ప్రపంచ కప్పు తెచ్చిన మాజీ ప్రధానికి.. తీవ్ర అవమానం
అంతటి గొప్ప నాయకత్వ పటిమతో, ఫైనల్లో గొప్ప ఇన్నింగ్స్ ఆడిన ఇమ్రాన్ ను పీసీబీ కావాలనే విస్మరించినట్లు తెలుస్తోంది.
అది 1992 వన్డే ప్రపంచ కప్.. ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలో దిగిందో ఓ జట్టు. తొలి లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో ఘోర ఓటమి.. మూడో మ్యాచ్ లో ఇంగ్లండ్ పై కేవలం 74 పరుగులకే ఆలౌట్. కానీ, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయి చెరో పాయింట్ దక్కడంతో ఆ జట్టు బతికిపోయింది. ఆపై భారత్ చేతిలోనూ ఓటమి.. దక్షిణాఫ్రికా పైనా పరాజయం. అప్పటికి గెలిచింది జింబాబ్వే, ఆస్ట్రేలియాపైనే. ఇక ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే. అలాంటి సమయంలో జట్టు నాయకుడు జూలు విదిల్చాడు. ''ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ'' అంటూ నిప్పుల్లాంటి తన మాటలతో స్ఫూర్తి రగిలించాడు. తెగించి పోరాడిన ఆ జట్టు మరో రెండు విజయాలతో సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. దూకుడు మీదున్న న్యూజిలాండ్ ను మట్టికరిపించి.. టైటిల్ ఫేవరెట్ ఇంగ్లండ్ బోల్తా కొట్టించి తొలిసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది.
జట్టుగా రాణించడం సరే.. కానీ, దాని వెనుక కేవలం ఉన్నది ఒకే ఒక వ్యక్తి. అప్పటికే దాదాపు 40 ఏళ్లకు చేరువైన ఆ కెప్టెన్ దేశాన్ని విశ్వ విజేతగా నిలిపి సగర్వంగా రిటైరయ్యాడు. కేవలం ఇందుకోసమే రిటైర్మెంట్ ను వెనక్కుతీసుకుని మళ్లీ బరిలో దిగి అనుకున్నది సాధించాడు. అనంతరం సామాజిక సేవ, రాజకీయాల్లో కాలుపెట్టి 25 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత దేశానికి ప్రధాని అయ్యాడు. ఇప్పుడు వెనక్కు చూస్తే.. దేశానికి ఏదైతే గొప్ప కీర్తి సాధించిపెట్టాడో ఆ కీర్తిలో తనకు చోటు లేకుండా పోయింది.
పైన చెప్పుకొన్నదంతా పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి. క్రికెట్ లో కొనసాగిన కాలంలో ఇమ్రాన్ చాలామంది అమ్మాయిలకు కలల రాకుమారుడు. 1992లో దేశానికి ప్రపంచ కప్ సాధించిపెట్టాక పెద్ద హీరో అయిపోయాడు. అప్పట్లో అతడికి వచ్చిన క్రేజ్ చూస్తే ఇమ్రాన్ రాజకీయాల్లోకి వస్తే పాకిస్థాన్ ప్రధాని కావడం ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. దీనికితగ్గట్లే అడుగులు వేసినా.. ఇమ్రాన్ అంత తొందరగా విజయవంతం కాలేకపోయారు. అయితే, 2018లో ఎట్టకేలకు అతడి కల నెరవేరింది. నాటి ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో ఇమ్రాన్ ప్రధానమంత్రి అయ్యారు. కానీ, గత ఏడాది ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా కు మద్దతు పలికి అమెరికా కన్నెర్రతో పదవి పోగొట్టుకున్నారు.
ప్రధానిగా ఉంటే.. అతడి వీడియో రిలీజ్ చేసుకునేవాడే? ఒకవేళ ఇమ్రాన్ ప్రధాని కొనసాగి ఉంటే బహుశా తన వీడియో తనే రిలీజ్ చేసుకునేవాడేమో? ఎందుకంటే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వారి దేశ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 14) సందర్భంగా ఓ వీడియో విడుదల చేసింది. వారి జాతిపిత జిన్నా నుంచి దేశానికి సేవలందించిన క్రికెటర్ల వరకు ఇందులో ఉంది. పాక్ క్రికెట్ ఉత్థాన ప్రస్థానాలను పేర్కొంది. కానీ, ఇదే సమయంలో వారి ట్వీట్ విపరీతమైన ట్రోలింగ్ కు గురై.. పెద్ద వివాదానికి కారణమైంది. ఎందుకంటే.. 1992లో పాకిస్థాన్ కు ప్రపంచ కప్ ను అందించింది ఇమ్రానే. ఫైనల్లోనూ వన్ డౌన్ లో వచ్చిన అతడు 72 విలువైన పరుగులు చేశాడు. వాస్తవానికి ఆ మ్యాచ్ లో ఓపెనర్లు రమీజ్ రజా (8), అమీర్ సొహైల్ (4) పరుగులు మాత్రమే చేశారు. అయితే, ఇమ్రాన్, వైస్ కెప్టెన్ జావేద్ మియాందాద్ (58) నిలదొక్కుకుని జట్టుకు మంచి స్కోరు (249) అందించారు. ఆపై ఇంగ్లండ్ ను 227 పరుగులకే ఆలౌట్ చేసి ప్రపంచ విజేతగా నిలిచారు. అంతటి గొప్ప నాయకత్వ పటిమతో, ఫైనల్లో గొప్ప ఇన్నింగ్స్ ఆడిన ఇమ్రాన్ ను పీసీబీ కావాలనే విస్మరించినట్లు తెలుస్తోంది.
పాలకులకు కోపం తెప్పించకూడదని.. ఇమ్రాన్ ఖాన్ 'తోషీఖానా' కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమ వీడియోలో చూపిస్తే పాలకులకు ఇబ్బంది అని పీసీబీ భావించినట్లుగా తెలుస్తోంది. కానీ, దీనిపై 'చరిత్ర ఒక్క రోజులో సృష్టించలేం. దిగ్గజాలను విస్మరించొద్దు. ఇలాంటి వీడియోలు సహించలేం' 'మెల్‌బోర్న్ (1992 ప్రపంచ కప్ ఫైనల్ వేదిక) స్టేడియం గ్యాలరీల్లోని దిగ్గజాల్లో ఇమ్రాన్ ఒకరు', ఇమ్రాన్ లేకుండా 1992 ప్రపంచ కప్ లేదు. కుటిల ఆలోచనలు ఆపండి. అతడు క్రికెట్ అభిమానుల మనసుల్లో నిలిచిపోయాడు. చెత్త వీడియోలతో మీ పేరును కోల్పోవడం ఖాయం' అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.