చంద్రబాబే నా రాజకీయ గురువు.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హాట్‌ కామెంట్స్‌!

గతేడాది డిసెంబర్‌ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ చిత్తయిన సంగతి తెలిసిందే

Update: 2024-07-12 09:46 GMT

గతేడాది డిసెంబర్‌ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ చిత్తయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరఫున గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఏడుగురు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే 8 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు, ఈ వలసలు ఇంకా కొనసాగుతున్నాయి.

తాజాగా రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ కూడా పార్టీ మారాలని నిర్ణయించారు. ఈ మేరకు జూలై 12న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ గురువు చంద్రబాబు అని తెలిపారు. కాంగ్రెస్‌ లో చేరుతున్న సందర్భంగా ప్రకాశ్‌ గౌడ్‌ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన హాట్‌ కామెంట్స్‌ చేశారు.

స్వామివారి దర్శనం అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నానని ప్రకాశ్‌ గౌడ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని వెల్లడించారు. తన రాజకీయ గురువు ఏపీ సీఎం చంద్రబాబేనని చెప్పారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించి చంద్రబాబు నిత్యం పరితపిస్తారని వివరించారు.

ఈ నేపథ్యంలో ప్రకాశ్‌ గౌడ్‌ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఆయన 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున రాజేంద్ర నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2018, 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున గెలుపొందారు. రాజేంద్రనగర్‌ వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రకాశ్‌ గౌడ్‌ కు రాజేంద్రనగర్‌ నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. రైతులకు, నియోజకవర్గానికి మంచి చేయడానికే తాను కాంగ్రెస్‌ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు ప్రకాశ్‌ గౌడ్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ లో చేరి అభివృద్ధిని కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ప్రకాశ్‌ గౌడ్‌ చేరికతో కాంగ్రెస్‌ లో చేరే ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరనుంది. ఆయనతోపాటు మరో ఇద్దరు మున్సిపల్‌ చైర్మన్లు కూడా చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ లో మరో ఐదుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశముందని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే వీరు కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌ లో ఉన్నట్టు చెబుతున్నారు.

Tags:    

Similar News