రేవంత్‌.. ఈ మౌనం, ఈ బిడియం ఎందుకో!

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-04 12:09 GMT

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై తెలుగు సినీ పరిశ్రమే కాకుండా ఇతర భాషా నటులు సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు. చిన్న, పెద్దా నటులు అనే తేడా లేకుండా కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు సొంత పార్టీ కాంగ్రెస్‌ నేతలు సైతం కొండా సురేఖపై అసహనం వ్యక్తం చేశారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు చేస్తున్నారు. ఒకవైపు నాగార్జున ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇంకోవైపు బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సైతం కొండా సురేఖకు లీగల్‌ నోటీసులు ఇచ్చారు.

అయితే ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించకపోవడం అందరిలో ఆశ్చర్యంతోపాటు విస్మయం కలిగిస్తోంది. సాధారణంగా ఆయన దూకుడు కలిగిన నేత. కాంగ్రెస్‌ పార్టీలోకి ప్రవేశించిన స్వల్పకాలంలోనే తన వాగ్ధాటితో, దూకుడుతో ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దూకుడుకు చెక్‌ పెట్టగలిగిన ఏకైక నేతగా రేవంత్‌ పేరు తెచ్చుకున్నారు.

సాధారణంగా బీఆర్‌ఎస్‌ నుంచి హరీశ్‌ రావు, కేటీఆర్, కేసీఆర్‌.. ఇలా ఏ నేత అయినా విమర్శలు చేస్తే ఆ వెంటనే రేవంత్‌ రెడ్డి నుంచి కౌంటర్లు మొదలైపోతాయి. కానీ కొండా సురేఖ విషయంలో ఇంత రచ్చ రచ్చ అవుతున్నా రేవంత్‌ స్పందించకపోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఓవైపు స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలే కొండా సురేఖ ఆ వ్యాఖ్యలు చేసి ఉండకూడదని చెబుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌ స్పందించకపోవడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.

పోనీ స్పందించకపోవడానికి తనకు సంబంధం లేదనడానికి వీలు లేదు. రేవంత్‌ ప్రభుత్వంలో కొండా సురేఖ ఒక మంత్రిగా ఉన్నారు. ఆమెకు మంత్రి పదవిని ఇచ్చింది రేవంత్‌ రెడ్డే. మరి వివాదం రోజురోజుకూ ముదిరిపాకాన పడుతున్నా దేశ స్థాయిలో ఆమె వ్యాఖ్యలు తీవ్ర వివాదం రేపినా రేవంత్‌ రెడ్డి స్పందన ఇంతవరకూ లేదు. ఆయనది వ్యూహాత్మక మౌనమా లేక యాదృచ్ఛిక మౌనమా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో సీఎం రేవంత్‌.. స్పందిస్తారా లేదా, స్పందిస్తే ఏం చెబుతారు? కొండా సురేఖను మందలిస్తారా? లేక మంత్రి పదవి నుంచి తప్పిస్తారా అనే చర్చ జరుగుతోంది. వివాదం మొదలై మూడు రోజులవుతున్నా ఇంతవరకు ఆయన స్పందించలేదు. ఇప్పటిదాకా దాని గురించి తెలియదన్నట్టే ఉన్నారు.

ఇప్పటికైనా సీఎం రేవంత్‌ జోక్యం చేసుకుని నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News