ప్రధాని అభ్యర్ధి రాహుల్...మమత..నితీష్ మాటేంటి...?

వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీగా ఉంటున్నారు. దాంతో పాటు ప్రధాని అభ్యర్ధిగా కూడా రేసులోకి వచ్చారు.

Update: 2023-08-28 03:55 GMT

ఇండియా కూటమి కట్టింది. రెండు మీటింగ్స్ జరిగాయి. ముచ్చటగా మూడవది ఈ నెల 30, 31 తేదీలలో ముంబై వేదికగా జరగనుంది. ఈ మూడవ మీటింగ్ కి ముందే ఇండియా కూటమిలో ముసలం పుడుతుందా అన్న సందేహాలు అయితే వస్తున్నాయి. ముంబై మీటింగ్ కి శరద్ పవార్ హాజరవుతారా లేదా అన్నది ఒక చర్చ అయితే ఈ కూటమికి ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ గాంధీ ఉంటారు అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించేశారు.

కూటమిలోని వారంతా దానికి ఓకే చెప్పారని కూడా ఆయనే చెప్పేశారు. నిజానికి బెంగళూరు లో జరిగిన మీటింగులో ప్రధాని అభ్యర్ధి విషయంలో చర్చ సాగనే లేదు. ఇంకో వైపు చూస్తే సీనియర్ మోస్ట్ నేత శరద్ పవార్ వైఖరి కొంత డౌట్ కొట్టేలా ఉందని చర్చ సాగుతోంది. ఆయన మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు. పార్టీని చీల్చారు.

అయినా సరే శరద్ పవార్ పార్టీ చీలలేదని అంటున్నారు. కొందరు బీజేపీ మాయలో పడ్డారు అంటున్నారు. దాంతో పాటు అజిత్ పవార్ తో రహస్యంగా మంతనాలు చేస్తున్నారు. ప్రధాని మోడీతో వేదికనూ పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలో పవార్ తాను విపక్ష కూటమి అని చెబుతున్నా కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు అనుమానిస్తునాయి.

ఇక ఢిలీ సీఎం అరవింది కేజ్రీవాల్ అయితే కాంగ్రెస్ వైఖరితో గుస్సా అవుతున్నారు. ఢిల్లీలోని ఏడు సీట్లకు తామే పోటీ చేస్తామని ఢిల్లీ కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ప్రకటించడం పట్ల కూడా ఆయన మండిపడుతున్నారు. ఇలాంటి నేపధ్యంలో ముంబై మీటింగ్ జరగబోతోంది. అయితే బెంగళూరు కి ముంబై మీటింగ్ కి మధ్యలో మరికొన్ని పరిణామాలు కూడా జరిగాయి.

అవేంటి అంటే రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో స్టే లభించడం. దాంతో ఆయన మళ్లీ ఎంపీగా పార్లమెంట్ కి వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీగా ఉంటున్నారు. దాంతో పాటు ప్రధాని అభ్యర్ధిగా కూడా రేసులోకి వచ్చారు. ఇపుడు ఆయనే ఇండియా కూటమి నుంచి మోడీని ఢీ కొట్టబోయేది అని కాంగ్రెస్ నేతలు చెబుతున్న వేళ విపక్షాలు ఎలా దీని తీసుకుంటాయో చూడాల్సి ఉంది.

ఎందుకంటే విపక్ష కూటమిలో ప్రధాని పదవికి పోటీ పడుతున్న వారు చాలా మంది ఉన్నారనే అంటున్నారు. నితీష్ కుమార్ తో పాటు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇలా లిస్ట్ పెరిగిపోతోంది. వీరంతా రాహుల్ గాంధీ ఎన్నికలకు పోటీకి దూరంగా ఉంటారని భావించి ఇండియా కూటమిలో యాక్టివ్ గా ఉన్నారని అంటారు.

ఇపుడు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్ధి అంటే ఏమంటారో చూడాల్సి ఉంది. ఇక కూటమికి పెద్దన్నగా కాంగ్రెస్ ఉంటే అది యూపీయే త్రీ అవుతుంది కానీ ఇండియా కూటమి ఎలా అవుతుంది అని కూడా ప్రశ్న వినిపిస్తోంది. పేరు మార్చుకున్నంత మాత్రాన కూటమి గెలుస్తుందా అన్నదే ఇంకో చర్చ. ఏది ఏమైనా ప్రధానుల లిస్ట్ ఎక్కువైన వేళ రాహుల్ గాంధీ సీన్ లోకి సడెన్ గా దూసుకుని వచ్చి సమస్యను పరిష్కరించారా లేక కొత్త సమస్యను సృష్టించారా అన్నది తెలియాలంటే ముంబై మీటింగ్ దాని తరువాత పరిణామాల దాకా వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News