పట్టభద్రుల ఎన్నికల బరిలోకి వైసీపీ ?
ఏపీలో ఉభయ గోదావరి, అలాగే గుంటూరు, క్రిష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి
ఏపీలో మరిన్ని ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ఏపీలో ఉభయ గోదావరి, అలాగే గుంటూరు, క్రిష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం టీడీపీ తన కసరత్తుని సిద్ధం చేసింది గుంటూరు క్రిష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు మాజీ మంత్రి ఆలపాటి రాజా పేరుని ప్రతిపాదిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలలో చూస్తే పిఠాపురం వర్మ చాన్స్ అండుతున్నారు కానీ వేరే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ఇక వైసీపీ కూడా ఇపుడు ఈ ఎన్నికల మీద ఆసక్తిని చూపుతోంది అని అంటున్నారు. వచ్చే ఏడాది మార్చి అంటే అప్పటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది. దాంతో పట్టభద్రులలో కూడా మార్పు రావచ్చు అన్న ఆశలతోనే బరిలోకి దిగుతోంది అని అంటున్నారు.
పట్టభద్రులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఉపాధి అవకాశాలు అయితే వచ్చే మార్చి లోగా ఇవ్వలేరు. అలాగే నిరుద్యోగ భృతి కూడా చెల్లించే సీన్ ఉండదు, అంతే కాదు కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. దాంతో పట్టభద్రుల మనోభావాలు పరిగణనలోకి తీసుకుంటే అసంతృప్తి ఉంటుందని దానిని క్యాష్ చేసుకోవచ్చు అని భావిస్తోందిట వైసీపీ.
అంతే కాదు ఇటీవల బెజవాడలో సంభవించిన వరదల విషయంలో ప్రభుత్వం అనుకున్నంతగా పని చేయలేదు అన్న బాధ అసంతృప్తి జనాలలో ఉందని దానిని కూడా ఉపయోగించుకుంటే గెలుపు ఈజీ అవుతుంది అని భావిస్తోంది.
ఇక వైసీపీ తరఫున పట్టభద్రుల ఎన్నికల్లో గుంటూరు విజయవాడల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు వైసీపీ కార్మిక నాయకుడు గౌతం రెడ్డి ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు. ఆయన జగన్ కి బంధువుగా కూడా ఉన్నారు. అంగబలం అర్ధ బలం ఆయనకు ఉన్నాయి.
అధికార కూటమిని ఎదిరించి ముందుకు సాగాల్సిన ఈ ఎన్నికల్లో ఆయన ఎంపిక అన్ని విధాలుగా మేలు చేస్తుందని పార్టీ ఆలోచిస్తోందిట. మరో వైపు చూస్తే గోదావరి జిల్లాల్లో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. వైసీపీ ఇక్కడ కూడా పోటీ చేస్తుందా అన్న చర్చ ఉంది
ఇవన్నీ పక్కన పెడితే 2023లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే టీడీపీ రాజకీయ జాతకాన్ని మార్చాయి. మొత్తం మూడు చోట్ల ఆ పార్టీ గెలిచి అధికార వైసీపీకి షాక్ ఇచ్చింది. ఇపుడు అదే తరహాలో తమకు కూడా పట్టభద్రులే దారి చూపిస్తారు అని వైసీపీ నమ్ముతున్నట్లుగా కనిపిస్తోంది. చూడాలి మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకుండానే జనంలో అభిప్రాయాలు మారుతాయా అవి వైసీపీకి మేలు చేస్తాయా అన్నది.