రేవంత సర్కారులో పేలని పొలిటికల్ టపాసులు
అదీ కాక.. ఇదీ కాక పొలిటికల్ టపాసుల పేల్చటం ఎలానో గులాబీ బాస్ వద్ద రేవంత్ ట్రైనింగ్ తీసుకోవాలన్న భావనకు గురయ్యేలా చేయటం మంచిది కాదు. ఈ విషయాన్ని రేవంత్ గుర్తించారా?
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందునా తెలంగాణ లాంటి ధనిక రాష్ట్రానికి (అప్పుడు ఉండొచ్చు. అది వేరే లెక్క) ముఖ్యమంత్రి కావట ఒక ఎత్తు. అదీ.. కేసీఆర్ లాంటి మాటల/చేతల మాంత్రికుడ్ని ఓడించి ఆయన చేతిలోని అధికార దండాన్ని అందుకోవటం అంత ఈజీ కాదు. కానీ.. ఆ పనిని విజయవంతంగా చేసిన రేవంత్.. ఓవర్ నైట్ స్టార్ చాంఫియన్ గా అవతరించారు. రేవంత్ లాంటి నేతకు అధికార దండం అందటాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేని స్థితి. తన ఓటమి కంటే రేవంత్ విజయం గులాబీ బాస్ ను బాగా హర్ట్ చేసిందంటారు. వాస్తవాన్ని జీర్ణించుకోవటానికి ఆయనకు కాస్త ఎక్కువ సమయమే పట్టిందని చెబుతారు.
ఇంతటి ఘన విజయాన్ని అందిపుచ్చుకున్న వేళ.. రేవంత్ మరింత అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ ను మరిపించేలా ఆయన రాజకీయాన్ని పండించాలి. కానీ.. ఈ విషయంలో ఆయన ఎంత మేర సక్సెస్ అయ్యారు? అన్నది ప్రశ్న. క్యాలెండర్ లో కొత్త నెల వచ్చేసింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ కు మొదటి ఏడాది పూర్తి చేయటానికి మరింత దగ్గరకు వచ్చేశారు. గత ఏడాది డిసెంబరు 7న ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతల్ని చేపట్టారు.
అంట.. ఏడాది పూర్తి కావటానికి మరో 36 రోజులు మాత్రమే ఉన్నాయి. మరి.. ఇలాంటి వేళ.. ఆయన పాలన ఎలా సాగిందన్నది వేరే ముచ్చట. రాజకీయంగా ఆయన తన పరిణితిని ప్రదర్శించారా? కేసీఆర్ జాదూతనం రేవంత్ లో ఎంత ఉంది? ఆయన మాదిరి రేవంత్ తన మార్క్ ను చూపించారా? తనదైన ముద్రను వేశారా? లాంటి ప్రశ్నలు చాలానే వస్తాయి. మరి.. వాటికి సమాధానం వెతికినప్పుడు రేవంత్ పాస్ మార్కులకు దగ్గరగా మాత్రమే ఉండటంనిరాశకు గురి చేస్తుంది.
పాలనలోనూ.. కలల ప్రాజెక్టులను ఆవిష్కరించటంలో.. పాలనలో తనదైన మార్క్ ను ప్రదర్శించటంలోనూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒక సరైన షేప్ లోకి తీసుకురావటంలోనూ.. ఉద్యోగులకు నెల మొదటి రోజునే జీతాలు పడేలా చేయటంలోనూ.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్ని అమలు చేయటం లోనూ.. ఇలాంటి వాటిల్లో ఆయన ఫెర్ ఫార్మెన్స్ ఎలా ఉందన్నది పక్కన పెడితే.. రాజకీయంగా ఆయన ఎలా వ్యవహరించారన్నది మాత్రం తప్పనిసరిగా చూడాల్సిందే.
తెలంగాణ ఏర్పాటు వేళ.. కేసీఆర్ చేతికి పాలనా పగ్గాలు అందే సమయానికి అప్పటి టీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల బలం అంతంత మాత్రమే. కాంగ్రెస్.. తెలుగుదేశం.. వైసీపీ.. బీజేపీ.. మజ్లిస.. ఇలా అన్ని పార్టీల పాత్ర ఉండేది. దాని నుంచి ఒక పద్దతి ప్రకారం ఒక్కోపార్టీని కనుమరుగు చేయటమే కాదు.. అదే సమయంలో తన పార్టీని తిరుగులేని శక్తిగా మార్చటంతో పాటు.. తెలంగాణలో మరెవరికి అవకాశం కనుచూపు మేరలో కనిపించకుండా చేశారని చెప్పాలి. టీఆర్ఎస్ తప్పించి మరే పార్టీకి భవిష్యత్ లేదన్నభావన కలిగించటంలో సూపర్ సక్సెస్ అయ్యారు.
