లెక్క తేలింది.. తెలంగాణ అప్పు రూ.6.85 లక్షల కోట్లు..?
‘ధనిక రాష్ట్రం..’ తెలంగాణ ఏర్పాటు సమయంలో అప్పటి టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారిన పార్టీ అధినేత, అప్పటి సీఎం, ఇప్పటి ప్రతిపక్ష నేత కేసీఆర్ గొప్పగా చెప్పిన మాట.
‘ధనిక రాష్ట్రం..’ తెలంగాణ ఏర్పాటు సమయంలో అప్పటి టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారిన పార్టీ అధినేత, అప్పటి సీఎం, ఇప్పటి ప్రతిపక్ష నేత కేసీఆర్ గొప్పగా చెప్పిన మాట. ఆదాయంలో లోటు లేనందున సంక్షేమానికీ అంతే స్థాయలో ఖర్చు పెడతామని చెప్పేవారాయన. కానీ, రానురాను పరిస్థితులు తిరగబడ్డాయి. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారింది.
పదేళ్లలో ప్లస్ నుంచి మైనస్ కా?
కేసీఆర్ పాలనపై ఉన్న ప్రధాన ఆరోపణ.. తెలంగాణను ధనిక రాష్ట్రం అని చెబుతూ అప్పుల రాష్ట్రంగా మార్చారని. ఆయన పదేళ్ల పాలనలో మిగులు రాష్ట్రం రుణ రాష్ట్రంగా మారిందని ప్రతిపక్షాలు ఆరోపించేవి. ఇక కాళేశ్వరం పేరిట కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టింది. దీని గురించి ఎంతో గొప్పగానూ ప్రచారం చేసుకుంది. అయితే, గత ఏడాది అక్టోబరులో సరిగ్గా ఎన్నికల ముందు కాళేశ్వరంలో ప్రధానమైన మేడిగడ్డ కుంగడం కేసీఆర్ ప్రభుత్వాన్నే కుంగదీసింది.
ఆర్థిక సంఘం ముందుకు లెక్క
16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగఢియా సారథ్యంలో ప్రస్తుత తెలంగాణలో పర్యటిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్యాలయం అయిన ప్రజాభవన్‌లో సోమవారం వివిధ పార్టీల నాయకులను కలిసింది. ఈ సందర్భంగా వారు కేంద్రా పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటాను 50 శాతానికి పెంచాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాలు వివిధ మార్గదర్శకాలను ఫాలో అవుతూ ప్రగతి శీలంగా ఉన్నందున వాటికి ప్రోత్సాహకాలు పెంచాలని విన్నవించారు. ఇక మంగళవారం అరవింద్ పనగఢియాతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కీలక మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాన్ని కేంద్ర ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణకు రూ.6.85 లక్షల కోట్లు అప్పుగ ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి అదనపు సహాయాన్ని అర్థించారు. తెలంగాణను ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ప్రకటించారు. కాగా, కేంద్ర ఆర్థిక సంఘం వద్దనే సీఎం రేవంత్ ప్రస్తావించారంటే.. తెలంగాణ అప్పు ఎంతనో తేలిపోయింది.
తెలుగు రాష్ట్రాల అప్పులెన్నో..?
తెలుగు రాష్ట్రాల్లో గత పదేళ్లలో చర్చనీయాంశం రుణాలే. ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా ఇవి ప్రధానంగా వార్తల్లో నిలిచాయి. 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా రుణాలు తెచ్చిందనే ఆరోపణలున్నాయి. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం ప్రజా ధనాన్ని లెక్కలేకుండా ఖర్చుపెట్టిందని వైసీపీ విమర్శించేది. ఇటు తెలంగాణ కేసీఆర్ సర్కారు దుబారాక పాల్పడి అప్పుల రాష్ట్రంగా మార్చిందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణకు రూ.6.85 లక్షల కోట్ల అప్పు ఉందని రేవంత్ కేంద్ర ఆర్థిక సంఘం వద్ద ప్రస్తావించడం చూస్తుంటే మొత్తం లెక్క తేలినట్లే.