అన్నా క్యాంటీన్లపై సర్వే.. వెలుగులోకి సంచలన విషయాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వాటిలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఒకటి. పేదల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో ఆర్థిక భారం లెక్కచేయకుండా ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు.

Update: 2025-01-19 17:30 GMT

కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ పీపుల్స్ పల్స్ రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఇటీవల నిర్వహించిన సర్వేలో ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అన్నా క్యాంటీన్ల నిర్వహణలో అనేక లోపాలు వెలుగులోకి రాగా, సెంట్రల్ ఆంధ్రాలోని లబ్ధిదారులు క్యాంటిన్ల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తమైనప్పటికీ పర్యవేక్షణ, సమయ పాలన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పీపుల్స్ పల్స్ నివేదించింది. అన్నా క్యాంటీన్ల పర్యవేక్షణకు ప్రత్యేక డిపార్ట్మెంట్ లేకపోవడం కూడా ప్రభుత్వానికి ఆశించిన ప్రయోజనం కల్పించడం లేదని తేలింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వాటిలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఒకటి. పేదల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో ఆర్థిక భారం లెక్కచేయకుండా ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం, ఆహారంలో నాణ్యత లోపం, ప్రభుత్వం ఈ పథకానికి వెచ్చిస్తున్న నిధులపై తగిన ప్రచారం లేకపోవడం వల్ల ప్రభుత్వానికి రాజకీయంగా ఎలాంటి మేలు జరగడం లేదని పీపుల్స్ పల్స్ నివేదకలో తెలిపింది. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, అన్నా క్యాంటిన్లను తొలుత ప్రారంభించారు. అయితే 2019లో అధికారం కోల్పోయిన తర్వాత అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి. కానీ, చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు తమ అధినేత ఆశయం కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రైవేటుగా అన్నా క్యాంటీన్లను నిర్వహించారు. ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న క్యాంటీన్లను టీడీపీ నేతలు ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంటీన్లతో సరిపోల్చి చూస్తే ఎక్కువ శాతం అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలిపింది.

అన్నా క్యాంటీన్లలో రూ.5కే భోజనం పెడుతున్నారని అక్కడి సిబ్బంది చెబుతున్నా, ప్రభుత్వం అదనంగా ఇస్తున్న మొత్తం ప్రజలకు తెలియడం లేదని తెలిపింది. దీనివల్ల రూ.5కే భోజనం ఇస్తున్నామని క్యాంటీన్ల సిబ్బంది కసురుకుంటున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి మూడు పూటలా భోజనానికి రూ.15తో పాటు ప్రభుత్వం అదనంగా రూ.75 చెల్లిస్తోంది. ఈ విషయంపై ఎవరికీ అవగాహన ఉండటం లేదు. దీంతో క్వాలిటీ తగ్గుతున్న నిర్వాహకులను ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా అన్నా క్యాంటీన్ల పర్యవేక్షణకు ఏ శాఖకు అధికారం లేకపోవడం, అధికారులు అస్సలు తనిఖీలు చేయకపోవడం వల్ల నాణ్యత లోపిస్తోందని చెబుతున్నారు. అన్నా క్యాంటీన్లలో భోజనం కింద అన్నంతోపాటు పప్పు, కూర, పచ్చడి పెడుతున్నా కూర కూడా పప్పు, సాంబారులానే ఉంటుందని లబ్ధిదారులు చెప్పినట్లు పీపుల్స్ పల్స్ తెలిపింది.

అన్నా క్యాంటీన్లను తక్కువ ఆదాయం కలిగిన వారు చక్కగా వాడుకుంటున్నారనేది స్పష్టమైంది. అయితే ప్రభుత్వం తమ కోసం ఎంత ఖర్చు పెడుతున్నదీ తెలియకపోవడం వల్ల ప్రజలకు ప్రభుత్వంపై ఎలాంటి సానుకూల అభిప్రాయం కలగడం లేదని చెబుతున్నారు. అన్నా క్యాంటీన్లపై ప్రభుత్వం ఎక్కువ ప్రచారం చేయాల్సిన అవసరాన్ని సర్వే ఏజెన్సీ స్పష్టం చేసింది. అన్నా క్యాంటీన్ల కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు వెచ్చిస్తోంది. దీనిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా అవగాహన ఉండటం లేదని, సోషల్ మీడియా ద్వారా ఈ పథకంపై ఇంకా ఎక్కువ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.

వాస్తవానికి రాష్ట్రంలో చాలా పట్టణాల్లో రూ.20 రూపాయలకు ఇడ్లీ, దోశ వంటి అల్పాహారం లభిస్తుంది. కానీ, అన్నా క్యాంటీన్లలో అల్పాహారం కోసం రూ.22 తీసుకుంటున్న నిర్వహణ సంస్థ మెరుగైన, నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదని సర్వే సంస్థ తెలిపింది. ఇక తాగునీరు, శుభ్రత విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని, చాలా చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వెల్లడించింది. అదేవిధంగా చిల్లర సమస్య ఎక్కువగా ఉంటోందని, యూపీఐ చేయమని సిబ్బంది చెబుతుండటం, యూపీఐ చేసే స్థోమత లేనివారే ఎక్కువగా అన్నాక్యాంటీన్లకు వస్తుండటం వల్ల ఆహారం అందక వెనుదిరుగుతున్నారని తెలిపింది.

ప్రస్తుతం అన్నా క్యాంటీన్లలో అందిస్తున్న భోజనం రుచి మెరుగు పరచాలని సూచనలు ఎక్కువగా వచ్చాయి. ప్రజల జిహ్వకు తగినట్లు ఉప్పు, కారం ఉండటం లేదని చెబుతున్నారు. అంతేకాకుండా అక్షయపాత్ర ద్వారా భోజనం సరఫరా చేస్తున్నారని, అక్షయపాత్ర వంట శాలలు ఉమ్మడి జిల్లాకు ఒకటి రెండు మాత్రమే ఉంటున్నాయని తెలిపింది. వీటి నుంచి భోజనం సుదూరంలో ఉండే క్యాంటీన్లకు చేరే సరికి చల్లబడిపోవడం, చెడు వాసన రావడం జరుగుతోందని పీపుల్స్ పల్స్ తన నివేదికలో తెలిపింది. ఇక వీటికి ప్రత్యామ్నాయంగా కొన్ని సూచనలు చేసింది. నాయకులు తరచూ క్యాంటీన్లలను తనిఖీ చేయాలని, ముఖ్యమంత్రి, మంత్రులు ఆకస్మిక తనిఖీ చేస్తే ప్రయోజనం ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో నిధులు అందజేస్తున్నా తగిన రాజకీయ ప్రయోజనం లభించడం లేదని, ఇందుకోసం స్వయం సహాయక సంఘాలకు క్యాంటీన్ల బాధ్యత అప్పగిస్తే స్థానికంగా ఉపాధి కల్పనతోపాటు మెరుగైన ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచించింది. మొత్తానికి ప్రభుత్వం భారీగా డబ్బు వెచ్చిస్తున్నా, రాజకీయంగా ప్రయోజనం దక్కడం లేదని మాత్రం తెలిపింది.

Tags:    

Similar News