కేంద్రమంత్రిగా మనోడు ఒకడుంటే.. ఇలానే ఉంటుంది మరి!

అందుకే అంటారు అధికారంలో మనోడు ఒకడు ఉంటే ఆ లెక్కనే వేరుగా ఉంటుందని.

Update: 2024-09-15 06:19 GMT

అందుకే అంటారు అధికారంలో మనోడు ఒకడు ఉంటే ఆ లెక్కనే వేరుగా ఉంటుందని. మోడీ సర్కారు 3.0లో కేంద్ర పౌర విమానయాన మంత్రిగా వ్యవహరిస్తున్న రామ్మోహన్ నాయుడు కారణంగా ఏపీకి అందునా విజయవాడకు విమానసర్వీసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న వైనం చూసినప్పుడు.. కీలక పదవుల్లో మనోళ్లు ఉంటే కలిగే ప్రయోజనం ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తాజాగా బెజవాడ ఎయిర్ పోర్టు నుంచి జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ అప్రోచ్ రోడ్డును ప్రారంభించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.

అంతేకాదు.. విజయవాడ నుంచి ఢిల్లీకి సరికొత్త సర్వీసును షురూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడు ఏపీకి సంబంధించి తన శాఖలో తర్వాతి లక్ష్యాలు ఏలా ఉంటాయన్న విషయాన్ని చెప్పేశారు. అమరావతికి దేశంలోని ఏ నగరం నుంచైనా తేలికగా వచ్చి వెళ్లేలా విమాన అనుసంధానం ఏర్పాటు మీద ఫోకస్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు తనకు చెప్పారన్నారు. వారి మాటలకు తగ్గట్లే కొత్త విమాన సర్వీసుల్ని ప్రారంభించినట్లు చెప్పారు.

కూటమి సర్కారు ఏపీలో కొలువు తీరిన మూడు నెలల వ్యవధిలోనే విజయవాడ నుంచి కొత్తగా నాలుగు సర్వీసులు షురూ చేసిన విషయాన్ని వెల్లడించారు. ఎన్నికలకు ముందు విజయవాడ ఎయిర్ పోర్టునుంచి నెలకు సగటున 85 వేలమంది ప్రయాణిస్తే.. తాజాగా నెలకు లక్షకు పైనే ప్రయాణికులు రాకపోకలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్.. సింగపూర్ కు నేరుగా విమాన సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

అంతేకాదు.. విజయవాడ విమానాశ్రయంలోని ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను మరో ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పిన రామ్మోహన్ నాయుడు మాటలు విన్నప్పుడు.. రాజధాని అమరావతికి ఎయిర్ కనెక్టివిటీకి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవన్న భావన కలుగక మానదు. విజయవాడ నుంచి పెద్ద ఎత్తున సర్వీసులు మొదలైతే.. ఏపీ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పాలి.

Tags:    

Similar News