ఏమిటీ గ్యాస్ట్రోనమీ టూరిజం? విదేశీయుల్ని ఆకర్షిస్తున్న భారత్

కొత్త రుచులను అస్వాదించేందుకు నిత్యం అన్వేషించే వారు మన చుట్టూ చాలామందే కనిపిస్తారు.

Update: 2024-10-02 10:30 GMT

కొత్త రుచులను అస్వాదించేందుకు నిత్యం అన్వేషించే వారు మన చుట్టూ చాలామందే కనిపిస్తారు. జిహ్వ చాపల్యం కోసం తినే తిండిని రోటీన్ గా కాకుండా.. సరికొత్త రుచుల్ని పరిచయం చేసుకోవటం.. వాటిని అస్వాదించే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. విభిన్న ఆహార అలవాట్ల మీద పెరిగే ఆసక్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొత్త రుచుల అన్వేషణ సాగుతోంది. దీంతో కొత్త రుచుల్ని అస్వాదించటాన్ని గ్యాస్ట్రోనమీ టూరిజంగా అభివర్ణించాలి. పాకశాస్త్ర సంస్క్రతిని అస్వాదించే పర్యాటకాన్ని గ్యాస్ట్రోనమీ టూరిజంగా పేర్కొంటారు.

కొత్త వంటకాల తయారీపై మక్కువతో వివిధ దేశాల్లో పర్యటించే తీరు ఈ మధ్యన ఎక్కువైంది. ఈ విషయంలో భారతదేశానికి విదేశీయులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ టూరిజం ఎక్కువగా ఉన్న దేశం ఏమిటి? అన్నది చూస్తే.. టర్కీ అగ్రస్థానంలో నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా పర్యాటకుల్ని ఆకట్టుకోవటం.. సరికొత్త అనుభూతుల్ని పంచే విషయంలో టర్కీ తర్వాతే ఎవరైనా. గత ఏడాది రూ.1.52 లక్షల కోట్లుగా టర్కీ పాక శాస్త్ర పర్యాటక మార్కెట్ నిలిచింది. మరోఏడాదికి (2025 నాటికి) ఈ మార్కెట్ రూ.2.10 లక్షల కోట్లకు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు.

టర్కీ వ్యాప్తంగా 2200 కంటే ఎక్కువ లోకల్ ఫుడ్.. డ్రింక్ వెరైటీలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ దేశంలోని గాజియాంటెప్.. అదావా.. హటే.. ఇజ్మీర్ లాంటి నగరాల్లో ఈ టూరిజం ఎక్కువగా ఉంది. అంతేకాదు.. కొత్త తరహా ఆహార తయారీని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రత్యేక కోర్సుల్ని.. శిక్షణను టర్కీ అందిస్తోంది. ఆ దేశ రాజధాని ఇస్తాంబుల్ లోనే ఈ తరహా ట్రైనింగ్ సెంటర్లు 16 వరకు ఉండటం గమనార్హం.

స్థానిక ఆహార ఉత్పత్తుల్ని ప్రోత్సహించటానికి టర్కీ ఏకంగా 34 గ్యాస్ట్రోనమీ మ్యూజియంలను ఏర్పాటు చేయటమే కాదు.. దేశ వ్యాప్తంగా 360కు పైగా ఎక్కువ పండుగల్ని నిర్వహిస్తుండటం విశేషం. అందుకే టర్కీలోని గాజియాంటెప్ ను సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా యునెస్కో గుర్తించింది. టర్కీ మాత్రమే కాదు మన దేశం కూడా ఈ తరహా టూరిజంకు ఎక్కువ మంది వస్తున్నారు.

దక్షిణాదిన మసాలా కూరలు.. ఉత్తరాదిలో మొఘలాయ్ వంటకాలు భారత్ లోని హోటళ్లు పెద్ద ఎత్తున ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. వీటికి తోడు వీధుల్లో అమ్మే తినుబండారాలు అదనంగా చెప్పాలి. ఢిల్లీ.. ముంబయి.. కోల్ కతా లాంటి నగరాలు గ్యాస్ట్రోనమీకి అడ్డాలుగా మారినట్లు చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే గ్యాస్ట్రోనమీకి అడ్డాలుగా ఈశాన్య భారతం నిలుస్తుంది. ఆ తర్వాత చెట్టినాడ్ విభిన్న ఆహార రుచుల్ని అందిస్తుంది. గోవాలో స్థానిక వంటలు మాత్రమే కాదు అంతర్జాతీయ వంటకాల్ని కూడా ప్రవేశ పెడుతూ.. అందరిని ఆకట్టుకుంటుంది. వీధి వంటల్లో లక్నోలో లభించే నెహారి కుల్చా.. షీర్మల్.. మలై మఖాన్ లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక.. అమృత్ సర్ లో లభించే చోలే -కుల్చే, జిలేబీ, గులాబ్ జామూన్.. పొడవాటి గ్లాసుల్లో ఇచ్చే లస్పీకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. ఈ తరహా టూరిజంను పెంపొందించే విషయంలో ఈశాన్య రాష్ట్రాలు ముందున్నాయి. ఈశాన్య భారతంలోని స్థానికులు తయారు చేసి వడ్డించే వివిధ అటవీ.. స్థానిక ఆహార వంటకాల్ని పరిరక్షించేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. మొత్తంగా గ్యాస్ట్రోనమీ టూరిజం విషయంలో భారత్ 15.6 శాతం వ్రద్ధి రేటుతో దూసుకెళుతున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News