బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా రామ్ మాధవ్ ?
బీజేపీకి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించే అదృష్టం కొందరు నేతలకే దక్కింది.
బీజేపీకి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించే అదృష్టం కొందరు నేతలకే దక్కింది. బంగారు లక్ష్మణ్ తెలంగాణా నుంచి బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన కొద్ది కాలమే ఆ పదవిలో ఉన్నారు. ఆయన తరువాత ఏపీకి చెందిన ఎం వెంకయ్యనాయుడుకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.
వెంకయ్యనాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ప్రెసిడెంట్ గా ఆయన కీలకంగా వ్యవహరించారు. ఇపుడు చాన్నాళ్ల తరువాత మళ్లీ ఒక తెలుగు వాడికి అందునా ఆంధ్రుడికి ఈ కీలక పదవి దక్కే చాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.
ఆయన ఎవరో కాదు గోదావరి జిల్లాలకు చెందిన వారు, అమలాపురం నుంచి వచ్చి ఆల్ ఇండియా లెవెల్ లో అగ్ర నేతగా ఉన్న వారణాసి రామ్ మాధవ్. ఆయన ఉన్నత విద్యావంతుడు. అంతే కాదు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మైసూర్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు.
ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో కీలకంగా ఉన్నారు. 1981లో ఆయన ఆరెస్సెస్ లో చేరారు. ఆ తరువాత దశాబ్దాల పాటు ఎంతో సేవ చేశారు 2014లో బీజేపీలో చేరి జమ్మూ కాశ్మీర్ లో ఆ పార్టీ తరఫున పనిచేశారు. బీజేపీ జమ్మూ కాశ్మీర్ ని ఏలాలన్న కోరికను కొంతలో కొంత నెరవేర్చిన వారు రామ్ మాధవ్.
ఆయన అప్పట్లో చేసిన కృషి ఫలితంగా బీజేపీకి జమ్మూలో 25 సీట్లు దక్కాయి. పీడీఎఫ్ తో పొత్తు పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి దక్కేలా చూసిన ఘనత ఆయనదే. ఇక ఈ ఏడాది జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 29 సీట్లు దక్కడంతో పాటు ఓట్ల శాతం పెరగడానికి కూడా రామ్ మాధవ్ వ్యూహాలే కారణం అని అంటారు.
ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తుని మళ్లీ కలిపి కేంద్రంలో మూడవసారి మోడీ ప్రధాని కావడానికి తన పరోక్ష సాయం అందించారు అన్నది కూడా చెబుతారు. బీజేపీ ఈసారి జాతీయ నాయకత్వాన్ని దక్షిణాదికి చెందిన వారికి ఇవ్వాలని చూస్తోంది అని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సౌత్ నుంచే రాబట్టాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. అందుకే మంచి పలుకుబడి ఉన్న నేతకు అవకాశం ఇస్తే పార్టీ పటిష్టం అవుతుందన్నది బీజేపీ పెద్దల వ్యూహంగా ఉంది. ఇక రామ్ మాధవ్ తో పాటు కేంద్ర మంత్రి తెలంగాణాకు చెందిన జి కిషన్ రెడ్డి పేరు కూడా పార్టీలో వినిపిస్తోంది. ఆయనకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఇవ్వాలని కూడా ఒక వర్గం కోరుతోంది.
అయితే కేంద్ర మంత్రిగానే ఉండేందుకు కిషన్ రెడ్డి ప్రయారిటీ ఇస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు ఆరెస్సెస్ మాత్రం రామ్ మాధవ్ పేరునే ప్రతిపాదించింది అని అంటున్నారు అన్నీ అనుకూలిస్తే కొత్త ఏడాదిలో రామ్ మాధవ్ బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ అవుతారు అని అంటున్నారు.