3,500 లీటర్ల పెట్రోల్ స్టాక్.. అది ‘డేంజర్ గేమ్ జోన్’.. 33 ప్రాణాలు బలి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని టీఆర్పీ గేమ్ జోన్ లో శనివారం రాత్రి జరిగిన ప్రమాదం అత్యంత భయంకరంగా ఉంది.

Update: 2024-05-26 12:17 GMT

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని టీఆర్పీ గేమ్ జోన్ లో శనివారం రాత్రి జరిగిన ప్రమాదం అత్యంత భయంకరంగా ఉంది. దీంట్లో చనిపోయినవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తొలుత 16 తర్వాత 27 అనుకున్నా.. ఆదివారం మధ్యాహ్నానికి మరణాలు 33కి చేరాయి. అయితే, దుర్ఘటన సమయంలో గేమ్ జోన్లో దాదాపు 70 మంది పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. 20 మందిని మాత్రమే రక్షించిన నేపథ్యంలో మరణాలు ఇంకా పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ప్రమాదంలో గేమ్ జోన్ నిర్వహకుల వైఫల్యం కనిపిస్తోంది. కాగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు అందజేస్తామని ప్రకటించింది. విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు టీమ్ ను నియమించింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

అంతా కలప.. క్షణాల్లో ప్రాణాలు బుగ్గి

రాజ్ కోట్ లో ప్రమాదం జరిగిన గేమ్ జోన్ ను పూర్తిగా కలపతో నిర్మించారు. అందుకే 30 సెకన్లలోనే మంటలు అంటుకున్నాయి. తప్పించుకునే మార్గమే లేకపోయింది. ఓ సమచారం ప్రకారం.. జనరేటర్లను నడిపేందుకు 1,500 లీటర్ల పెట్రోల్ ను గేమ్ జోన్ లో స్టోర్ చేశారు. మరో 2 వేల లీటర్ల పెట్రోల్ ను కార్ల కోసం ఉంచారని తెలుస్తోంది. అందుకే అగ్ని ప్రమాదం అంత తీవ్రంగా ఉందనే కథనాలు వస్తున్నాయి. ఘటన జరిగిన గేమ్ జోన్ ప్రాంతాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష సంఘ్వి పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు.

నిర్వాహకులు అరెస్టు..

టీఆర్పీ గేమ్ జోన్ యాజమాని యువరాజ్ సింగ్ సోలంకి, మేనేజర్ నితిన్ జైన్ ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News