రేవంత్ ఉచ్చులో గులాబీల విలవిల

ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. మిగిలిన రంగాల సంగతి వేరు. రాజకీయం వేరు

Update: 2024-08-01 06:25 GMT

ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. మిగిలిన రంగాల సంగతి వేరు. రాజకీయం వేరు. వేరే రంగాల్లోని ప్రత్యర్థుల్ని తక్కువగా అంచనా వేయటం ద్వారా జరిగే నష్టాన్ని తర్వాతి రోజుల్లో భర్తీ చేసుకోవచ్చు. కానీ.. రాజకీయంలో అలా కాదు. దానికి చెల్లించాల్సిన మూల్యం అధికారాన్ని చేజార్చుకోవటం. తిరిగి రాని కాలాన్ని పోగొట్టుకోవటం ఒక ఎత్తు అయితే.. భవిష్యత్తుకు సైతం దెబ్బ పడేలా చోటు చేసుకుంటున్న వరుస ఉదంతాల్ని చూసిన తర్వాత కూడా గులాబీలకు జ్ఞానోదయం కావట్లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

తమ ముందు చిన్నస్థాయి నుంచి మొదలైన నేత.. ఉద్యమం వేళ తాము కట్టుకున్న గులాబీ కోటను టచ్ చేసేంత సీన్ ఎక్కడదన్న చిన్నపాటి నిర్లక్ష్యానికి గులాబీ బాస్ మూల్యం చెల్లించుకుంటున్నారు. అంతేకాదు.. ఆయన చేసిన తప్పునకు మొత్తం గులాబీ పార్టీ ఇప్పుడు ఇబ్బందులకు గురవుతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావటం పెద్ద విషయం కాదన్నట్లుగా వ్యవహరిస్తూ.. వ్యర్థ సవాళ్లకు దిగుతూ.. తనకు తానే సెల్ఫ్ గోల్ విసురుకుంటోంది.

బుధవారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అక్కలను నమ్ముకొని మునిగిపోవద్దన్న మాటను రాజకీయ ఆందోళనకు తెర తీసేలా గులాబీ పార్టీ ప్లాన్ చేసింది. దీనికి తగ్గట్లే.. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్.. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల దిష్టి బొమ్మల దగ్ధాలకు పిలుపునిచ్చింది. ఉద్యమం వేళలోనూ ఇంతే. ప్రతి చిన్న అంశానికి ఆందోళనలు.. అలజడులకు పిలుపునిచ్చే పాతకాలం వ్యూహానికి తెర తీసింది.

అయితే.. సీఎం రేవంత్ అప్డేటెడ్ వెర్షన్ అన్న విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. అసెంబ్లీలో సీనియర్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి.. సునీలా లక్ష్మారెడ్డిని లక్ష్యం చేసుకున్న ముఖ్యమంత్రి అన్న మాటేమిటి? దానికి అంత హాహాకారాలు చేయాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. ఈ ఇద్దరి పుట్టిల్లు కాంగ్రెస్ పార్టీనే అన్నది మర్చిపోకూడదు. అంతేనా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు చేపట్టి.. పార్టీ ఓడి.. కష్టాల్లో ఉన్నప్పుడు హస్తాన్ని వదిలేసి.. గులాబీ కారును ఎక్కేసిన విషయాలు ప్రజలు మర్చిపోరు కదా?

అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అక్కల్ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే అన్న మాటను ఎలాంటి అన్ పార్లమెంటరీ పదాల్ని ఉపయోగించకుండా.. ఆవేశంలోనూ ఆచితూచి మాట అన్నారే తప్పించి.. వేలెత్తి చూపే అవకాశం ఇవ్వలేదు. మహిళా నేతల్ని అంత మాట అంటావా?అంటూ మాజీ మంత్రి కేటీఆర్ అండ్ కో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలకు గౌరవం ఇచ్చే విషయంలోనూ. .వారికి పదవులు ఇచ్చే విషయంలో కేసీఆర్ తన మొదటి టర్మ్ లో ఒక్కరంటే ఒక్క మహిళకు మంత్రి పదవిని ఇవ్వనప్పుడే తేలిపోయింది. ఎవరెన్ని అన్నా.. తన మంత్రి వర్గంలో మహిళా నేతకు చోటివ్వని వైనం గురించి ఈ రోజుకు సమాధానం చెప్పింది లేదు. అలాంటి పార్టీకి చెందిన కేటీఆర్.. మహిళల్ని అవమానిస్తారా? అంటూ చెలరేగిపోయిన తీరుతో సాధించిందేమీ లేదు.

ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడేలా పింకీలకు ఛాన్సు ఇచ్చారన్న ముఖ్యమంత్రి వ్యూహాన్ని గులాబీ పార్టీ నేతలు సరిగా అర్థం చేసుకోలేదు. తాము అనాల్సిన మాటల్ని అనేశారు. ఆందోళనలకు పిలుపునిచ్చారు. కట్ చేస్తే.. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్.. తన అమ్ములపొదిలోని మరో అస్త్రాన్ని బయటకు తీశారు.

తాను టార్గెట్ చేసిన సబితమ్మ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాను ఏ సందర్భంలో ఆ మాట అన్నదన్న వివరణను ఇవ్వటమే కాదు.. తాను ఉత్తినే అనలేదని.. సబితక్క తనను ఎంతలా మోసం చేసిందన్న విషయాన్ని వివరంగా చెప్పటమే కాదు.. దానికో ఉదాహరణను ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ రేవంత్ ఏమన్నారన్నది చూస్తే.. ‘‘అక్కల మాటలు నమ్మి నేను మోసపోయానని కేటీఆర్ కు చెప్పా. అంతేతప్ప సభలో వారి పేర్లు కూడా ప్రస్తావించలేదు. సభలో నేను మాట్లాడిన దాంట్లో అన్ పార్లమెంటరీ లేదు. ఒక్క మాట కూడా అసభ్యంగా మాట్లాడలేదు. సబితక్కకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చాం. ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడినందువల్లే.. ఆ తర్వాత నేను మిగితాది పూర్తి చేశా’’ అంటూ తన మాటల నేపథ్యాన్ని వివరించారు.

మోసం అనే పదానికి సబితా ఇంద్రారెడ్డి పర్యాయ పదమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో స్పష్టంగా చెప్పారన్న రేవంత్.. ‘‘నన్ను కాంగ్రెస్ లోకి రమ్మని చెప్పిన సబితక్క.. నాకు అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారారు. మల్కాజిగిరి టికెట్ తీసుకో. మీ ఎన్నికల బాధ్యత తీసుకుంటానని చెప్పారు. టికెట్ ఖరారు కాగానే.. బీఆర్ఎస్ లోకి వెళ్లారు. నేనునామినేషన్ వేసేటప్పటికే వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. సునీతక్క తరఫున 2018 ఎన్నికల్లో ప్రచారానికి వెళితే (అప్పట్లో ఆమె కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు) నాపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కేసులు పెట్టింది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన సునీతా లక్ష్మారరెడ్డిని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పోస్టు ఇచ్చారు. ఆమెకు పోస్టు దక్కింది. తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. నాపై ఉన్న కేసులు మాత్రం తీయించలేదు’’ అంటూ తన గుండెల్లో ఉన్న విషయాల్ని చెప్పుకొచ్చారు. రేవంత్ వివరణ విన్న తర్వాత.. అక్కల్ని ఆ మాట అనటంలో అన్యాయం ఏముందన్న భావన కలిగేలా చేశారు సీఎం రేవంత్. ఇదంతా చూసినోళ్లు.. రేవంత్ తీరును అంచనా వేయటంలో గులాబీ నేతలు మరోసారి ఎదురుదెబ్బ తిన్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News