ఎన్టీఆర్. వైఎస్..చంద్రబాబు..కేసీఆర్ లా రేవంత్ బ్రాండ్.. హైడ్రా
తెలుగు జాతి చరిత్రను ఎన్టీఆర్ కు ముందు.. ఎన్టీఆర్ కు తర్వాత అని చెబుతారు.
తెలుగు జాతి చరిత్రను ఎన్టీఆర్ కు ముందు.. ఎన్టీఆర్ కు తర్వాత అని చెబుతారు. అప్పటివరకు మదరాసీలుగా ముద్రపడిని తెలుగువారికి ‘తెలుగు వారు’ అనే గుర్తింపు తెచ్చింది నందమూరి తారకరామారావు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో నిలిపారు ఆయన. తెలుగువాడి సత్తాను దేశమంతా చాటారు అన్న ఎన్టీఆర్. ఇక తెలుగు రాజకీయాల్లోనూ తెలుగుదేశంతో చాలా మార్పు వచ్చింది. అప్పటివరకు కాంగ్రెస్ చేతుల్లో నలిగిన రాష్ట్రానికి కొత్త దారి చూపించారు. ఇక హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఉమ్మడి ఏపీ రాజధాని అయినప్పటికీ.. ఉర్దూ ప్రాబల్యంగా, ఇతర జిల్లాల వారికి పెద్దగా అనుకూలంగా లేని హైదరాబాద్ ను అందరి నగరం చేశారు. నడిబొడ్డున ఉండే అబిడ్స్ లో నివాసం ఉంటూ.. శివారులోని గండిపేటలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ హయాంలోనే కోస్తా జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఉపాధి కోసం తరలిరావడం మొదలైంది. అలా వచ్చినవారు వ్యాపార రంగాల్లో రాణించి.. ఉన్నతస్థాయికి ఎదిగారు.
బాబు వచ్చారు.. రాత మార్చారు
ఎన్టీఆర్ తర్వాత ఉమ్మడి ఏపీ సీఎం అయినా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపారు. ఎన్ని విమర్శలు ఉన్నా.. భారీ భవంతులతో సైబరాబాద్ అనే అందమైన నగరం ఇప్పుడు మనకు కనిపిస్తోందంటే దానిని పునాది చంద్రబాబు వేసిందే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బయో టెక్నాలజీ (బీటీ)కి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఐటీ సంస్థలతో పాటు ఫార్మాకూ హైదరాబాద్ రాజధాని అయింది. క్షణం తీరికలేని రోజుల్లో.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను 25 ఏళ్ల కిందటే హైదరాబాద్ కు తీసుకొచ్చి.. ఈ నగరం పేరు ప్రపంచమంతా వినిపించేలా చేశారు. శంషాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు వేలకోట్లలో జరుగుతున్నాయంటే అంది చంద్రబాబు చేసిన ప్రయత్నమే.
వైఎస్ ఆర్.. చెరగని ముద్ర
ఉత్తమ పాలకుడికి ఉండే.. ఉత్తమ లక్షణం .. గత ప్రభుత్వాలు చేసిన మంచిని కొనసాగించడం. 2004 ఉమ్మడి ఏపీకి సీఎం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అక్షరాలా చేసింది ఇదే. హైదరాబాద్ కు ఏర్పడిన బ్రాండ్ ను ఆయన ఏమాత్రం చెడగొట్టలేదు. సరికదా..? మరింత ఎత్తులకు తీసుకెళ్లారు. భవిష్యత్ అవసరాలను గుర్తెరిగి.. శంషాబాద్ విమానాశ్రయాన్ని చకచకా పూర్తి చేయించారు. ఔటర్ రింగ్ రోడ్ అనే అతిపెద్ద ప్రాజెక్టును చేపట్టారు. ఇప్పుడది ఎంత అవసరమో తెలిసి వస్తోంది. మరోవైపు ఐటీ ఎగుమతులు అంతకంతకూ పెరిగేలా చూశారు. కొత్తకొత్త సంస్థలను ఆహ్వానించారు. ఉప్పల్ లో అంతర్జాతీయ క్రికెట్ మైదానం నిర్మాణమైంది వైఎస్ హయాంలోనే కావడం గమనార్హం.
మరింత ముందుకు తీసుకెళ్లిన కేసీఆర్
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక హైదరాబాద్ ను ఆణిముత్యంలా చూసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అత్యధిక ఆదాయం సమకూర్చే రాజధాని నగరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కుమారుడు, ఐటీ మాజీ ప్రొఫెషనల్ అయిన కేటీఆర్ కు మున్సిపల్, ఐటీ శాఖ అప్పగించి హైదరాబాద్ పై ఫోకస్ పెట్టారు. చురుకైన కేటీఆర్ నాయకత్వంలో.. అమెరికా ఆవల ప్రపంచంలోనే భారీ క్యాంపస్ లకు హైదరాబాద్ కేంద్రమైంది. తరచూ విదేశీ పర్యటనలతోనూ కేటీఆర్ భాగ్యనగరం బ్రాండ్ ను విస్తరింపజేశారు.
నాలుగో నగరితో రేవంత్ గురి
రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్).. నాలుగో నగరం (ముచ్చర్ల బేగరి కంచె).. మురికి నదిగా మారిన మూసీ ప్రక్షాళన.. అంటూ హైదరాబాద్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాక.. ఒకప్పుడు లేక్ సిటీగా పేరున్న హైదరాబాద్ ఇప్పుడు లేక్ లెస్ సిటీ అవుతున్న ప్రమాదాన్ని గుర్తించారు. దీంతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ను తీసుకొచ్చారు. రంగనాథ్ వంటి సిన్సియర్ ఐపీఎస్ సారథ్యంలో ఇప్పుడు హైడ్రా కలకలం రేపుతోంది. చెరువులను ఆక్రమించి విలాసవంతమైన భవనాలను కట్టుకున్న బడా బాబుల పనిపడుతోంది. ఇదంతా విజయవంతంగా సాగితే.. రేవంత్ కు ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్ తరహాలో బ్రాండ్ ఇమేజ్ తెచ్చే కార్యక్రమమే. వాస్తవానికి హైడ్రా మూడు నెలల కిందట ఏర్పాటైన సమయంలో ఎవరూ ఈ స్థాయిలో పనిచేస్తుందని భావించలేదు. అప్పటికి లోక్ సభ ఎన్నికల హడావుడి కూడా ఉండడం ఓ కారణం. ఇప్పుడు మాత్రం హైడా అంటేనే హడలెత్తిపోతున్నారు.
హైదరాబాద్ నగరంలో చెరువు భూముల్లో అక్రమంగా నిర్మించుకున్న కట్టడాల్లో దాదాపు 95 శాతం బడా బాబులవే. వాటిని కూల్చడాన్ని ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. పెద్దలను దెబ్బతీయడం ద్వారా పేద, మధ్య తరగతి వర్గాల ముఖ్యమంత్రిగా రేవంత్ ఇమేజ్ సంపాదిస్తున్నరు. కుటుంబ సభ్యులు, సొంత పార్టీ నేతలు, మంత్రులు అన్న తేడాను ఆయన చూపడం లేదు. నిష్పాక్షికత కలిగిన డైనమిక్ సీఎంగా ఇమేజ్ పొందే లక్ష్యంతో ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇదంతా మున్ముందు చరిత్ర తిరగేస్తే సీఎంలలో తనకంటూ పేజీ ఉండాలని రేవంత్ కోరుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది.