14 రోజుల్లో 4,271 ఇళ్లు అమ్మకానికి... యూఎస్ లో 'ఎలుకలు పారిపోతున్నాయా'?
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు పలు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ ప్రపంచం మొత్తాన్ని కదిపేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్న వేళ.. తమ పరిస్థితి కూడా అలానే ఉందనే వ్యాఖ్యలు అమెరికా దేశంలోనూ వినిపిస్తున్న పరిస్థితి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక విషయం తెరపైకి వచ్చింది. అమెరికాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనం అయ్యిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అవును... అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు పలు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ నేపథ్యంలో.. వాషింగ్టన్ డీసీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనం జరగనున్నట్లు భావించి.. వేల ఇళ్లను అమ్మకానికి ఉంచారు. దీనికి సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. తాజాగా వాషింగ్టన్ డీసీలో గత 14 రోజుల్లోనే 4,271 కంటే ఎక్కువ ఇళ్లు అమ్మకానికి ఉంచినట్లు సోషల్ మీడియాలో ఒక యూజర్ పేర్కొంటూ... "ఎలుకలు పారిపోతున్నాయి" అని రాసుకొచ్చాడు. నగరవాసులు తమ తమ వస్తువులను సర్ధుకుని సామూహికంగా నగరం విడిచి వెళ్తున్నారని పోస్ట్ చేశాడు.
అయితే... ఈ స్థాయిలో వలసలకు కారణం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ అని చెబుతున్నారు. నగరంతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతల్లో అమ్మకానికి ఉన్న ఇళ్లను చూపించే ఫోటోలు షేర్ చేస్తున్నారు. వీటి సంఖ్య సుమారు 14,825 గా ఉండగా.. అందులో 500 కంటే ఎక్కువ ఇల్లు రూ.8 కోట్లు కంటే ఎక్కువ ధరకు అమ్మకానికి ఉన్నాయని చెబుతున్నారు.
ఇదే సమయంలో.. వాషింగ్టన్ లోని ‘జిల్లో’ అనే ప్రాంతంలోనూ అమ్మకానికి ఉన్న ఇళ్ల జాబితాలను మరో యూజర్ షేర్ చేశాడు. ఇందులో భాగంగా... 7 రోజుల్లో 201 ఇళ్లు.. 14 రోజుల్లో 378 ఇళ్లు, 30 రోజుల్లో 706, గడిచిన 90 రోజుల్లో సుమారు 1198 కొత్త ఇళ్లు అమ్మకానికి ఉన్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన మ్యాప్ ను షేర్ చేశాడు.