తెలుగు రాష్ట్రాలు కలిసి ప్రపంచంలో పోటీ పడాలి.. రేవంత్ నోట వైరల్ మాట

తాజాగా ఒక కీలక వేదిక మీద నుంచి రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. వైరల్ గా మారాయి.

Update: 2025-01-06 05:47 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పదేళ్ల కేసీఆర్ పాలనతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోటీతో పాటు.. అప్పుడప్పుడు కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొనటం తెలిసిందే. అందుకు భిన్నంగా రేవంత్ పాలనలో పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఒక కీలక వేదిక మీద నుంచి రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. వైరల్ గా మారాయి.

ఇంతకూ రేవంత్ నోటి నుంచి వచ్చిన మాటలేంటి? ఆ మాటకు అంత ప్రాధాన్యత ఎందుకు? రేవంత్ నోటి నుంచి అనకూడని మాటలు అన్నారా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. గతానికి భిన్నంగా రేవంత్ నోటి నుంచి వచ్చిన తాజా మాటలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య మరింత సోదరభావాన్ని పెంచేలా ఉన్నాయని చెప్పొచ్చు. కాకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీ పెట్టి.. చలి మంట కాచుకునే వారికి మాత్రం ఈ వ్యాఖ్చలు రుచించే అవకాశం లేదని చెప్పాలి.

రేవంత్ నోటి నుంచి వచ్చిన మాటల్ని.. ఆయన మాటల్లోనే చదివితే.. ‘‘తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు పోటీ అని చాలామంది అంటుంటారు. కానీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కలిసి ప్రపంచ దేశాలతో పోటీపడేలా అభివృద్ధి చెందాలి. ఏపీ, తెలంగాణ పోటీ పడే కన్నా.. రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి పథం వైపు నడిస్తే కచ్చితంగా ప్రపంచంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రాలుగా రాణిస్తాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలున్నా.. చర్చించుకుని పరిష్కరించుకుందాం. దేశాల మధ్య యుద్ధాలు తలెత్తినప్పుడు కూడా చర్చల ద్వారా పరిష్కారమైన సందర్భాలున్నాయి. రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకోడానికి ఆ విధంగా ఆలోచన చేయలేమా’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ముగింపు ఉత్సవానికి సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలతో ప్రసంగించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే..

- ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి జనాభా 18కోట్ల మంది పైచిలుకు అని ఒక అంచనా. అయినా జాతీయ రాజకీయాలపై తెలుగువాళ్లం ప్రభావం చూపలేకపోతున్నాం.

- గతంలో నీలం సంజీవరెడ్డి, పీవీ నర్సింహారావు, ఎన్టీ రామారావు జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత వెంకటస్వామి, జైపాల్‌రెడ్డి, వెంకయ్యనాయుడు ప్రభావం చూపించారు. రెండు, మూడు తరాలకు మధ్య.. చంద్రబాబు, వైఎస్సార్‌ లు ప్రభావం చూపించినా.. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లింది.

- ఐటీ, ఫార్మా రంగాల్లో తెలుగువారు ఎందరో అత్యున్నత స్థాయిల్లో రాణిస్తున్నారు. దేశంలో 35 శాతం ఔషధాలు హైదరాబాద్‌లోని తెలుగువారి కంపెనీల నుంచి ఉత్పత్తి అవుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా. నాడు ప్రధాని రాజీవ్‌గాంధీ ఈ దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేసి, సాంకేతిక రంగంలో దూసుకెళ్లగలిగేందుకు అవసరమైన పునాదులు నిర్మించారు.

- అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం నారా చంద్రబాబు అందిపుచ్చుకుని సైబరాబాద్‌ను ప్రపంచంతోనే పోటీపడే విధంగా తీర్చిదిద్దారు. తర్వాత వైఎస్‌ దానిని మరింత ముందుకు తీసుకెళ్లారు. హైదరాబాద్‌ నగరాన్ని మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా, సికింద్రాబాద్‌ను ఆంగ్లేయులు, నిజాం నవాబులు, సైబరాబాద్‌ను నారా చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తే.. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని 30 వేల ఎకరాల్లో ఫోర్త్‌ సిటీ పేరుతో ఒక అత్యాధునిక మహానగరాన్ని నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

- అంతర్జాతీయ స్థాయి నగరాలకు దీటుగా దీనిని రూపొందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తెలుగు సినిమా రంగం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. హాలీవుడ్‌తో సైతం పోటీపడుతున్న సందర్భాలు చూస్తున్నాం.

- రాజకీయాలు, ఆర్థిక, సామాజిక, సినీరంగాలలో రాణించడానికి ఏ భాషనైనా నేర్చుకోండి. కానీ, తోటి తెలుగువారితో మన మాతృభాషలోనే మాట్లాడండి. విదేశాల్లోని తెలుగు వారంతా తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఆలోచన చేయాలి.

- తెలంగాణ రైజింగ్‌ నినాదంతో రాబోయే 25 ఏళ్లకు తగిన ఒక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాం. దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న తెలుగువారంతా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి. పెట్టుబడులు పెట్టండి. అందుకు అవసరమైన అనుమతులన్నింటినీ సింగిల్‌ విండోలో ఇచ్చే బాధ్యత నాది.

- ప్రభుత్వ ఆదేశాలను వీలైనంత వరకు తెలుగులో వెలువరించేందుకు ప్రయత్నిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. దీనికి ముందు ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి నార్నే విజయలక్ష్మి మాట్లాడుతూ... ఈ కాలానికి తగినట్టుగా పెద్ద బాలశిక్షను సవరించి, ప్రాథమిక స్థాయి విద్యాబోధనలో భాగం చేయాలని సీఎంను కోరారు. దీనికి ఆయన ప్రతి స్పందిస్తూ.. తప్పకుండా విద్యా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యల్ని చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనవసర పంతాలు.. పట్టింపులకు పోకుండా..రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంచాయితీలను తీర్చుకోవటంతో పాటు.. ఇచ్చి పుచ్చుకునే ధోరణిని అనుసరించాలన్న స్నేహ హస్తాన్ని చాచినట్లుగా చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయితీలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించుకోవటానికి రేవంత్ ఒక అడుగు ముందుకు వేశారని చెప్పాలి. మరి..దీనికి స్పందించాల్సిన బాధ్యత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉందని చెప్పాలి.

Tags:    

Similar News