పొటెన్సీ టెస్ట్''?

దీని వెనుక ఆసక్తికర కారణం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. అరెస్ట్ తర్వాత వైద్య పరీక్షలూ నిర్వహించారు.

Update: 2024-05-31 17:30 GMT

అనేకమంది మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను సిట్‌ అధికారులు.. బెంగళూరులోని ఎయిర్ పోర్ట్ లోనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు మహిళా పోలీసు బృందమే ఎయిర్‌ పోర్టుకు వెళ్లింది. దీని వెనుక ఆసక్తికర కారణం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. అరెస్ట్ తర్వాత వైద్య పరీక్షలూ నిర్వహించారు.

అవును... జర్మనీ నుంచి బెంగళూరు ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ప్రజ్వల్‌ కు దర్శనమిచ్చిన మహిళా పోలీసులు.. నిమిషాల్లో ఆయనను చుట్టుముట్టారు. అనంతరం అరెస్టు వారెంటు చూపించి అదుపులోకి తీసుకుని.. అక్కడినుంచి సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఇలా మహిళా పోలీసులే అరెస్ట్ చేసి, వారే సీఐడీ ఆఫీసుకు తీసుకురావడం వెనుక బలమైన కారణం ఉందని అంటున్నారు.

ఇందులో భాగంగా... ఎంపీ పదవిని, పలుకుబడిని అడ్డంపెట్టుకొని మహిళలపై బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ ని అరెస్టు చేసే అధికారం కూడా ఆ మహిళలకే ఉందనే సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నామని.. అంతేకాకుండా మహిళా అధికారులు ఎవరికీ భయపడరనే సందేశాన్నీ బాధిత మహిళలకు ఇవ్వాలనుకున్నామని.. అందుకే మహిళా పోలీసులే అరెస్ట్ చేశారని సిట్‌ అధికారులు వెల్లడించారు!

ఆరు రోజుల పోలీస్ కస్టడీ!:

ఇలా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజ్వల్ ని అరెస్ట్ చేసిన అధికారులు.. సీఐడీ కార్యలయానికి తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం అతడిని "పొటెన్సీ టెస్ట్" చేయించిన అధికారులు.. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ప్రజ్వల్ ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు.

దీంతో.. ప్రజ్వల్ ను ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ బెంగళూరు సిటీ కోర్టు తీర్పు ఇచ్చింది. మరోవైపు తమపై నమోదైన కేసుల్ని కొట్టివేయాలంటూ ప్రజ్వల్, ఆయన తండ్రి రేవణ్ణ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. జూన్ 3కి తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఏమిటీ పొటెన్సీ టెస్ట్?:

అరెస్ట్ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టబోయే ముందు ప్రజ్వల్ రేవణ్ణకు సిట్ అధికారులు పొటెన్సీ టెస్ట్ చేయించారు. లైంగిక వేధింపులకు పాల్పడే సామర్థ్యం నిందితుడికి ఉందా? లేదా? అనే విషయాన్ని గుర్తించడానికి చేసే పరీక్షే.. ఈ పొటెన్సీ టెస్ట్!

ఇందులో భాగంగా... వివిధ వైద్య పద్ధతుల ద్వారా కొన్ని రసాయనాలను శరీరంలోకి పంపి అంగస్తంభన, వీర్య విశ్లేషణ చేస్తారు. ఫలితంగా... ఇలాంటి కేసులో నిందితుడిపై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక అవగాహన వస్తుందని అంటారు. అలా అని ఇలాంటి కేసుల్లో నేర నిర్ధారణకు ఈ టెస్ట్ ఒక్కటే ప్రామాణికం కాదని నిపుణులు చెబుతుంటారు!

కారణం... ఊబకాయం, విపరీతమైన ఒత్తిడి సమస్యలున్న వారికి ఈ పొటెన్సీ టెస్ట్‌ లో పాజిటివ్ రిజల్ట్ వస్తుందని ధీమాగా చెప్పలేమని అంటున్నారు వైద్యులు! ఈ క్రమంలో.. శుక్రవారం నాడు ప్రజ్వల్ ను కోర్టులో ప్రవేశపెట్టే ముందు అధికారులు ఈ పరీక్ష చేయించారు.

Tags:    

Similar News