మనిషన్నాక దేవుడంటే భయం, భక్తి ఉండాలి: జ‌గ‌న్‌

దేవుడిని రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచాల‌న్న సుప్రీంకోర్టు వ్యాఖ్య‌ల అంత‌రార్థం సీఎం చంద్ర‌బాబుకు అర్థం కాన‌ట్టే ఉంద‌న్నారు.

Update: 2024-10-04 14:56 GMT

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ వ్య‌వ‌హారాన్ని సీబీఐ నేతృత్వంలోని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందానికి అప్ప‌గిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం సీఎం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య లు చేశారు. మ‌నిష‌న్నాక దేవుడంటే భ‌యం, భ‌క్తి ఉండాల‌ని అన్నారు. కానీ, ఈ రెండూ టీడీపీ నేత‌ల‌కు లేవ‌ని ఎద్దేవా చేశారు. అందుకే త‌న‌పైనా, త‌న పార్టీ(వైసీపీ)పైనా దుర్బుద్ధితో కామెంట్లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాల‌ను తాము కూడా స్వాగ‌తిస్తున్నామ‌ని అన్నారు.

దేవుడిని రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచాల‌న్న సుప్రీంకోర్టు వ్యాఖ్య‌ల అంత‌రార్థం సీఎం చంద్ర‌బాబుకు అర్థం కాన‌ట్టే ఉంద‌న్నారు. దేవుడిని రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని, డ్రామాలు చేయొద్ద‌ని ఈ రోజు(శుక్ర‌వారం) కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింద‌ని.. అయినా.. టీడీపీ నేత‌ల‌కు క‌ళ్లు తెరుచుకోలేద‌ని అన్నారు. చంద్ర‌బాబు స్వ‌యంగా ఏర్పాటు చేసుకున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని(సిట్‌) కూడా సుప్రీంకోర్టు ర‌ద్దు చేసిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా.. టీడీపీ సోష‌ల్ మీడియాలో త‌న‌పై విమ‌ర్శ‌లు వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

నాకు-వారికి వ‌ర‌స‌లు క‌లిపారు..

కాగా, టీడీపీ సోష‌ల్ మీడియాలో టీటీడీ మాజీ ఈవో ధ‌ర్మారెడ్డికి, మాజీ చైర్మ‌న్ క‌రుణాక‌ర‌రెడ్డికి త‌న‌కు బంధుత్వం ఉందంటూ.. చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. "నాకు ధర్మారెడ్డి బావ అంట. కరుణాకర్ రెడ్డి మామ అంట. టీడీపీ ట్వీట్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది`` అని జ‌గ‌న్ అన్నారు. సుప్రీంకోర్టు చంద్రబాబు మీద అక్షింతలు వేసింద‌ని, అయినా.. కూడా జగన్ పాపం పండిందని, జగన్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింద‌ని వ్యాఖ్య‌లు చేశార‌ని మండిప‌డ్డారు. ఇవ‌న్నీ అబ‌ద్ధాలు కాదా? అని ప్ర‌శ్నించారు. ఇలాంటి వ‌ర‌స‌లు క‌లిపి ఇంకా ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అన్నారు.

ప‌విత్ర‌త‌ను మంట‌గలిపారు!

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని పేర్కొన‌డం ద్వారా తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను మంట‌గ‌లిపార ని జ‌గ‌న్ అన్నారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశార‌ని అన్నారు. సీఎం చంద్రబాబు ఒక‌ పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడార‌ని దుయ్య‌బ‌ట్టారు. టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు చేసిన ప్ర‌క‌ట‌న‌కు చంద్రబాబు ప్ర‌క‌న‌ట‌కు పొంత‌న ఉందా? అని ప్ర‌శ్నించారు. ఇన్ని ఆధారాలు క‌నిపిస్తున్నా.. చంద్ర‌బాబు, ఆయ‌న టీం ఇంకా అబ‌ద్ధాలు చెబుతూనే ఉన్నార‌ని, మ‌నిష‌న్నాక దేవుడంటే భ‌యం , భ‌క్తి ఉండాల‌ని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News