వైసీపీకి బిగ్‌ షాక్‌.. కీలక నేత రాజీనామా!

దళితుల అభ్యున్నతి, సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని రావెల ప్రకటించారు. దీంతో ఆయన టీడీపీలో చేరతారని టాక్‌ నడుస్తోంది.

Update: 2024-06-07 08:50 GMT

ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయిన వైసీపీకి కష్టాలు మొదలయ్యాయి. ఆ పార్టీలో కీలక దళిత నేతగా ఉన్న మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు సీపీకి రాజీనామా చేశారు. దళితుల అభ్యున్నతి, సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని రావెల ప్రకటించారు. దీంతో ఆయన టీడీపీలో చేరతారని టాక్‌ నడుస్తోంది.

ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన రావెల కిశోర్‌ బాబు 2014లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరితను ఓడించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చంద్రబాబు మంత్రివర్గంలో రావెల కిశోర్‌ బాబు పనిచేశారు. అయితే ఆయన కుమారుడి వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదం కావడం, ఇందుకు సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో చంద్రబాబు ఆయనను పదవి నుంచి తప్పించారు.

ఇక 2019 ఎన్నికల నాటికి రావెల కిశోర్‌ బాబు జనసేన పార్టీలో చేరారు. మళ్లీ ప్రత్తిపాడు నుంచే జనసేన పార్టీ అభ్యర్థిగా మేకతోటి సుచరితపై పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన కొద్ది కాలానికే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే అక్కడ కూడా కుదురుగా ఉండలేకపోయారు.

ఆ తర్వాత విశ్రాంత ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ తో కలిసి కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరారు. చివరి శ్వాస వరకు కేసీఆర్‌ తోనే ఉంటానని తెలిపారు. బీఆర్‌ఎస్‌ లో కొనసాగుతానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఆయనను బీఆర్‌ఎస్‌ జాతీయ వ్యవహారాల ఇంచార్జిగా నియమించారు.

అలాంటి రావెల కిశోర్‌ బాబు కూడా గతంలో గుంటూరులో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నేతలెవరూ హాజరు కాలేదు. తోట చంద్రశేఖరే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ నేతలు రాకపోయినా కనీసం స్థానిక నేతే అయినా మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు రాకపోవడంపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది.

ఇటీవల ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అయితే ఆయనకు జగన్‌ ఎక్కడా సీటు కేటాయించలేదు. టీడీపీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందంటూ వైసీపీ నేతలతో కలిసి ఎన్నికల కమిషన్‌ అధికారులను కలిసి రావెల పలు ఫిర్యాదులు అందజేశారు. వైసీపీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో రావెల రాజీనామా ప్రకటించారు. ఆయన మళ్లీ టీడీపీలో చేరతారని చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News