రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్... పార్లమెంట్ లో దుమారం
రాహుల్ సభ నుంచి బయటకు వెళ్తూ కేంద్ర మంత్రిని చూసి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. లోక్ సభలో ఇది అతి పెద్ద దుమారం రేపుతోంది. రాహుల్ గాంధీ వివాదంలో దీంతో మరోసారి పడ్డారని అంటున్నారు. నిజానికి ఏమి జరిగింది అంటే మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రవేశపెట్టిన క్రమంలో రెండవ రోజు అయిన బుధవారం రాహుల్ గాంధీ సభలో కొంత సేపు ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మోడీ మీద ఘాటు వ్యాఖ్యలే చేశారు. మోడీ మణిపూర్ ప్రజల విషయంలో ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు అని దుయ్యబెట్టారు. భారతమాతను బీజేపీ పాలకులు హత్య చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు. మణిపూర్ దేశంలో లేదని భాగం కాదని మోడీ అనుకుంటున్నారా అని ఆయన నిలదీసారు.
తాను మణిపూర్ వెళ్ళాను, మోడీ ఇప్పటిదాకా ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే రాహుల్ ప్రసంగంలో ప్రతీ పాయింట్ కి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జవాబు చెప్పారు. రాహుల్ కి దేశం మీద ప్రేమ ఉంటే దేశంలో ఇతర ప్రాంతాలలో జరుగుతున్న మహిళా అత్యాచారాల మీద ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ని రద్దు చేయడం వల్లనే రాహుల్ తన పాదయాత్ర అక్కడ చేయగలిగారని అన్నారు.
కాంగ్రెస్ ది అవినీతి పాలన, కుటుంబ పాలన వారసత్వ పాలన అందుకే ప్రజలు ఆ పాలనను వద్దు అంటున్నారు అని స్మృతి ఇరానీ గట్టిగానే విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే రాహుల్ ప్రసంగానికి స్మృతి కౌంటర్ ఇచ్చే సందర్భంలో రాహుల్ సభ నుంచి బయటకు వెళ్తూ కేంద్ర మంత్రిని చూసి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించారు.
ఇదెక్కడి పద్ధతి అంటూ ఆమె మండిపడ్డారు. సభా సంప్రదాయాలను కాలరాసే విధానం ఇది అన్నారు. స్త్రీ ద్వేషిగా రాహుల్ ని ఆమె అభివర్ణించారు. ఆయన మీద చర్యలకు డిమాండ్ చేశారు. దాంతో బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు అంతా కలసి స్పీకర్ కి రాహుల్ ఫ్లయింగ్ కిస్ మీద ఫిర్యాదు చేశారు.
దీని మీద లోక్ సభలో కెమెరాల్లో రికార్డు అయితే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే రాహుల్ వర్సెస్ స్మృతి ఇరానీగా సభలో చర్చ సాగుతున్న వేళ కెమెరాలు అన్నీ ఆ వైపునే రికార్డు చేస్తూ కనిపించాయి. గందరగోళంతో సభ ఉన్నపుడు కెమెరాలా ఫోకస్ అంతా ఆ వైపుగానే ఉంది. దాంతో సభ నుంచి రాహుల్ వెళ్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారా లేదా అన్నది నిర్ధారణ అయితే కావడంలేదు.
మరి దీని మీద లోక్ సభ స్పీకర్ ఏ విధంగా నిర్ధారించి చర్యలు తీసుకుంటారు అన్నది చూడాలి. ఏది ఏమైనా రాహుల్ మీద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు ఆరోపణలతో ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.