66 దేశాలు తిరిగిన మోదీ.. విదేశాంగ విధానంలొ కెనడా దెబ్బ?
బహుశా భారత దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మరే దేశాధినేత, ప్రధాని కూడా తిరగనన్ని దేశాల్లో పర్యటించారు నరేంద్ర మోదీ.
బహుశా భారత దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మరే దేశాధినేత, ప్రధాని కూడా తిరగనన్ని దేశాల్లో పర్యటించారు నరేంద్ర మోదీ. తొమ్మిదేళ్ల పైగా పాలనలో ఆయన 66 దేశాల్లో పర్యటించారు. పలుసార్లు పర్యటించిన దేశాలను కూడా కలుపుకొంటే మొత్తం ఆయన 72 పర్యటనలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో దేశాలకు తొలిసారి వెళ్లిన తొలి భారత ప్రధానిగా రికార్డులు నెలకొల్పారు. చాలా దేశాల్లో దశాబ్దాల తర్వాత పర్యటించిన భారత ప్రధానిగానూ చరిత్ర పుటల్లోకి ఎక్కారు.
విదేశాంగంలో గొప్ప కదలిక
ఇతర ప్రధానుల సంగతిని పక్కనపెడితే.. మోదీ బాధ్యతలు చేపట్టాక భారత విదేశాంగ విధానంలో చాలా మార్పు వచ్చిందని చెప్పక తప్పదు. 2015లో అనూహ్యంగా శత్రుదేశం పాకిస్థాన్ లో పర్యటించడం అందరినీ ఆశ్చర్యపరిస్తే, ఎన్నడూ లేని విధంగా మంగోలియాలోనూ ఆయన కాలిడి విశిష్టత చాటుకున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే అత్యంత ఘన చరిత్ర ఉన్న భారత్ విధానాలను ప్రపంచ దేశాలకు చాటిచెప్పడంలో ఇలాంటి పర్యటనలు ఉపయోగకరమే. కాగా, ఇన్నేళ్ల మోదీ విదేశాంగ విధానంలో కీలక మార్పు జైశంకర్ వంటి వారిని మంత్రిగా నియమించడం. ప్రపంచ వేదికలపై భారత్ వైఖరిని బలంగా చాటడంలో జైశంకర్ అత్యంత ప్రతిభ చూపారు.
గల్ఫ్ తోనూ బంధాలు బలం
మోదీ ఇటీవల యూఏఈలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆ దేశ కరెన్సీ దిర్హామ్ తో నేరుగా లావాదేవీలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే.. మధ్యలో డాలర్ వంటి మరే దేశ కరెన్సీకీ అవకాశం లేకుండా చేయడమే. భారత దేశీయ చెల్లింపుల వ్యవస్థ యూపీఐని యూఈ చెల్లింపుల వ్యవస్థతో లింక్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. యూఈఏ అనే కాదు.. అనేక దేశాలతో కీలక భాగస్వామ్యాలను మోదీ కుదుర్చుకున్నారు.
తేడా కొట్టింది కెనడాతోనే..
కొత్త దేశాలతోనూ సంబంధాలు పటిష్ఠం చేసుకుంటున్న మోదీ హయాంలో కెనడాతో మాత్రం తేడా కొట్టింది. దీనికి భారత ప్రభుత్వం నేరుగా కారణం కాదు. అయితే, ఖలిస్థానీ వివాదం ఇరు దేశాల సంబంధాలను దారుణంగా ప్రభావితం చేసింది. కెనడాలో 10 లక్షల మందిపైగా ఉన్న సిక్కులు అక్కడి రాజకీయాలను ముఖ్యంగా ప్రధాని టూడో ప్రభుత్వాన్ని బలంగా ప్రభావితం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఖలిస్థానీ వాదానికి కేంద్రంగా మారిన కెనడాలో.. జూన్ 15న జరిగిన నిజ్జర్ హత్య సంచలనంగా మారింది. ఆ హత్య వెనుక భారత నిఘా వర్గాలు ఉన్నాయని ఏకంగా కెనడా ప్రధాని ట్రూడో అరోపించడం మరింత వివాదానికి దారితీసింది. అంతేగాక.. ఇరు దేశాలు దౌత్య సిబ్బంది బహిష్కరణలకు దిగాయి. కెనడా పౌరులకు భారత ప్రభుత్వం వీసాల జారీ నిలిపివేసింది. కెనడాలో ఉంటున్న హిందువులకు జాగ్రత్త అంటూ అడ్వైజరీ జారీ చేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందనే తీవ్ర ఆరోపణ సైతం చేసింది. కెనడా నుంచి సైతం దీనికితగ్గట్లే ప్రతిస్పందనలు ఉంటున్నాయి. దీన్నిబట్టే ఇరు దేశాల సంబంధాలు ఏ స్థాయికి పడిపోయాయో స్పష్టమవుతోంది.
యథా స్థితికి ఎప్పుడో..?
కెనడా విశాల దేశం. భారతీయులకు విద్యావకాశాల పరంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తర్వాత కెనడా గమ్యస్థానంగా ఉంది. అలాంటి దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు యథాస్థితికి వచ్చేది ఎన్నడనేది చెప్పడం కష్టమే. అందులోనూ ట్రూడో వంటి ఉండగా.. సాధ్యమయ్యే పని కాదని స్పష్టమవుతోంది. 2014 నుంచి ఎన్నో దేశాల్లోపర్యటించి వాటితో సంబంధాలను బలోపేతం చేసిన మోదీకి, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానికి కెనడా సవాలు విసిరిందనడంలో సందేహం లేదు.