ప్రకాశ్ రాజ్ జస్ట్ ఆస్కింగ్.. సిగ్గు మాలిన రాజకీయాలంటూ సురేఖపై ఫైర్

తిరుమల లడ్డూ కల్తీ వివాదం ఎప్పుడు మొదలైందో.. అప్పటినుంచి నటుడు ప్రకాశ్ రాజ్ వార్తల్లో నిలుస్తున్నారు.

Update: 2024-10-02 11:40 GMT

తిరుమల లడ్డూ కల్తీ వివాదం ఎప్పుడు మొదలైందో.. అప్పటినుంచి నటుడు ప్రకాశ్ రాజ్ వార్తల్లో నిలుస్తున్నారు. బీజేపీ, ప్రధాని మోదీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే ప్రకాశ్ రాజ్.. ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ కు ఓ దశలో అత్యంత సన్నిహితంగా మెలిగారు ప్రకాశ్ రాజ్. కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన సమయంలో ఆయన మహారాష్ట్ర వెళ్లినా.. కర్ణాటకలో పర్యటించినా ప్రకాశ్ రాజ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తో కలిసి సమాలోచనల్లోనూ పాల్గొనడం గమనార్హం. మోదీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే క్రమంలో కేసీఆర్‌ కు మద్దతు ప్రకటించారు. అయితే, అంతలోనే ఆయన రాజకీయంగా తెరమరుగయ్యారు.

రాజకీయాలు.. ప్లస్ సినిమాలు..

సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన ప్రకాష్‌రాజ్‌ సమకాలీన రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తారు. కేసీఆర్‌ విధానాలను ఆయన సమర్థించారు. అప్పట్లో ఆయనను బీఆర్ఎస్ తరపున రాజ్యసభకు పంపుతారనే చర్చ కూడా సాగింది. కానీ, అదేమీ జరగలేదు. చివరకు గులాబీ పార్టీ కార్యక్రమాల్లో, పార్టీ పెద్దల పర్యటనల్లోనూ ప్రకాష్ రాజ్ కనిపించలేదు. చివరకు గత ఏడాది జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ప్రకాష్ రాజ్ గురించి చర్చ లేదు. కర్ణాటకలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్.. తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించలేదు. తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.

తిరుమల లడ్డూతో

ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో ప్రకాష్ రాజ్ మళ్లీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం, హీరో కూడా అయిన పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ హిందూ సనాతన ధర్మాన్ని నెత్తికెత్తికోవడం సహా ఆయన ప్రతి చర్యనూ ప్రశ్నించారు. వామపక్ష భావాలు కనిపించే పవన్ కల్యాణ్ నేపథ్యాన్ని ఎద్దేవా చేస్తూ.. కొత్త భక్తుడికి ‘పంగనామాలెక్కువ’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ లు చేశారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ను ఉద్దేశిస్తూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలపై అసహనం వ్యక్త చేశారు. ‘‘సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా..?’ అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. ఏంటీ.. సిగ్గులేని రాజకీయాలు అంటూ నిలదీశారు. కేటీఆర్‌ తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని కొండా సురేఖ అన్న వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోలో.. కేటీఆర్ కారణంగా కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్‌ నుంచి వెళ్లిపోయారని సురేఖ ఆరోపించారు. కేటీఆర్ డ్రగ్స్ కు అలవాటు పడి, సినిమా వాళ్లకు కూడా వాటిని అలవాటు చేశారని మంత్రి విమర్శించారు. రేవ్‌ పార్టీలు చేయడంతో పాటు, సినీ తారలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి కేటీఆర్‌ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది సినిమా పరిశ్రమలో అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

Tags:    

Similar News