‘ఆక్సిలరీ ప్రమోషన్లు’.. తెలంగాణ పోలీస్ శాఖలో కొత్త కలకలం!

1998 ఎస్ఐ బ్యాచ్ కు చెందిన ఎం. గంగాధర్ పలు పేర్లను ప్రస్తావిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కంప్లైంట్ చేశారు.

Update: 2024-03-12 04:41 GMT
‘ఆక్సిలరీ ప్రమోషన్లు’.. తెలంగాణ పోలీస్ శాఖలో కొత్త కలకలం!
  • whatsapp icon

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో కొందరు పోలీసు అధికారులకు అడ్డగోలుగా ప్రమోషన్లు ఇచ్చారా? ఇందుకోసం ఒక ప్రొవిజన్ ను వాడేశారా? అంటే అవునన్న మాట ఇప్పుడు తెలంగాణ పోలీసు శాఖలో కొత్త కలకలంగా మారింది. ‘ఆక్సిలరీ’ పేరుతో కొందరికి పదోన్నతుల్ని కట్టబెట్టటంపై ఒక డీఎస్పీ తెర మీదకు తీసుకొచ్చిన కంప్లైంట్ ఇప్పుడు పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారింది.

1998 ఎస్ఐ బ్యాచ్ కు చెందిన ఎం. గంగాధర్ పలు పేర్లను ప్రస్తావిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం డీఎస్పీ హోదాలో ఉన్న ఆయన.. ఎస్ఐలుగా పోలీసు శాఖలో చేరి ఆక్సిలరీ పదోన్నతులు పొందిన నలుగురి అధికారుల పేర్లను పేర్కొనటం.. అందులో ఇటీవల సస్పెండ్ అయి వివిధ కేసులు ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణీత్ రావు పేరును ప్రస్తావించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

అక్రమ పద్దతిలో రహస్య సమాచారాన్ని సేకరించటం.. ఎన్నికల ఫలితాలు వెల్లడైనంతనే డేటాను ధ్వంసం చేయటం.. హార్డ డిస్కుల్ని మార్చేయటం లాంటి తీవ్ర ఆరోపణల్ని ఎదుర్కోవటం తెలిసిందే. అలాంటి ప్రణీత్ రావుకు సైతం ఆక్సిలరీ పేరుతో అసాధారణ ప్రతిభ చూపారంటూ పదోన్నతుల్ని కట్టబెట్టేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.సాధారణంగా ఈ ఆక్సిలరీ పదోన్నతులు మావో కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి మాత్రమే ఇస్తుంటారు. కానీ.. పలువురు అధికారులు దీన్ని ఆధారంగా చేసుకొని అడ్డదారిలో పదోన్నతుల్ని పొందినట్లుగా ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. దీంతో.. ఈ వ్యవహారంపై కొత్త చర్చ మొదలైందని చెప్పాలి.

తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన ఫిర్యాదులో చూస్తే.. 1991 బ్యాచ్ కు చెందిన ఒక అధికారి 2021లో ఎస్పీగా..1995 బ్యాచ్ కు చెందిన ఒక అధికారి 2018లో డీఎస్పీగా.. 1996 బ్యాచ్ కు చెందిన అధికారి 2019లో డీఎస్పీగా నిబంధనల్ని ఉల్లంఘించి మరీ ఆక్సిలరీ పదోన్నతుల్ని పొందటాన్ని ఎత్తి చూపుతున్నారు. ఇలా అక్రమ పద్దతిలో పదోన్నతులు పొందిన వారిలో ఇటీవల సస్పెండ్ అయిన ప్రణీత్ రావు కూడా ఉన్నారు.

ఎస్ ఐబీలో విధులు నిర్వర్తిస్తూ ఆధారాల ధ్వంసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణీత్ రావుకు సైతం ఆక్సిలరీ పేరుతో పదోన్నతులు కట్టబెట్టారన్న మాటను ఆధారాలు చూపించి మరీ చెబుతున్నారు. మావోయిస్టు వ్యవహారాల్లో కాకుండా పొలిటికల్ ఇంటెలిజెన్స్ లో పని చేసిన ప్రణీత్ కు ప్రమోషన్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం చూస్తే ఇది సరైనది కాదంటున్నారు. ఆక్సిలరీ ప్రమోషన్లపై రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలకు తెర తీయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News