టీడీపీ అభ్యర్థుల్లో మార్పులు... అసెంబ్లీకి రఘురామ!
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీ రాజకీయాల్లో అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీ రాజకీయాల్లో అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కూటమిలో సీట్ల పంపకాలు, టిక్కెట్ల కేటాయింపు, అభ్యర్థిత్వాల ఫైనలైజేషన్ మొదలైన విషయాలు ఆయా పార్టీల అధినేతలకు ప్రహసనంలా మారాయని అంటున్న నేపథ్యంలో... ఇప్పటికే ప్రకటించిన టీడీపీ అభ్యర్థులలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇదే సమయంలో “అసెంబ్లీ రఘురామ” అనే విషయం వైరల్ గా మారింది.
అవును... ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ.. కూటమి టిక్కెట్లు, అభ్యర్థుల ఎంపిక విషయంపై ఇప్పటికీ పరిపూర్ణమైన క్లారిటీ రాకపోవడం అనే విషయం తీవ్ర చర్చనీయాంశమే కాకుండా.. కూటమి కార్యకర్తల్లో ఆందోళనలకు కూడా దారితీస్తుందని అంటున్నారు. ఈ సమయంలో తుది కసరత్తుల్లో భాగంగా.. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో మార్పులు జరగుతున్నాయని తెలుస్తోంది.
ఇందులో భాగంగా... టీడీపీ ఇప్పటికే ప్రకటించిన 139 అసెంబ్లీ అభ్యర్థుల విషయంలోనూ మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో... నరసాపురం లోక్ సభ టిక్కెట్ ఆశించి భంగపడిన రఘురామ కృష్ణంరాజుని టీడీపీలో చేర్చుకుని, అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చే విషయంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని, అదే ఆల్ మోస్ట్ ఫైనల్ కావొచ్చని అంటున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతానికి అందుతోన్న సమాచారం ప్రకారం... కడపకు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేరు ప్రతిపాదనలో ఉండగా... తాజాగా జమ్మలమడుగు ఇన్ ఛార్జ్ భూపేశ్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందని తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ తరుపున జమ్మలమడుకు ఆదినారయణరెడ్డి పేరు కన్ ఫాం అయినట్లు తెలుస్తుంది! ఇదే సమయంలో... అనంతపురం ఎంపీ స్థానానికి అంబికా లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ రాజేష్, కంబూరి నాగరాజు, పూల నాగరాజులలో ఒక పేరు కన్ ఫాం కావొచ్చని అంటున్నారు.
ఇదే జిల్లా మడకశిరి ఎస్సీ నియోజకవర్గంలో తొలుత అనిల్ పేరు ప్రకటించినప్పటికీ... మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం అడ్డం తిరగడంతో.. ఆ సీటుంకు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరు తెరపైకి వచ్చింది. మరోపక్క విజయనగరం జిల్లా గజపతి నగరం అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ పేరు ఇప్పటికే ప్రకటించినా... తాజాగా ఆ సీటుకు కళా వెంకట్రావు పేరు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో సూళ్లూరుపేట అభ్యర్థిని కూడా మార్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.
ఇవన్నీ ఒకెత్తు అయితే... అసెంబ్లీకి రఘురామకృష్ణంరాజు అనే అంశం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆర్.ఆర్.ఆర్. విషయంలో బాబు ఒక నిర్ణయానికి వచ్చారని.. అందులో భాగంగా ఆయనను టీడీపీలో చేర్చుకుని, అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని ఫిక్సయ్యారని అంటున్నారు. ఈ మేరకు చంద్రబాబు.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం నుంచి రఘురామ కృష్ణంరాజును బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
తొలుత విజయనగరం లోక్ సభ స్థానం అయినా ఇవ్వాలని ప్లాన్ చేశారని.. అయితే ఈ ప్రతిపాదనపై ఉత్తరాంధ్ర నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యిందని తెలుస్తుంది. దీంతో.. ఇప్పటికే ప్రకటించిన ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థిని తప్పించి, ఆ స్థానాన్ని రఘురామ తో భర్తీ చేయాలని బాబు భావిస్తున్నారని తెలుస్తుంది. దీంతో... రఘురామకు ఏ టిక్కెట్ కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది!