మహిళా తహసీల్దార్ అక్రమాస్తులు అన్నికోట్లా?

హనుకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో నివాసం ఉండే రజనీ.. ఏడునెలల క్రితం వరకు ధర్మసాగర్ తహసీల్దార్ గా వ్యవహరించారు

Update: 2024-03-14 04:01 GMT

ఆమె ఒక మహిళా తహసీల్దార్. తాజాగా ఆమె ఇంటి మీదా.. ఆమె సన్నిహితుల ఇళ్ల మీదా దాడులు జరిపిన ఏసీబీ అధికారులకు దెబ్బకు షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. అధికారికంగా రూ.3 కోట్ల ఆస్తులు తెర మీదకు వచ్చినట్లుగా చెబుతున్నా.. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే రూ.12 కోట్లకు పైనే ఉన్నట్లుగా చెబుతున్నారు. అధికారుల తనిఖీల నేపథ్యంలో 21 ఇళ్ల స్థలాలు.. ఏడు ఎకరాల పొలం.. కిలోన్నర బంగారంతో పాటు మరిన్ని ఆస్తులు ఉన్నట్లుగా చెబుతున్నారు. జమ్మికుంట తహసీల్దార్ గా వ్యవహరిస్తున్న రజనీకి అక్రమాస్తులు భారీగా ఉన్నట్లుగా గుర్తించారు.

హనుకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో నివాసం ఉండే రజనీ.. ఏడునెలల క్రితం వరకు ధర్మసాగర్ తహసీల్దార్ గా వ్యవహరించారు. ఎన్నికల నేపథ్యంలో ఆమె జమ్మికుంటకు బదిలీ అయ్యారు. ఆమె మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావటం.. అక్రమాస్తులు భారీగా వెనకేసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఇంటి మీదా.. ఆమె సన్నిహితుల ఇళ్ల మీదా దాడులు చేశారు.

ఈ మొత్తం తనిఖీల్లో రెండు అంతస్తుల భవనం.. 21 ఇళ్ల స్థలాలు.. ఏడు ఎకరాల వ్యవసాయ భూమి.. రెండు కార్లు.. మూడు టూవీలర్లు.. రూ.1.5 లక్షల క్యాష్.. బ్యాంకులో మరో రూ.25 లక్షల క్యాష్ తో పాటు కేజీన్నర బంగారాన్ని గుర్తించారు.

డాక్యుమెంట్ విలువ కంటే మార్కెట్ విలువ అత్యధికంగా ఉన్నట్లుగా తేల్చిన అధికారులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. జమ్మికుంటకు వచ్చీ రాగానే ఆమెకు అందిన పలు ఫిర్యాదుల ఫైళ్ల దుమ్ము దులిపారని.. కలెక్టర్ కు ఆమె ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇద్దరు ఆర్ ఐలు బదిలీ కావటం.. గతంలో ఆమె మీద వైరం ఉన్న వారి ఫిర్యాదులతోనే తనిఖీలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఒక మహిళా రెవెన్యూ అదికారి ఇంత భారీగా అక్రమార్జన కలిగి ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News