మహిళలకు బంపర్ ఆఫర్ అంటున్న బీహార్ పీకే

Update: 2024-08-12 17:50 GMT

రాజకీయాల్లో గెలవాలి అంటే కులం తో పాటు మహిళలు కూడా అతి పెద్ద ఓటు బ్యాంక్ గా ఉంటారు. వారిని దగ్గరకు తీసుకోవడం ద్వారానే ఎవరైనా సక్సెస్ కాగలరు. ఈ విషయంలో ఎందరికో రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన బీహార్ బాబు పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ కి తెలియదని ఎలా అనుకుంటారు.

పైగా ఆయన బీహార్ లో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. జన సురాజ్ అని ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి భారీ ఎత్తున పాదయాత్ర కూడా చేశారు. అలా గ్రౌండ్ లెవెల్ వరకూ పరిస్థితిని ఆయన అధ్యయనం చేశారు. బీహార్ లో ఎన్నడూ అధికారంలోకి రాని కులాలకి ఈసారి అవకాశం ఇచ్చి ముందుకు తెస్తామని పీకే ఇప్పటికే చెప్పుకొచ్చారు.

తాజాగా ఆయన మరో కీలకమైన ప్రకటన చేశారు. 2025లో బీహార్ లో జరిగే ఎన్నికల్లో పెద్ద ఎత్తున మహిళలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని ఆయన తెలిపారు. ప్రతీ లోక్ సభ పరిధిలో ఒక మహిళా అభ్యర్థిని నిలబెట్టడమే రాజకీయ పార్టీగా మారబోతున్న జన సురాజ్ ఆలోచన అని ఆయన చెప్పారు.

ఇప్పటిదాకా మహిళా రిజర్వేషన్లు అని చెప్పడం వారి తరఫున ఉద్యమాలు చేయడం తప్ప ఆచరణలో వారికి అవకాశాలు ఇచ్చిన వారు లేరని పీకే అన్నారు. బీహార్ చరిత్రలో ఎపుడూ ఏ పార్టీకి ముప్పయి మంది మహిళా ఎమ్మెల్యేలు లేరని ఆయన చెప్పారు. అయితే తమ పార్టీ మాత్రం లోక్ సభకు ఒక మహిళా అభ్యర్థి వంతున మొత్తం 40 లోక్ సభ సీట్లకు గానూ నలభై మంది మహిళలకు టికెట్లు ఇచ్చి వారిని ఎంపీలు చేయాలని చూస్తున్నామని అన్నారు.

ఇదే తమ నినాదమని ఆయన చెప్పారు. అలాగే జన సురాజ్ పార్టీ తరఫున కనీసం ఒక మహిళకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని గట్టిగా నిర్ణయించామని ఆయన చెప్పారు. అంతే కాదు ఒకరి కంటే ఏదైనా జిల్లాలో ఇద్దరు మహిళా నేతలు ఎమ్మెల్యే పదవికి అర్హులు అని తేలితే ఇద్దరికీ టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తామని పీకే బంపర్ ఆఫర్ ప్రకటించారు.

బీహార్ జనాభాలో సగానికి కంటే ఎక్కువగా ఉన్న మహిళలను తన పార్టీ వైపు తిప్పుకునేందుకు ప్రశాంత్ కిశోర్ ఈ రకమైన రాజకీయ ఎత్తుగడ వేశారు అని అంటున్నారు. అంతే కాదు మొత్తంగా మహిళా ఓట్లను సమీకరించడం ద్వారా జనసేన విజయావకాశాలను భారీగా పెంచుకోవాలన్నది కూడా ఆయన వ్యూహంగా ఉందని అంటున్నారు.

మరో వైపు చూస్తే జన సురాజ్ గా ఇంతవరకూ ఉన్న తన సంస్థను ఒక రాజకీయ పార్టీగా మార్చేందుకు గాంధీ జయంతి వేళ అక్టోబర్ 2ను ఆయన ఎంచుకుంటున్నారు అని అంటున్నారు. ఆ రోజు నుంచి ఏడాది పాటు ఎన్నికలకు గడువు ఉంటుదని ఈ సమయం చాలు బీహార్ లో అధికారం దిశగా ముందుకు సాగడానికి అని ఆయన భారీ వ్యూహంతో ఉన్నారని అంటున్నారు.

అయితే పీకే ప్రకటనలను ఆయన రాజకీయ పోకడలను బీహార్ లోని అధికార జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ కుష్వాహా తీవ్రంగా విమర్శించారు. ప్రశాంత్ కిశోర్ అసలు రాజకీయ నాయకుడు కానే కాదని ఆయన జన సురాజ్ పార్టీ కాదన్ని అది జస్ట్ ఒక ఏజెన్సీ అని ఆయన అన్నారు.

పీకే ప్రకటనలకు జవాబు చెప్పనని ఆయన రాజకీయ నేత కానే కాదని కొట్టిపారేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల మీద ప్రతిస్పందించడం కూడా వేస్ట్ అన్నట్లుగా మాట్లాడారు. పీకే పార్టీ మీద జేడీయూ చేస్తున్న కామెంట్స్ చూస్తూంటే బీహార్ రాజకీయాల్లో ఆయన ప్రభావాన్ని బాగా తగ్గించాలని చూస్తున్నారు అని అర్ధం అవుతోంది. అధికార జేడీయూకే పీకే పార్టీ వల్ల ఎక్కువ ముప్పు అని అంటున్నారు.

Tags:    

Similar News