జగన్ ని టార్గెట్ చేయను... జస్ట్ ఎమ్మెల్యేని...రఘురామలో బడబాగ్ని బద్ధలవుతోందా?

అయిదు నెలల కూటమి ప్రభుత్వం పైన తన అభిప్రాయాలను చెప్పారు జగన్ విషయంలో తన మనసులో మాటలను కూడా చెప్పారు.

Update: 2024-11-10 15:30 GMT

ట్రిపుల్ ఆర్ గా పేరు గడిచిన రఘు రామ క్రిష్ణం రాజు ఇపుడు జస్ట్ ఎమ్మెల్యేను అని చెప్పుకుంటున్నారు. ఒక యూ ట్యూబ్ చానల్ కి ఆయన లేటెస్ట్ గా ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నారు. అయిదు నెలల కూటమి ప్రభుత్వం పైన తన అభిప్రాయాలను చెప్పారు. జగన్ విషయంలో తన మనసులో మాటలను కూడా చెప్పారు. మొత్తం మీద చూస్తే ఆయనలో ఏదో బడబాగ్ని దాచుకున్నట్లుగానే ఆ ఇంటర్వ్యూ ఆద్యంతం చూసిన వారికి అర్ధం అవుతోంది అని అంటున్నారు.

ఇంతకీ రఘురామ ఏమి అన్నారు అంటే ఒకటేమిటి చాలా విషయాలే పంచుకున్నారు. ఆయన అసెంబ్లీలో ప్రమాణం చేయడానికి వచ్చిన జగన్ వద్దకు వెళ్ళి ఆయనతో ఏమి మాట్లాడింది రివీల్ చేశారు. తాను జగన్ ని అసెంబ్లీకి రమ్మని కోరాను అని అన్నారు. అయితే లేటెస్ట్ గా జగన్ తాను అసెంబ్లీకి రాను అని చెప్పారని ఆయన తన రాజకీయ సమాధిని తానే తవ్వుకుంటున్నారు అని అర్ధం అవుతోందని అన్నారు.

జగన్ అసెంబ్లీకి వస్తే ఆయనకు మైకు కచ్చితంగా ఇస్తారని అన్నారు. ఆయన వైసీపీకి సంబంధిచిన 11 మంది సభ్యులకు ఫ్లోర్ లీడర్ గా మైక్ దక్కించుకునే చాన్స్ ఉందని అన్నారు. ఆయనకు ఆ మేరకు టైం కూడా లభిస్తుందని ఆయన చెప్పారు. అయితే అసెంబ్లీకి రాను అని చెప్పడానికి జగన్ వద్ద తగిన కారణాలు లేవని అన్నారు.

ఇక తాను జగన్ ని ఎందుకు టార్గెట్ చేయడం లేదు అన్న ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఇపుడు ఓడిపోయారని, ప్రతిపక్షంలో ఉన్నారని అన్నారు. ఆయన ప్రభుత్వం ఇపుడు లేదు అందువల్ల టార్గెట్ చేయాల్సిన పని లేదని అన్నారు. మరో వైపు తమ అయిదు నెలల కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోందని రఘురామ చెప్పుకున్నారు.

అయిదు నెలలలో రెండు హామీలను నెరవేర్చారని మిగిలినవి తీరుస్తారని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగున్నపుడు అన్ని హామీలూ ఇస్తారని అన్నారు. ఒక్కోటీ నెమ్మదిగా జరుగుతుందని ఆయన అంటూ బడ్జెట్ లో హామీల గురించి ఒక క్లారిటీ వచ్చే చాన్స్ ఉందని అన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖల పట్ల అవగాహన పెంచుకుని పని చేస్తున్నారు అని అన్నారు. మరో వైపు ఏపీలో టీడీపీ కూటమి ఏర్పడడం వెనక తన వంతు కష్టం ఉందని ప్రజలు భావిస్తున్నారు అని ఆయన అన్నారు. తాను జగన్ ని విమర్శించే సమయానికి ఏపీలో వైసీపీ ఏకపక్ష విజయాలను సాధించిందని గుర్తు చేశారు. అంతే కాదు లోకల్ బాడీస్ లో మొత్తం సీట్లు వైసీపీ గెలుచుకుందని అన్నారు.

ఆ టైం లో ఏపీలో ప్రతిపక్షాలు సైతం సన్నద్ధంగా లేవని తాను మాత్రం జగన్ ని ఎదిరించి ఆయన పాలనలో డొల్లతనాన్ని ధైర్యంగా జనాలకు వివరించానని రఘురామ అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తనకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని అభిమానులు అంతా భావించారని ఆయన చెప్పారు.

అయితే అది జరగలేదని అన్నారు. కేబినెట్ లో ఒక బెర్త్ ఇంకా ఖాళీగా ఉందని యాంకర్ గుర్తు చేస్తే ఏమో ఎందుకోసమో తెలియదు అని దాటవేశారు. ఇక స్పీకర్ పదవి అయినా లేదా టీటీడీ చైర్మన్ పదవి అయినా తనకు దక్కుతుందని అది కూడా లభించకపోయేసరికి అభిమానులు మాత్రం హర్ట్ అయ్యారని అన్నారు. ఇక తాను కూడా హర్ట్ అయినా ప్రస్తుతం సర్దుకుని తన ఉండి నియోజకవర్గం అభివృద్ధి మీద దృష్టి పెట్టాను అని రఘురామ అన్నారు.

క్షత్రియులు లేని కేబినెట్, టీటీడీ బోర్డు గురించి ఏమి స్పందిస్తారు అన్న ప్రశ్నకు జవాబిస్తూ బాధాకరమే అని అన్నారు. ఇటీవల తాను క్షత్రియ సామాజిక వర్గం సమావేశానికి అటెండ్ అయ్యాయని పదవులు రాలేదని బాధ పడడం కంటే డిమాండ్ చేయాలని వారికి సూచించాను అని రఘురామ పేర్కొన్నారు

జగన్ మళ్లీ సీఎం అవుతాను అంటున్నారు అన్న దానికి రెస్పాండ్ అవుతూ జగన్ ఇక మళ్లీ సీఎం అయ్యే చాన్సే లేదని రఘురామ ఖండితంగా చెప్పేశారు. ఆయన భ్రమలలో ఉంటే ఎవరూ చేసేది ఏమీ ఉండదని ఆయన అన్నారు. ఇంకో వైపు చూస్తే జగన్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం మీద మాట్లాడుతూ అలా రచ్చ కాకుండా ఉండి ఉంటే బాగుండేది అని అన్నారు.

ఏది ఏమైనా ఆ విషయం మీద నో కామెంట్ అనేశారు. మొత్తం మీద చూస్తే రఘురామకు తనకు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి అయితే ఉందని తెలుస్తోంది. మరి అది బడబాగ్నిగా మారి ఎపుడైనా బద్ధలవుతుందా లేదా అన్నది కాలం చెప్పాలి. ఏది ఏమైనా జస్ట్ ఎమ్మెల్యేని నేను అని ఆయన సెటైరికల్ గా అంటున్నారా అన్నది కూడా చూడాల్సి ఉంది.

Tags:    

Similar News