టార్గెట్ చేయాలే కానీ బంతి గోల్ పోస్టులోకి సూటిగా వెళ్లేలా వ్యవహరించిన ఆయన్ను చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యేవారు. పార్టీ పేరు ఏదైనా కావొచ్చు. నేతలు మరెవరైనా కావొచ్చు. తనకు దాసోహం అనేలా చేసుకోవటంలో కేసీఆర్ ప్రదర్శించిన పొలిటికల్ గేమ్ కు ఫిదా కానివారే లేరు. అయినప్పటికీ రెండో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. అజేయశక్తిగా మారిన తర్వాత చేసిన తప్పులకు ఆయన తన చేతిలోని అధికారాన్ని చేజార్చుకోవాల్సి వచ్చింది.
రేవంత్ విషయానికి వస్తే.. పొలిటికల్ గా ఆయన చేతల కంటే మాటలే ఎక్కువగా చెప్పారని చెప్పాలి. ఆయన ప్రభుత్వంలోని కీలక మంత్రులు సైతం అదే పరిస్థితి. విపక్ష బీఆర్ఎస్ ను ఖాళీ చేయిస్తామన్న మాట కాకున్నా.. ప్రతిపక్ష హోదా అన్నది లేకుండా రేవంత్ చేయనున్నారన్న హైప్ క్రియేట్ కావటం.. అందుకు తగ్గట్లుగా అప్పుడప్పుడు సీఎం రేవంత్ నోటి నుంచి వచ్చిన మాటలు రాజకీయ సంచలనంగా మారాయి. మరి.. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో అధికార పార్టీకి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే లేని లోటును కంటోన్మెంట్ ఉప ఎన్నిక ద్వారా తీర్చుకున్నప్పటికి.. ఆపరేషన్ ఆకర్ష్ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యిందనే చెప్పాలి.
ఒక దానం నాగేందర్.. ఒక అరికెపూడి గాంధీ.. మరో ప్రకాశ్ గౌడ్ లాంటి నేతల్ని తీసుకొచ్చినా.. అలా తీసుకురావటానికి రేవంత్ చాలానే శ్రమించాల్సి వచ్చింది. స్వేదం చిందించాల్సి వచ్చింది. ఇంత చేసిన తర్వాత కూడా హైదరాబాద్ మహానగరంలో మెజార్టీ ఎమ్మెల్యేలు అధికార గూటికి తీసుకురావటంలో రేవంత్ సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి. అంతేకాదు..గులాబీ కారును ఖాళీ చేస్తున్నట్లుగా ఇచ్చిన బిల్డప్ లు ఒకరోజు సంచలనానికి ఉపయోగపడ్డాయే కానీ.. మరెలాంటి ప్రభావాన్నిచూపించలేకపోయాయి. రేవంత్ బాటలోనే ఆయన ప్రభుత్వంలో కీలక మంత్రిగా పేరున్న పొంగులేటి పరిస్థితి కూడా. పొలిటికల్ బాంబ్ లు పేలనున్నట్లుగా చెప్పిన మాటకు.. దీపావళి అయ్యాక కూడా రాజకీయ టపాసు పేలటం తర్వాత.. దారుణంగా తుస్ మన్న తీరు రేవంత్ సర్కారు మీద ఉన్న గౌరవాన్ని తగ్గించేలా చేశాయని చెప్పాలి.
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. రాజకీయంగా ఒక లైన్ తీసుకున్న తర్వాత.. ముందుకు వెళ్లటమే తప్పించి వెనక్కి తగ్గటం అన్నదే ఉండకూడదు.ఈ విషయంలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ తన మార్క్ ను మాత్రం వేయలేదనే చెప్పాలి. పొలిటికల్ టపాసుల్ని పేల్చే విషయంలో ఆయన మరింత పరిణితిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అంతటి నైపుణ్యం ఇంకా రాలేదన్నప్పుడు.. టపాసులు పేల్చటం కంటే పాలన మీద ఫోకస్ పెట్టటమే తన ప్రాధాన్యత అన్న సంకేతాల్ని ఇచ్చినా బాగుండేది. అదీ కాక.. ఇదీ కాక పొలిటికల్ టపాసుల పేల్చటం ఎలానో గులాబీ బాస్ వద్ద రేవంత్ ట్రైనింగ్ తీసుకోవాలన్న భావనకు గురయ్యేలా చేయటం మంచిది కాదు. ఈ విషయాన్ని రేవంత్ గుర్తించారా?