43 మంది రెడ్లు.. కొత్త సభలో సామాజిక సమీకరణ లెక్కలివే

ఆసక్తిగా ఎదురుచూసిన టీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. విజయం ఎవరిది? పరాజయం మరెవరిదీ అన్న క్లారిటీ వచ్చేసింది.

Update: 2023-12-04 07:55 GMT

ఆసక్తిగా ఎదురుచూసిన టీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. విజయం ఎవరిది? పరాజయం మరెవరిదీ అన్న క్లారిటీ వచ్చేసింది. కొత్త సీఎం ఎవరన్న దానిపై ఓపక్క చర్చ జరుగుతుంటే.. మరోపక్క రేవంత్ రెడ్డినే సీఎం అన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొత్తగా కొలువు తీరనున్న అసెంబ్లీలో సామాజిక సమీకరణాల లెక్కలేంటి? గడిచిన రెండు అసెంబ్లీలతో పోలిస్తే.. ఈసారి సభలో ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారన్నది ఆసక్తికర అంశంగా చెప్పాలి.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈసారి ఎన్నికల్లో మొత్తం 43 మంది రెడ్లు విజయం సాధించారు. గడిచిన రెండు అసెంబ్లీలతో పోలిస్తే.. ఈసారి వీరి సంఖ్య అత్యధికంగా ఉండటం విశేషం. 2018లో 40 మంది రెడ్లు గెలుపొందగా.. 2014లో 42 మంది ఉన్నారు. అంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వేళ జరిగిన ఎన్నికల్లో రెడ్ల ప్రాతినిధ్యం పెరిగితే.. ఆ తర్వాతి సభలో తగ్గింది. తాజాగా మళ్లీ.. పెరగటమే కాదు ఈసారి మిగిలిన వారి కంటే అత్యధికంగా ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు.

తర్వాతి స్థానంలో బీసీలు.. ఎస్సీలు ఉన్నారు. కొత్త సభలో ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించి పందొమ్మిది మంది చొప్పున ఉన్నారు. 2018తో పోలిస్తే ఈసారి బీసీల ప్రాతినిధ్యం తగ్గినట్లుగా చెప్పాలి. 2014లో 20 మంది బీసీ ఎమ్మెల్యేలు గెలిస్తే.. 2018లో 22 మంది గెలిచారు. ఈసారి మళ్లీ వారి సంఖ్య తగ్గింది. బీసీల్లో అత్యధికంగా నలుగురు గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు గెలవగా.. తర్వాతి స్థానంలో మున్నురు కాపులు ముగ్గురు విజయం సాధించారు. మరో ఇద్దరు పద్మశాలీలు కాగా.. రజక, గంగపుత్ర, ముదిరాజ్, లోధా,, ఆర్య మరాఠి, యాదవ, కమ్మ, పెరిక, వంజర వర్గాలకు చెందిన వారు గెలుపొందారు. ఎస్సీలకు కేటాయించిన స్థానాల్లో వారు విజయం సాధించారు. ఇక ఎస్టీలకు కేటాయించిన 12 స్థానాల్లో వారు విజయం సాధించారు. ఎస్సీ.. ఎస్టీ అభ్యర్థుల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే.

ఎస్సీ రిజర్వు కేటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగి విజయం సాధించిన వారి విషయానికి వస్తే..

- గడ్డం వినోద్

- గడ్డం వివేకానంద

- ఎ. లక్ష్మణ్ కుమార్

- మేడిపల్లి సత్యం

- డాక్టర్ కె. సత్యనారాయణ

- గడ్డం ప్రసాద్ కుమార్

- డాక్టర్ సీహెచ్ వంశీ క్రిష్ణ

- మండల సామేల్

- వేముల వీరేశం

- కేఆర్ నాగరాజు

- మల్లు భట్టి విక్రమార్క

- మట్టా రంగమయి

- లక్ష్మీకాంత్ రావు తోట

- సి. దామోదర రాజనర్సింహా

వీరంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన వారి విషయానికి వస్తే.. కాలే యాదయ్య.. విజయుడు.. కడియం శ్రీహరి.. లాస్య నందితలుగా చెప్పాలి. ఎస్టీ నియోజకవర్గాల నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థుల్లో వేద్మ బొజ్జు.. బాలు నాయక్ నేనావత్.. జె. చందర్ నాయక్.. డాక్టర్ మురళీ నాయక్ భూక్యా.. సీతక్క.. పాయం వెంకటేశ్వర్లు .. కోరం కనకయ్య.. రామసా మల్లోతు.. జి. ఆదినారాయణలు ఉన్నారు. గులాబీ పార్టీ (బీఆర్ఎస్) నుంచి పోటీ చేసి విజయం సాధించిన వారిలో కోవా లక్ష్మీ.. తెల్లం వెంకటరావు.. అనిల్ జాదేవ్ లు ఉన్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు సైతం ఈసారి ఎన్నికల్లో అధికంగా గెలుపొందారు. 2014, 2018తో పోల్చి చూసినా.. ఈసారి వారి ప్రాతినిధ్యం 13 కానుంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు నలుగురు ఉండగా.. బ్రాహ్మిణ్.. వైశ్య సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎప్పటిలానే పాతబస్తీలో ఏడుగురు ముస్లిం మైనార్టీఅభ్యర్థులు విజయం సాధించగా.. కాంగ్రెస్ నుంచి నలుగురు పోటీ చేసినా ఒక్కరు గెలవలేదు. కానీ.. ఓడిన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో ఇద్దరు విజయం సాధించటం గమనార్హం.

Tags:    

Similar News