రఘురామను అధ్యక్షా అనాలా...!?

ఒక నాయకుడు అయితే ఇంకా చేరని పార్టీలో ఇవ్వని సీటు గురించి ఊహించుకుని తనకు ఇవ్వబోయే పదవి గురించి కలలు కంటున్నారు.;

Update: 2024-04-04 16:15 GMT

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని ఒక ముతక సామెత ఉంది. ఏపీలో ఎన్నికలు ఇంకా జరగలేదు. ఒక నాయకుడు అయితే ఇంకా చేరని పార్టీలో ఇవ్వని సీటు గురించి ఊహించుకుని తనకు ఇవ్వబోయే పదవి గురించి కలలు కంటున్నారు. ఆయన ఎవరో కాదు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు.

ఆయన నర్సాపురం నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. కానీ పొత్తులో ఆ సీటు బీజేపీకి వెళ్ళింది. బీజేపీ అయితేనేమి తనకే టికెట్ అని ఆశించారు కానీ బీజేపీ శ్రీనివాసవర్మకు టికెట్ ఇచ్చింది. దాంతో షాక్ తినడం రఘురామ వంతు అయింది. ఇక చంద్రబాబు ద్వారా ఆయన చేయాల్సిన ప్రయత్నాలు చేశారు అంటారు. బీజేపీ మాత్రం నర్సాపురం ఎంపీ సీటుని టీడీపీకి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో చంద్రబాబు ఇపుడు రఘురామకు ఎక్కడో ఒక చోట అకామిడేషన్ చూపించాలనుకుంటున్నారు.

నర్సాపురం పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఉండి అసెంబ్లీ సీటు నుంచి ఆయనకు సీటు ఇవ్వాలనుకుంటున్నారు. రేపో మాపో రఘురామ టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారుట. ఆ తరువాత ఆయనకు టికెట్ దక్కుతుందట. ఇదిలా ఉండగానే రఘురామ మాత్రం తన మనసులోని ఊహలను కలకలను కోరికలను మీడియా ముందు వెళ్లబోసుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీలో కాబోయే స్పీకర్ తానే అని ఆయన అంటున్నారు. తనను అలా చూడాలని చాలా మందికి ఉంది అని చెప్పుకుంటున్నారు అని అన్నారు.

తాను ఎంపీగా పోటీ చేస్తానో లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో తెలియదు అని అన్నారు. ఎంపీగా పోటీ చేయాలన్నది తన ఆశ అన్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండాలని స్పీకర్ గా సేవలు అందించాలని చాలా మంది ఆశ అని రఘురామ అంటున్నారు.

అంటే రఘురామ పెద్ద స్కెచ్ తోనే ఉన్నారని అంటున్నారు ఆయన అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యే కావడం ఖాయమని టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఇంకా ఖాయమని నమ్ముతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే స్పీకర్ పదవి తనకే ఇవ్వడం ఇంకా ఖాయమని కూడా బలంగా నమ్ముతున్నారు.

మొత్తం మీద రాజు గారి ఆశలు చాలానే ఉన్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే స్పీకర్ పదవికి రాజు గారినే ఎన్నుకుంటారు అని ఆయన ఎలా అనుకుంటున్నారు అన్న చర్చ కూడా ఉంది. టీడీపీలోనే సీనియర్ మోస్ట్ లీడర్స్ చాలా మంది ఉన్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఒక్క మాట చెప్పుకోవాలి. రఘురామకు ఆశలే కాదు అదృష్టం కూడా ఉంది. అందువల్ల ఆయన ఆశలు అదృష్టం కలసి ఆయనకు ఎక్కడికి తీసుకెళ్తాయో చూదాల్సి ఉంది.

Tags:    

Similar News