కూటమి అభ్యర్థిగా బరిలో ఉంటానంటున్న రఘురామ... వెస్ట్ లో హాట్ చర్చ!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ స్థానం హాట్ టాపిక్ గా మారింది

Update: 2024-03-29 03:56 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ స్థానం హాట్ టాపిక్ గా మారింది. కూటమిలో భాగంగా ఈ స్థానం ఏపార్టీకి దక్కినా.. ఆ పార్టీ టిక్కెట్ మాత్రం తనకే దక్కుతుందనే ధీమాతో రఘురామ కృష్ణంరాజు ఉన్న సంగతి తెలిసిందే! తాడేపల్లిలో జరిగిన టీడీపీ - జనసేన తొలి ఉమ్మడి బహిరంగ సభలో.. పవన్ - చంద్రబాబు సమక్షంలోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు.

కట్ చేస్తే.. పొత్తులో భాగంగా నరసాపురం టిక్కెట్ బీజేపీకి ఇచ్చారు చంద్రబాబు. ఈ లోక్ సభ స్థానంలోని నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలకు జనసేనకు కేటాయించారు. మిగిలిన వాటిలో పాలకొల్లు, ఉండి, ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో... నరసాపురం లోక్ సభ స్థానానికి కూటమి అభ్యర్థిగా శ్రీనివాస వర్మను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ.

దీంతో... రఘురామ కృష్ణంరాజు పరిస్థితి ఏమిటనే చర్చ తెరపైకి వచ్చింది! ఈ సమయంలో రఘురామ కు ఏదో ఒక టిక్కెట్ అయితే ఇవ్వాలని.. అందులో భాగంగా నరసాపురం లోక్ సభ పరిధిలో ఒక అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయంటూ కథనాలు హల్ చల్ చేశాయి. ఈ క్రమంలో... తనకు టిక్కెట్ రాకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారని చెప్పిన రఘురామ కృష్ణంరాజు... తనకు టిక్కెట్ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్ లపై ఉందని నొక్కి చెప్పారు.

ఈ క్రమంలో తాజాగా.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పెద అమిరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తనను ఇబ్బందిపెట్టే విషయంలో ఎన్నో సార్లు ఫెయిల్ అయిన జగన్.. టిక్కెట్ విషయంలోనూ ఫెయిల్ అవుతారనుకున్నాను కానీ... తాత్కాలికంగా ఆయన విజయం సాధించారని అన్నారు.

ఈ క్రమంలో.. ముందుచూపుతోనే తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది చెప్పలేదని అన్నారు. ఇదే సమయంలో... బీజేపీ నుంచి తాను బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చని రఘురామ తెలిపారు. అదేవిధంగా... తనకు ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... మూడు రోజులు పడుతుందా.. నాలుగు రోజులు పడుతుందా.. ఎన్ని రోజులు పడుతుందనేది తాను చెప్పలేను కానీ... తనకు సీటు వచ్చే విషయంపై, తనకంటే నియోజకవర్గ ప్రజలకే కాదు.. రాష్ట్రంలోని జగన్ ని వ్యతిరేకించే వారందరికీ నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. అందువల్ల... కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేయగలననే నమ్మకం, విశ్వాసం తనకు ఉందని.. కూటమి తనకు నూటికి నూరుశాతం న్యాయ్యం చేస్తుందని రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News