అనూహ్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. మరోసారి తన మార్కును ప్రదర్శించారు. ఇటీవల కాలంలో ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకుంటూ అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈ మధ్యన ట్రక్ లో కిలోమీటర్ల దూరం ప్రయాణించటం.. ఆ సందర్భంగా ట్రక్ డ్రైవర్ల సమస్యల గురించి వివరాలు తెలుసుకోవటం లాంటివి చేయటం తెలిసిందే. వీలైనంత వరకు సామాన్యుల చెంతకు వెళ్లి.. వారేం కోరుకుంటున్నారు? వారికున్న సమస్యల మీద అవగాహనను అంతకంతకూ పెంచుకుంటున్న వైనం అందరిని ఆకర్షిస్తోంది.
తాజాగా అలాంటి పనే మరొకటి చేశారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల వేళలో.. చీకట్లు దట్టంగా కమ్ముకుంటూ దేశ రాజధాని నిద్ర మత్తు నుంచి తేరుకోక ముందే ఆయన ఉత్సాహంగా దేశంలోనే అతి పెద్దదైన అజాద్ పుర్ మండీలో ప్రత్యక్ష మయ్యారు. రాహుల్ అక్కడకు రావటాన్ని చూసిన కూరగాయలు..పండ్ల వ్యాపారులు సర్ ప్రైజ్ కు గురయ్యారు. ఆయన చుట్టూ చేరి ఆయనతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వివిధ కూరగాయల ధరల్ని అడిగి తెలుసుకున్న రాహుల్.. తన మండీ టూర్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి కన్నీటిపర్యంతమై.. ‘దేశాన్ని రెండుగా చీల్చారు. ఒకవైపు అధికారాన్ని కాపాడుకునేవాళ్లు.. మరోవైపు సాధారణ వ్యక్తులు. ఎవరి సలహాలతో దేశ విధానాలు రూపొందిస్తున్నారు’ అంటూ ప్రశ్నించిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే..కనీస ధరలకు కూరగాయలు సామాన్యులకు అందటం లేదన్న ఆవేదనను రాహుల్ వ్యక్తం చేయటం గమనార్హం. ఏమైనా.. అనూహ్య రీతిలో వ్యవహరిస్తున్న రాహుల్ తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.