జగన్ కి రాహుల్ ఫోన్...రేపు బెంగళూరులో జగన్ తో చర్చలు ?
ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ జగన్ కి ఫోన్ చేసి ఇండియా కూటమిలో చేరమని కోరుతున్నారు అని టాక్ అయితే నడుస్తోంది.
జాతీయ స్థాయిలో ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఏపీలో వైసీపీ రాజకీయ అడుగులు మారుతున్నాయని సంకేతాలు వస్తున్నాయి. దానిని బట్టి ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వైసీపీ ఇండియా కూటమి వైపు టర్న్ అవుతోంది అని అంటున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ జగన్ కి ఫోన్ చేసి ఇండియా కూటమిలో చేరమని కోరుతున్నారు అని టాక్ అయితే నడుస్తోంది. బెంగళూరు కి జగన్ శుక్రవారం చేరుకుంటున్నారు. నంద్యాల పర్యటన చూసుకుని జగన్ బెంగళూరు కి ప్రయాణం కట్టారు. దీంతో అనేక రకాలైన వార్తలు షికారు చేస్తున్నాయి.
బెంగళూరు వేదికగా ఒక భారీ రాజకీయ పరిణామానికి తెర లేవనుంది అని అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కీలక నేతలు ఎవరైనా బెంగళూరు వచ్చి జగన్ తో చర్చలు జరుపుతారు అని అంటున్నారు. ఈ చర్చలు సీక్రెట్ గా సాగుతాయని అంటున్నారు.ఈ చర్చలలో అంతా సానుకూలం అనుకుంటే రాహుల్ గాంధీ నేరుగా వచ్చి జగన్ తో చర్చలు జరుపుతారు అని అంటున్నారు.
ఇక ఎన్డీయే కూటమిలో వైసీపీకి నో చాన్స్ అని తేలిపోయింది. 2014 నుంచి 2019 లాంటి రాజకీయ పరిస్థితులు కూడా అక్కడ లేవు. పూర్తిగా తెలుగుదేశం ఎంపీల బలం మీద ఆధారపడిన ఎన్డీయే ప్రభుత్వం టీడీపీని కాదని వైసీపీని చూసే అవకాశాలు ఏ మాత్రం లేవు అని అంటున్నారు. అక్కడ టీడీపీ జనసేన స్ట్రాంగ్ గా ఉన్న పార్టీలు.
ఏ విధంగా చూసినా ఎన్డీయే కూటమిలోకి జగన్ ని రానీయరు అని టీడీపీ కూటమిలో అంతా అంటున్నారు. ఇక ఏపీలో అన్ని విధాలుగా రాజకీయ ఇబ్బందులు పడుతున్న వైసీపీకి జాతీయ పార్టీ అండదండలు కావాలని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇండియా కూటమి వైపుగా వైసీపీ అడుగులు పడుతున్నాయి. ఏదో ఒక కూటమిలో వైసీపీ ఉండాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు.
అలా చేస్తేనే జగన్ కి ఢిల్లీ స్థాయిలో ఒక సపోర్ట్ అయితే దొరుకుతుంది అని అంటున్నారు. ఇక జగన్ అక్రమాస్తుల కేసుల విషయానికి వస్తే వాటికి సంబంధించిన అన్ని చార్జిషీట్లూ వేశారు కాబట్టి ఇంక అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉండదని అంటున్నారు. ఇక కొత్తగా జగన్ మీద కేసులు పెడితే తప్ప ఆయనని ఏమీ చేయలేరు. ఒకవేళ అలా అనుకున్నా జగన్ మీద టార్గెట్ చేసి కొత్త కేసులు పెట్టినా ఆయన ఇండియా కూటమిలో ఉంటే గట్టి మద్దతు లభిస్తుంది కాబట్టి ఎవరూ ఏమీ చేయలేరని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఏపీలో రాజకీయ పరిస్థితులు చూస్తే వైసీపీకి అత్యంత ఇబ్బందికరంగా ఉన్నాయి. టీడీపీ జనసేన వెరీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ బలం ముందు వారి అధికారం ముందు వైసీపీ తట్టుకుని నిలబడడం బహు కష్టం అని తేల్చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అండ అయితే 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీకి ఎంతో కొంత దొరికింది. ఆనాడు బీజేపీ ఫ్రీ బర్డ్ గా ఉండేది. సొంత మెజారిటీతో అధికారం చలాయించేది.
ఇపుడు అలాంటిది లేదు కాబట్టి ఏపీలో టీడీపీ జనసేన చెప్పినట్లుగా రాజకీయ ప్రత్యర్ధిగా వైసీపీని భావించాల్సిందే. ఆ క్రమంలో కొత్త కేసులు ఏమైనా పెట్టినా పెట్టవచ్చు. అదే జరిగితే జగన్ ఒంటరి అయిపోతారు. గతంలో జగన్ జైలుకు వెళ్తే ఆయన తల్లి చెల్లెలు పార్టీ కొమ్ము కాశారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని అంటున్నారు.
ఇప్పటికే ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఫలితాలను మూటగట్టి కోవడంతో పార్టీ మొత్తం డీ మోరలైజ్ అయింది. ఎక్కడికక్కడ క్యాడర్ నిస్తేజం అయింది. అసలు నాయకులే స్తబ్దుగా ఉండిపోతున్నారు. కొందరు అయితే పార్టీ మారుతున్నారు. మరి కొందరు ఎందుకొచ్చిన రాజకీయం అనుకుంటున్నారు. ఈ క్రమంలో నుంచి చూసినపుడు వైసీపీ ఇపుడిపుడే జనంలోకి వెళ్ళి కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు.
వైసీపీ పుంజుకునేలోగానే అధికార టీడీపీ కూటమి గట్టిగా దెబ్బ తీసే అవకాశాలు ఉన్నాయి. దాంతో వైసీపీ వీటిని తట్టుకుని నిలబడాలి అన్నా పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపాలని అన్నా లేక వైసీపీకి మంచి రోజులు వస్తాయని భరోసా ఇవ్వాలని చూసినా కచ్చితంగా ఇండియా కూటమిలో చేరడమే మేలు అని అంటున్నారు. ఇండియా కూటమిలోని పార్టీల భావజాలం ఒక్కటే.
పైగా జగన్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఒక్కటే. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో వేగంగా ఎదుగుతోంది. ఆ పార్టీని శత్రువుగా చేసుకోవడం కంటే మిత్రపక్షంగా చేసుకుంటే ఎంపీలు కాంగ్రెస్ కి ఎక్కువగా ఇచ్చి ఏపీలో అధికారాన్ని 2029 నాటికి వైసీపీ నిలబెట్టుకోవచ్చు అన్న ఒక ఫార్ములా కూడా ఉంది అని అంటున్నారు.
కాంగ్రెస్ వరకూ చూస్తే వారికి జాతీయ రాజకీయాలు చాలా ముఖ్యం. అందువల్ల జగన్ కాంగ్రెస్ తో చేయి కలిపి ఇండియా కూటమిలో చేరితేనే ఆయన పాలిటిక్స్ కి వైసీపీకి ఎంతో మేలు అని అంతా అంటున్నారు. జగన్ వైసీపీ ఓడిన తరువాత తరచూ బెంగళూరు వెళ్తున్నారు. ఆయన అక్కడ నుంచే తన పార్టీ రాజకీయాన్ని మార్చేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమిలో వైసీపీ చేరితే మాత్రం వైసీపీకి అది బూస్ట్ అవుతుంది అని అంటున్నారు. అంతే కాదు ఏపీ రాజకీయాల్లో కీలకమైన పరిణామం గా చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.