90:10 రేషియో అసెంబ్లీ తెలంగాణా అండ్ ఏపీ !
ఏపీ అసెంబ్లీ కేవలం అయిదు రోజులు మాత్రమే పనిచేసింది. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టకుండా ముగించేసింది. శ్వేతపత్రాలతో ఏపీ అసెంబ్లీ సాగితే బడ్జెట్ తో పాటు దానికి సంబంధించిన కీలకమైన చర్చలతో తెలంగాణా అసెంబ్లీ సుదీర్ఘంగా సాగుతోంది.
ఈ రేషియోలు ఏంటి లెక్కలేంటి అని అనుకుంటున్నారా. ఇది పొలిటికల్ మేథమెటిక్స్. ఈ లెక్కలు కూడా బాగా అవసరం. ఈ లెక్కలు చూసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ఇంతకీ ఈ రేషియో ఏంటి అంటే వ్యూయర్ షిప్. ఏపీ తెలంగాణా రెండు అసెంబ్లీ సమావేశాలు సమాంతరంగా జూలై నాలుగో వారంలో మొదలయ్యాయి.
ఏపీ అసెంబ్లీ కేవలం అయిదు రోజులు మాత్రమే పనిచేసింది. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టకుండా ముగించేసింది. శ్వేతపత్రాలతో ఏపీ అసెంబ్లీ సాగితే బడ్జెట్ తో పాటు దానికి సంబంధించిన కీలకమైన చర్చలతో తెలంగాణా అసెంబ్లీ సుదీర్ఘంగా సాగుతోంది.
తెలంగాణా తాజా బడ్జెట్ సెషన్ అయితే ఒక అరుదైన రికార్డుని నమోదు చేసింది. ముందు రోజు ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారు జాము వరకూ ఏకంగా 18 గంటలకు పైగా ఏక బిగిన సాగడం గ్రేట్ అని అంటున్నారు. ఈ రోజులలో ఇంత ఎక్కువగా అసెంబ్లీ చర్చలు జరిగిన సందర్భాన్ని సైతం ఎవరూ చూడలేదు అని అంటున్నారు.
ఇక ఏపీ అసెంబ్లీ మొత్తం అయిదు రోజుల పని దినాలు 27 గంటలుగా ఉంటే తెలంగాణా అసెంబ్లీ పని గంటలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అంటున్నారు. అదే సమయంలో ఏపీ అసెంబ్లీలో మొత్తం 164 మంది కూటమి సభ్యులతో ఏకపక్షంగా సాగింది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ ప్రతిపక్షంగా గైర్ హాజరు అయింది.
దాంతో అంతా వన్ సైడ్ గానే సభ సాగిపోయింది. దీంతో చప్పగానే ఉందని అంతా విశ్లేషించే పరిస్థితి ఉంది. ఒంటి చేత్తో కొడితే చప్పట్లు రావు. సభలో విపక్షం కూడా ఉంటేనే చర్చలు అర్ధవంతంగా సాగుతాయని అంటున్నారు. అయితే ఏపీలో విపక్ష హోదా లేదని వైసీపీ సభకు దూరంగా ఉంటే వైసీపీ అధినేత జగన్ జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు ఎద్దేవా చేస్తూ విపక్షాన్ని మరింతగా వీక్ చేస్తున్నారు.
ఒక విధంగా చెప్పాలీ అంటే ఏపీ అసెంబ్లీ సెషన్ ని కూటమి ప్రభుత్వం బుల్డోజ్ చేసుకుంటూ పోయిందని ఒక విమర్శ ఉంది. అదే తెలంగాణా అసెంబ్లీలో చూస్తే ఆ పరిస్థితి లేదు అని అంటున్నారు. విపక్షమైన బీఆర్ఎస్ కే కాదు ఒక్క సభ్యుడు ఉన్న సీపీఐకి కూడా అవకాశాలు ఇస్తూ అర్ధవంతమైన చర్చలు జరిగేల చూసింది అని అంటున్నారు.
ఏపీలో చంద్రబాబుతో పోలిస్తే ముఖ్యమంత్రిగా అనుభవం తక్కువగా ఉన్నా రేవంత్ రెడ్డి మాత్రం తనదైన రాజనీతిని ప్రదర్శిస్తున్నారు అని అంటున్నారు. విపక్షం ఉంటేనే సభలో చర్చలు బాగా జరుగుతాయని ఆయన భావించడమే కాదు ఆచరణలో చూపారు. అంతే కాదు విపక్షం లేవనెత్తే ప్రతీ అంశానికి అధికార కాంగ్రెస్ తమదైన శైలిలో జవాబులు ఇస్తూ విమర్శలు అయితే తిప్పికొడుతూ సభ పట్ల జనాల్లోనూ ఆసక్తిని పెంచింది. దాంతో తెలంగాణా అసెంబ్లీని చూసేందుకే తెలుగు ప్రజలు ఎక్కువ ఆసక్తిని చూపించారు అని రేటింగ్ చూస్తే అర్ధమవుతోంది.
ఎపుడైనా అసెంబ్లీ సెషన్ చూడాలి అంటే అధికార పక్షం ఏమి మాట్లాడుతుంది, విపక్షం ఏ విధంగా వ్యవహరిస్తోంది అన్నదే ఆసక్తిని పెంచే అంశం. అలాంటిది ఏపీ అసెంబ్లీ సమావేశాలు చప్పగా సాగాయి అంటే విపక్షం లేనందువల్లనే అని అంటున్నారు. తెలంగాణాలో సైతం గట్టి విపక్షంగా బీఆర్ఎస్ ఉంది. అయినా వారు లేవనెత్తిన అనేక సందేహాలకు సమాధానలు ధీటుగా చెబుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీని సజావుగా నడిపించింది అన్నది ఈ రెండు అసెంబ్లీలను చూసిన వ్యూయర్స్ భావనగా ఉంది.
దాంతో 90:10 రేషియోలో వ్యూయర్ షిప్ రెండు అసెంబ్లీల మధ్య తేడా కనిపిస్తోంది అని అంటున్నారు. మరి ఏపీ అసెంబ్లీ తీరు ఇలాగే ఉంటుందా రానున్న సమావేశాలలో అయినా విపక్షాన్ని పిలిపించి అర్ధవంతమైన చర్చ జరిగేలా ఏపీలో కూటమి ప్రభుత్వం చూస్తుందా అన్నదే చూడాలని అంటున్నారు. సభ అంటే అధికార పక్షం ప్రతిపక్షం ఉంటేనే నిండుతనం ఉంటుంది. అలా కాకుండా ఒకే పక్షం ఉంటే మాత్రం ఆ సభను చూసేవారికీ నీరసం వస్తుంది. పైగా ప్రజా సమస్యల ప్రస్తావన కూడా తగ్గిపోతుంది. సో ఏపీ అసెంబ్లీ సమావేశాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో చూడాల్సిందే.