నాడు ఇందిర వెంట ఎన్టీయార్... నేడు మోడీ ఇలా ..!

ఆయనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఘన స్వాగతం పలుకుతారు. కానీ మోడీ వెంట కేవలం కర్నాటక గవర్నర్ తప్ప ఎవరూ కనిపించలేదు

Update: 2023-08-30 07:43 GMT

దేశంలో కాలం మారిన తీరుకు అనుగుణంగా రాజకీయాలు సాగుతున్నాయనడానికి ఎన్నో ఉదాహరణకు ఉన్నాయి. రాజకీయాలు అన్న తరువాత ఎంత లాభం ఎంత పొలిటికల్ మైలేజ్ అన్నదే చూసుకుంటారు. అయితే మరీ కొన్ని విషయాలలో ముఖ్యంగా ప్రోటోకాల్ నిబంధనలను పాటించే విషయంలో కూడా ఈ పాలిటిక్స్ ఏంటి అన్న చర్చ నడుస్తోంది.

దేశంలో ఇమేజ్ ఉన్న వారు నరేంద్ర మోడీ. అయితే ఆయన బీజేపీ నేతగా కొన్ని సార్లు రాజకీయం చేస్తున్నారని విపక్ష నేతలు విమర్శిస్తూంటారు. ముఖ్యంగా కీలకమైన విషయాల్లో దేశం మొత్తం ఆసక్తిని ప్రదర్శించే అంశాలలో బీజేపీకి మాత్రమే ఆ రాజకీయ మైలేజ్ రావాలని అనుకుంటారని కాంగ్రెస్ నేతల నుంచి హాట్ విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల నరేంద్ర మోడీ బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళ్ళి చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయినందుకు శాస్త్రవేత్తలను అభినందించారు. విదేశీ పర్యటనలో ఉన్న మోడీ అక్కడ నుంది డైరెక్ట్ గా బెంగళూరు లో దిగి మరీ ఇస్రో ఆఫీస్ కి వెళ్లారు. అయితే దేశ ప్రధాని వస్తున్నారు అంటే ప్రోటోకాల్ ఉంటుంది.

ఆయనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఘన స్వాగతం పలుకుతారు. కానీ మోడీ వెంట కేవలం కర్నాటక గవర్నర్ తప్ప ఎవరూ కనిపించలేదు. మరి ముఖ్యమంత్రి ఏరీ అంటే కాంగ్రెస్ వర్గాల నుంచే జవాబు వచ్చింది. ప్రధాని ఆఫీసు నుంచే తమను రావద్దు అని చెప్పారని అన్నారు.

దీని మీదనే ఇపుడు రగడ రాజకీయంగా పెద్ద ఎత్తున సాగుతోంది. బెంగళూరు ఇస్త్రో ఆఫీసులో ప్రధాని చాలా సేపు గడిపారు. అభినందన సభలో కూడా మాట్లాడారు. చంద్రయాన్ 3 విజయాన్ని బీజేపీ ఖాతాలో వేసుకోవడానికి ఇలా చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

దాంతో వారు మోడీ తీరుని తప్పుపడుతున్నారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం ప్రోటోకాల్ ని పక్కన పెడతారా అని నిందిస్తున్నారు. దాంతో పాత సంఘటనను ఒక దాన్ని కాంగ్రెస్ అగ్ర నేత జై రాం రమేష్ బయటకు తీశారు. అప్పట్లో అంటే 1983 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోటకు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వచ్చారు.

అప్పట్లో ఇస్రో ఎస్ ఎల్వీ 3 డీ 2 ప్రయోగం విజయవంతం అయినపుడు శాస్త్రవేత్తలను అభినందించడానికి ఇందిరాగాంధీ స్వయంగా శ్రీహరికోటకు వచ్చారు. ఆ రోజున ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. అదే ఏడాది జనవరి 5న జరిగిన ఎన్నికల్లో మూడున్నర దశాబ్దాల కాంగ్రెస్ పార్టీని ఓడించి టీడీపీ పవర్ లోకి వచ్చింది.

ఆ ఓటమి బాధ ఇంకా పచ్చిగానే ఉంది. అయినా సరే ఇందిరాగాంధీ ఎన్టీయార్ ని ప్రోటోకాల్ ప్రకారం పక్కన పెట్టుకునే శ్రీహరి కోటకు వెళ్లారు. ఈ విషయాన్ని పాత ఫోటోను ఆధారాలతో సహా జై రాం రమేష్ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. నాడు ఇందిరా గాంధీ ప్రోటోకాల్ పాటిస్తే నేడు మోడీ కర్నాటక సీఎం డిప్యూటీ సీఎం లను రాకుండానే తాను ఇస్రో ఆఫీసుకు వెళ్లారని నిందించారు.

ఇక ఆ రోజున అంటే ఆగస్ట్ 23న సాయంత్రం ఆరు గంటల పది నిముషాలకు చంద్రుడి మీద విక్రం ల్యాండర్ ల్యాండ్ అవుతున్న వేళ ఆఫ్రికా దేశంలో ఉన్న ప్రధాన్ లైవ్ లోకి వచ్చి చప్పట్లు కొడుతూ మొత్తం ఆ ఈవెంట్ అంతా కనిపించడాన్ని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు.

ఇంతలా లైవ్ లో ప్రధాని వచ్చి చంద్రయాన్ 3 విజయవంతం అయిన తరువాత స్పీచ్ కూడా ఇచ్చి చాలా సేపు లైవ్ టెలికాస్ట్ లో ఉండడం అంటే ఇది నిజంగా చంద్రయాన్ సక్సెస్ ని తమ వైపునకు మళ్ళించుకోవడానికి పడే ఆరాటంగానే చాలా మంది చూస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాలు వేరు రాజ్యాంగ పదవులు వేరు. ఆ పదవులలో ఉన్న వారు ప్రోటోకాల్ ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని అంటున్నారు. మోడీ తీరుని మాత్రం కర్నాటక కాంగ్రెస్ నేతలు తప్పు పడుతున్నారు.

Tags:    

Similar News